చర్మానికి సిక్స్‌ప్యాక్‌!

05-10-2017: వర్షాకాలంలో చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తడి తగిలితే ఒక్కోసారి చర్మం పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడే కొన్ని ఫేస్‌ప్యాక్స్‌ ప్రయత్నిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

గంధం పొడి ప్యాక్‌
చర్మంపై ఏర్పడే నల్లవలయాలు, మచ్చలు పోవడానికి ఓ మార్గం ఉంది. అరకప్పు పసుపు పొడి, నాలుగో వంతు రోజ్‌ వాటర్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ గంధం పొడి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 30 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి.

 
ఓట్స్‌ ప్యాక్‌
ఓట్స్‌ తినడానికే కాదు, ముఖ వర్ఛస్సు పెంచుకోవడానికి ఇవి పనిచేస్తాయి. ఓట్స్‌, తేనె, కోడి గుడ్డు సొన, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ముఖానికి పట్టించి, నీటితో కడుక్కోవాలి.
 
బనానా ప్యాక్‌
ముఖంపై ఏర్పడ్డ మచ్చలను అరటిగుజ్జు పోగొడుతుంది. అయితే అరటిగుజ్జు ఒక్కటే కాకుండా, దాంతో పాటు కాస్త పుదీనా ఆకులు కూడా వాడాలి. అరటిపండును గుజ్జుగా చేసి, అందులో పుదీనా ఆకులను వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించుకుని, 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి.
 
బాదం, రైస్‌ ప్యాక్‌
ఒక కప్పు పెరుగులో బియ్యం పిండి , తగినన్ని బాదం పలుకులు వేసి ఓ పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని రాత్రి నిద్రపోయేముందు రాసుకోవాలి.
 
కోడి గుడ్డు సొనతో ప్యాక్‌
కోడిగుడ్డు సొనలో తేనె కలుపుకొని, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. అది ఆరిపోయాక కడుక్కుంటే ముఖం ఫ్రెష్‌గా మారుతుంది. ఇది ఆయిలీ స్కిన్‌ వారికి బాగా పనికొస్తుంది.
 
టోనర్‌
ముఖంపై జిడ్డు పోగొట్టడం కోసం చాలా మంది టోనర్లు వాడతారు. వీటి వల్ల చర్మపై మట్టి, దుమ్ము వదిలిపోతాయి. బయట దొరికే ఖరీదైన టోనర్లు కాకుండా ఇంట్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో ఉంచిన రోజ్‌వాటర్‌, కీరదోసకాయ రసం కలిపి మిశ్రమాన్ని ముఖానికి ప్రతి రోజు రాత్రి పట్టించుకుంటే మంచిది. ఇది అప్లై చేసుకోవడానికి కాటన్‌ ట్యాబ్‌ (చిన్న క్లాత్‌) వాడాలి.