చలికాలంలో చర్మం ఎందుకు పొడిబారుతుందంటే..

25-01-2018: సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారుతుంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. మనం వాడే మందులు, రోజువారీ కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం మొదలైనవన్నీ దీనికి ప్రధాన కారణంగా నిలుస్తాయి. చలికాలంలో అన్నింటికీ వేడినీటిని వినియోగిస్తుంటారు. అయితే వేడి నీరు చర్మంలో ఉండే సహజ తేమ, నూనెలను కోల్పోయేలా చేసి, చర్మాన్ని పొడిగా మారుస్తుంది. అందుకే గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయాలి. ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం వలన కూడా చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. పొడి చర్మం అనేది వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. కుటుంబీకులలో ఎవరైనా పొడి చర్మం కలిగి ఉంటే వారి వంశంలోని వారికి ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు వాడకం వలన కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.