ఆంధ్రజ్యోతి, 02-10-2017: మీ ముఖాల్లో వెలుగులు విరజిమ్మాలంటే వంటింట్లో ఉండే వస్తువులతోనే బ్యూటీ ప్యాక్స్ తయారుచేసుకుని ముఖానికి రాసుకుంటే చాలు. పైసా ఖర్చు ఉండదు. పైగా అందంగా...ఆనందంగా పండుగను ఎంజాయ్ చేస్తారు. అందుకే కొన్ని స్కిన్ ప్యాక్స్ మీకోసం...
చిన్న పాత్రలో లావెండర్ ఆయిల్ వేసి రెండు టీస్పూన్ల సెనగపిండి, చిటికెడు పసుపు, వెన్న లేదా మీగడ అందులో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఆ పేస్టును ముఖానికి రాసుకుని 20 నిమిషాలు ఉంచుకున్న తర్వాత గులాబీ నీటితో (రోజ్ వాటర్) ముఖాన్ని కడిగేసుకోవాలి.
దానిమ్మగింజలు, తేనె కలిపిన ఫేస్ ప్యాక్ కూడా చర్మానికి ఎంతో మంచిది. ఇది ముఖానికి రాసుకుంటే చర్మం పట్టులా ఉండి వయసు కనపడదు. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు ,విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. అందుకే దానిమ్మగింజలను మెత్తగా చేసి అందులో ఒక టేబుల్ స్పూను తేనె వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత గులాబినీళ్లతో ముఖాన్ని కడిగేసుకోవాలి.
ఇంట్లోని బంతి మొక్కల నుంచి నాలుగైదు పూవులు తెంపి వాటి రెక్కలను పేస్టులా చేయాలి. ఆ పేస్టులో పచ్చిపాలతోపాటు ఒక టీస్పూను తేనెను కలిపి ఫేస్ ప్యాక్ తయారుచేయాలి. ఆ ప్యాక్‌ను ముఖానికి రాసుకుని 15 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆతర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ప్యాక్ చర్మానికి పట్టులాంటి మెరుపును ఇస్తుంది.