తెల్లని మోచేతులు.. మోకాళ్ల కోసం

ఆంధ్రజ్యోతి: కొందరికి  శరీరమంతా తెల్లగానే ఉన్నా మోచేతులు, మోకాళ్ల దగ్గరి చర్మం నల్లగా ఉంటుంది. ఆ ప్రదేశాల్లో నల్లబడ్డ చర్మం తెల్లగా మారాలంటే కొన్ని సౌందర్య చిట్కాలు పాటించాలి. 
 
 నిమ్మరసం

నిమ్మకాయను సగానికి తరిగి అర టీస్పూను ఉప్పు, చక్కెర అద్ది మోచేతులు, మోకాళ్లకు బాగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. నిమ్మరసంలో చర్మాన్ని తెల్లబరిచే విటమిన్‌ సి, సిట్రిక్‌ యాసిడ్లు ఉంటాయి. గరుకుగా ఉండే ఉప్పు, చక్కెర వల్ల చర్మంపైని మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతులీనుతుంది.

అశ్రద్ధ కూడదు

స్నానం చేసేటప్పుడు మోచేతులు, మోకాళ్లను అశ్రద్ధ చేయకూడదు. మిగతా శరీరావయవాలను శుభ్రం చేసుకున్నట్టే ఈ ప్రదేశాలను కూడా రుద్ది శుభ్రం చేసుకోవాలి. మేలురకం సబ్బు, లూఫాతో మోచేతులు, మోకాళ్లు బాగా రుద్దుకోవాలి. క్రమేపీ పేరుకునే మృతకణాల వల్ల ఈ ప్రదేశాల్లోని చర్మం నల్లబడుతుంది. కాబట్టి వారానికోసారి స్క్రబ్‌ చేయాలి.

బొప్పాయి

బొప్పాయిలో విటమిన్‌ ఎ, సిలతోపాటు చర్మాన్ని శుభ్రపరిచే పెపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. కాబట్టి బొప్పాయి గుజ్జులో పెరుగు కలిపి మోచేతులు, మోకాళ్లకు రుద్దాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఈ ప్రదేశాలు తేటగా తయారవుతాయి. బొప్పాయిలోని పోషకాలు మోచేతులు, మోకాళ్లను తెల్లబరిస్తే పెరుగు ఆ ప్రదేశాలకు తేమనందిస్తుంది. 

నూనెలతో మర్దనా

ఆలివ్‌ ఆయిల్‌, కొబ్బరి, బాదం నూనెల్లో విటమిన్‌ ఇ ఉంటుంది. ఇది చర్మానికి తేమనిచ్చి పొడి చర్మాన్ని కోమలంగా మారుస్తుంది. ఆలివ్‌ ఆయిల్‌లోని యాంటాక్సిడెంట్స్‌ నల్లని చర్మాన్ని రిపెయిర్‌ చేసి తెల్లగా మారుస్తాయి. ప్రతిరోజూ నిద్రకు ముందు ఈ నూనెల్లో ఏదో ఒకదాన్ని మోచేతులు, మోకాళ్లకు పట్టించాలి.