తల్లిపాలతో ఫేషియల్‌!

ఆంధ్రజ్యోతి: వేసవి వచ్చేసింది. చర్మ సంరక్షణకు అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సున్నితమైన చర్మానికి ముల్తానీమట్టి, మన్ను లాంటివి ఫేషియల్‌గా  ఎలా ఉపయోగిస్తున్నారో అలాగే ముందు ముందు తల్లి పాలను కూడా చర్మ సౌందర్యానికి ఫేషియల్‌గా ఉపయోగించే అవకాశాలున్నాయి. తల్లిపాల వల్ల చర్మం మృదువుగా ఉంటుందట. అంతేకాదు  చర్మసంబంధమైన ఎలర్జీలు రాకుండా ఉండడానికి కూడా తల్లిపాలను వాడొచ్చంటున్నారు బ్యూటీ నిపుణులు. అందుకే  చర్మసౌందర్యం కోసం బ్యూటీ క్లినిక్స్‌లో తల్లిపాలతో ట్రీట్‌మెంట్‌ ఇచ్చే ఆలోచనల్లో  ఉన్నారు. ఇటీవల చికాగోలో శ్యామా పటేల్‌ అనే ఆవిడ మడ్‌ ఫేషియల్‌ బార్‌ని ప్రారంభించారు.  తల్లిపాలతో  స్కిన్‌ కేర్‌ సేవలు కూడా అందించే ఆలోచనల్లో  ఉన్నారామె. ఈ ఆలోచనకు తల్లులే స్ఫూర్తి.. అమ్మల నుంచి తల్లిపాలను సేకరించి తన క్లయింట్లకు బ్యూటీ సేవలు అందించాలన్నది ఆమె ఆలోచన. అంతేకాదు తల్లిపాల వల్ల ఒనగూరే లాభాలను తన క్లయింట్లకు తెలియజెప్పాలని ఆమె భావిస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే తల్లి పాలను కేవలం తమ బిడ్డలకు ఇవ్వడమే కాకుండా పలు  ఇతర ప్రయోజనాల కోసం కూడా ఈ పాలను అమ్మలు వాడుతున్నారట. చర్మ రక్షణకు    ఉపయోగిస్తున్నారు. తల్లిపాలతో ఫేషియల్‌ చేయించుకుంటే యాక్నె, చర్మం ఎర్రబారడం వంటివి తగ్గుతాయి.  కళ్లలోపల పక్కు కట్టినపుడు, చిన్నపిల్లలకు డైపర్లు వేయడం వల్ల వచ్చే  ఎర్రటి  దద్దుర్లు తగ్గడం కోసం  తల్లిపాలను  వాడుతున్నారట. చికాగోలో  మిల్క్‌ బ్యాంక్స్‌ని కూడా ప్రారంభించారు. తల్లులు ఈ బ్యాంకుకు పాలను స్వచ్ఛందంగా డొనేట్‌ చేస్తారు. వీరిచ్చే తల్లిపాలను   స్ర్కీన్‌ చేసిగానీ  బ్యాంకులు తీసుకోవు.  తల్లులు ఐచ్ఛికంగా ఇచ్చిన  పాలనే బ్యూటీ ట్రీట్‌మెంట్‌కు ఉపయోగిస్తానంటున్నారు శ్యామా పటేల్‌. ఇపుడు వేసవి కాలం కూడా కావడంతో  చర్మానికి తల్లిపాల ఫేషియల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. సూర్య తాపం వల్ల ఎర్రబారిన చర్మానికి తల్లి పాలు చల్లటి లేపనంలా పనిచేస్తుందంటున్నారు బ్యూటీ నిపుణులు. సో....తల్లిపాలు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికీ కూడా బాగా ఉపయోగపడతాయన్నమాట.