సూక్ష్మక్రిమితో మొటిమలు మాయం

ఆంధ్రజ్యోతి(07/10/14): మొటిమలు, మచ్చలు తదితర చర్మ వ్యాధుల చికిత్సకు దోహదపడే కొత్త సూక్ష్మక్రిమిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చెమటలోని అమ్మోనియా ఈ సూక్ష్మక్రిమికి ప్రధాన ఆహారమని వారు చెప్పారు. ఈమేరకు మసాచుసెట్స్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ పరిశోధనలో వెల్లడైందన్నారు. అమ్మోనియా-ఆక్సిడైజింగ్‌ బ్యాక్టీరియా (ఏఓబీ)గా వ్యవహరించే ఈ బ్యాక్టీరియా భూమిపై, నీటిలోనూ జీవిస్తుందని, ఎన్విరాన్‌మెంటల్‌ నైట్రిఫికేషన్‌ పక్రియలో కీలకమైందన్నారు. ఆమ్మోనియా ఆక్సిడేషన్‌ సంబంధిత ఇతర ఉత్పత్తుల మాదిరిగానే చర్మం పనితీరును, భౌతిక ఆకారాన్ని మార్చగలవనే నమ్మకంతో శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం నిర్వహించారు. ఇందుకోసం 24 మంది వలంటీర్లను ఎంపిక చేసి రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపునకు ఏఓబీతో ఫేస్‌ప్యాక్‌, స్కాల్ప్‌ పట్టించగా మరో గ్రూపునకు మార్కెట్లో దొరికే ఇతర మందులను ఉ పయోగించారు. రెండు వారాల పాటు సాగిన ఈ ప్రయోగంలో వలంటీర్లను హెయిర్‌ ప్రొడక్టులకు దూరంగా ఉంచారు. మూడో వారం చివర లో రెండు గ్రూపులను పరిశీలించగా.. ఏఓబీ ఉపయోగించిన గ్రూపులో ఉన్న వలంటీర్ల చర్మం నునుపుదనాన్ని సంతరించుకుందని వెల్లడైంది.