రోజ్‌ సౌందర్యం

ఆంధ్రజ్యోతి(6-4-15): రోజా పువ్వు ప్రేమను వ్యక్తీకరించేందుకు పనికొచ్చే పువ్వే కాదు. సౌందర్యాన్నిచ్చే ఫ్లవర్‌ కూడా! ఈ విషయం ఇప్పుడు కనుక్కున్నది కాదు. పూర్వం గ్రీకులు, రోమన్లు రోజాపువ్వు రేకుల్ని స్నానపు గదుల్లోని నీళ్లలో వాడేవాళ్లట. ప్రస్తుతం రోజ్‌వాటర్‌, రోజ్‌ ఆయిల్‌ వంటివి మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వాటితో పాటు మరింత తాజాగా కనిపించేందుకు రోజా పూలను వాడండి..

 సాయంత్రం ఇంటికి వస్తూనే ముఖంలో అలసట కనిపిస్తుంది. చర్మం వాడిపోయినట్లు అనిపిస్తుంది. దీనికి చక్కటి పరిష్కారం రోజ్‌ వాటర్‌. మెత్తటి దూది ఉండను రోజ్‌ వాటర్‌లో ముంచి.. ముఖం మీద వలయాకారంలో అద్దితే.. సమస్య తొలగిపోతుంది. దుమ్ము కణాలూ పోతాయి.

రోజాపువ్వుల్లో విటమిన్‌ సి పుష్కలం. ఎండకు వెళ్లినప్పుడు ఏర్పడిన నలుపు చారల్ని తొలగిస్తుంది రోజ్‌ వాటర్‌. కీరా జ్యూస్‌, గ్లిసరిన్‌లతో రోజ్‌వాటర్‌ను కలిపి.. ముఖానికి రాసుకోవచ్చు. అయితే ఎండకు బయటికి వెళ్లే ముందు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ముఖం మీద మొటిమలు పోగొట్టేందుకు రోజ్‌వాటర్‌ చక్కగా ఉపకరిస్తుంది. ఎక్కడైనా చర్మం పగుళ్లుబారి ఎర్రగా మారుంటే.. దాన్ని నయం చేస్తుంది. ఎగ్జిమా వంటి చర్మసమస్యల్ని దూరం చేస్తుంది.

ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిళ్ల వల్ల మనసు మూడీగా మారిపోతుంటుంది. ఎంగ్జాయిటీ మొదలవుతుంది. ఇవి తొలగాలంటే .. రోజా పూల రేకుల్ని బకెట్‌లోకి వేసుకుని స్నానం చేయొచ్చు. దీనివల్ల మనసులోని చికాకులు తొలగిపోయి.. రాత్రికి ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

రోజ్‌వాటర్‌ తలకు పట్టించుకుంటే బోలెడన్ని లాభాలు. ఎండాకాలం మాడు జిడ్డుగా మారుతుంటుంది. దానివల్ల చుండ్రు వస్తుంది. నవ్వలు మొదలవుతాయి. ఇలాంటప్పుడు రోజ్‌వాటర్‌తో తల మాడును మర్దన చేసుకుంటే.. రక్తప్రసరణ సాఫీగా సాగి.. జుట్టు కుదుళ్లు శక్తిని పుంజుకుని.. నిగనిగలాడతాయి.

తాజా రోజా వూలు పడగ్గది మూడ్‌ను రెట్టింపు చేస్తాయి. దంపతుల మధ్య దాంపత్య జీవితం బలపడేందుకు రోజాలు ఉపయోగపడతాయంటున్నారు అధ్యయనకారులు. రాత్రి పూట పడక మీద రకరకాల రోజా పూల రేకుల్ని చల్లడం ద్వారా దంపతుల మూడ్‌ హఠాత్తుగా మారుతుందన్నది సారాంశం.