పొంచి ఉన్న చర్మవ్యాధులు..

ఆంధ్రజ్యోతి(26-10-2016): శీతాకాలం వచ్చేస్తుంది... అప్పుడే శీతగాలులు మొదలయ్యాయి. మరికొద్ది రోజుల్లో చలి తన ప్రతాపాన్ని చూపనున్నది. శీతాకాలంలో అనేక రకాల చర్మవ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. గతంలో ఏమైనా చర్మవ్యాధులు ఉంటే అవి ఈ సీజన్‌లో బహిర్గతమై మరింత ఇబ్బందికి గురిచేస్తాయి. జన్యుపరంగా సంక్రమించే చర్యవ్యాధులు మరింత బాధ కలిగిస్తాయి. చలికాలంలో చర్మం పొడిగా తయారవ్వడం, సన్నటిపగుళ్లు ఏర్పడడం, కురుపులు వచ్చి దురదగా ఉండడం... వాటిని గోకితే పుండ్లుగా మారడం, దానిపై బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన వస్తుంది. ముఖం, చేతులు, పాదాలు పెలుసుబారుతాయి. పెదాలకు పగుళ్లు ఏర్పడి బయటకు రక్తం రావడమే కాకుండా పెలుసుగా తయారై తినేందుకు నోరు తెరవడమే కష్టమనిపిస్తుంది. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి రుగ్మతలకు దూరంగా ఉండవచ్చునని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
 
 చర్మం శరీరానికి రక్షణ కవచంగా ఉంటుంది. బయట ఉన్న సూక్ష్మ క్రిములు, శరీరానికి హాని చేసే వాయువులు, ఇతర పదార్థాలు శరీరానికి తాకకుండా, లోపలకు పోకుండా చర్మం అడ్డుకుంటుంది. కాలానుగుణంగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. శరీరంలోని తేమ బయటకు పోకుండా కాపాడుతుంది. చర్మం పై పొరలో ఉండే మృతకణాలు, నూనె సంబంధిత కణాలు శరీరంలో తేమ బయటకు అడ్డుకుంటాయి. వయసులో వచ్చిన మార్పుల వల్ల, చర్మానికి హాని కలిగించే క్రిములు, సబ్బులు, లోషన్లు వినియోగించడం వల్ల వీటిలోని రసాయినాలు చర్మం పొరలో ఉండే నూనె సంబంధిత పదార్థాల సహజత్వాన్ని నశింపజేస్తాయి. మృత కణాలతో పాటు, కొన్ని జీవకణాలను కూడా నాశనం చేస్తాయి. ఫలితంగా శరీరంలోని తేమ బయటకు పోతుంది. తద్వారా చర్మం పొడిబారి పలురకాల వ్యాధులకు దారితీస్తాయి.
 
శరీరానికి భద్రత 
శరీరానికి భద్రతనిచ్చే చర్మానికి పూర్తిస్థాయిలో రక్షణ ఇవ్వాలి. వేసవి, వర్షాకాలం, చలికాలం... ఇలా సీజన్‌ ఏదైనా చర్మం అందుకు అనుగుణంగా మారి శరీరానికి రక్షణ ఇస్తుంది. అందువల్ల చర్మాన్ని దీన్ని పూర్తిస్థాయి ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సూక్ష్మక్రిములకు, బ్యాక్టీరియాకు తావిచ్చే వ్యర్థాలేవీ చర్మంలోని ఏ భాగంలోనూ లేకుండా చూసూకోవాలి. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు వైద్యనిపుణులు. చలికాలంలో బాగా వేడిగా, బాగా చల్లగాను ఉన్న నీటితో స్నానం చేయకూడదు. ఈ వేడిమిని, చల్లదనాన్ని కొన్ని కణాలు తట్టుకోలేవు. దీనివల్ల చర్మం పని సామర్థ్యం తగ్గిపోవడమే కాకుండా మృతకణాల సంఖ్యపెరుగుతుంది. కొవ్వు సంబంధిత పదార్థాలు కొంత గుణాన్ని కోల్పోతాయి.
 
అనువైన వస్త్రాలు:
శీతాకాలంలో చర్మంలో కొన్ని మార్పులు వస్తాయి. అందుకు తగ్గట్టుగానే వస్త్రాలను ఎంపిక చేసి ధరించాలి. దలసరి మొత్తని దుస్తులు వేసుకోవడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పివుంచే వసా్త్రలనే ధరించాలి. ఎక్కువ చలిలో తిరగాల్సి వస్తే ముక్కు, చెవులు మూసుకునేలా మాస్క్‌లు వాడాలి.
 
ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
మితంగా ఆహారం తీసుకోవాలి
మాంసాహారం తినడం మంచిది కాదు
ఉడికించిన ఆకుకూరలు, కాయగూరలు శ్రేష్ఠం
నీరు ఎక్కువగా తాగాలి
పండ్లు, కాయలు ఎక్కువగా తినాలి
కాయధాన్యాలు మరింత మేలు చేస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
శరీర ఉష్ణోగ్రతకు సుమారుగా ఉన్న వేడి నీటితో స్నానం చేయాలి.
ఫ్లోరైడ్‌ కంటెంట్స్‌ ఎక్కువగా ఉన్న నీటిని స్నానానికి వినియోగించడం అంత మంచిది కాదు.
గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు వినియోగించడం వల్ల చర్మానికి మేలుకంటే హానే ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాఢత తక్కువ కలిగిన సబ్బులనే వినియోగించాలి.
స్నానం తరువాత మొత్తని పొడి గుడ్డతో మృదువుగా శరీరాన్ని తుడవాలి.
గుడ్డతో గట్టిగా రుద్దడం వల్ల చర్మంలోని తేమ బయటకు పోయే అవకాశం ఉంది.
చర్మానికి నాణ్యమైన బ్రాండెడ్‌ మాయిశ్చరైజర్‌ ను అప్లై చేయడం వల్ల చర్మం తేమగాను, మృదువుగాను, ముడతలు రాకుండా ఉంటుంది.
కాస్మొటాలజిస్టులు అభిప్రాయ పడుతున్నారు.
మన చేతుల్లో చర్మరక్షణ, సౌందర్యం 
చర్మరక్షణ, సౌందర్యం కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. చిన్నచిన్న చిట్కాలు పాటించడం ద్వారా అన్ని కాలాల్లోను చర్మరోగాలకు దూరంగా ఉండవచ్చు. శీతాకాలంలో చర్మం పొడిబారి పొలుసులు రావడం, పొడిగా మారడం సహజం. చర్మం పై పొరలో తేమ తగ్గడమే ఇందుకు కారణం. మాయిశ్చరైజ్‌ క్రీమ్‌ను శరీరానికి అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎక్కువ ఎండ, ఎక్కువ చలికి గురికాకుండా చూసుకోవాలి. ద్ర వాహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. సీజనల్‌గా వచ్చే చర్మరోగాలకు అనేక రకాల లోషన్లు, క్రీమ్‌లు వాడవచ్చు. అయితే వాటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే వినియోగించాలి. జన్యుపరంగా చర్యవ్యాధులు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. 
-డాక్టర్‌ జమునారాణి (ట్రైకాలజిస్ట్‌)