అలర్జీల అంతు చూద్దాం

ఆంధ్రజ్యోతి,19-9-2016:కొన్ని పదార్థాలకు, వస్తువులకు మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ వ్యతిరేకంగా స్పందించడమే అలర్జీ. అలర్జీ వంశపారంపర్యంగా సంక్రమించే రుగ్మత. పూల పుప్పొడి, దుమ్ము, చల్లని నీరు, ఫంగస్...వీటి వల్ల మనలో చాలామందికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ అలర్జీ ఉన్న వ్యక్తుల రోగనిరోధక వ్యవస్థ వీటిని ప్రమాదంగా భావించి అసాధారణంగా స్పందిస్తుంది. ఫలితంగా అలర్జీ లక్షణాలు వేధిస్తాయి. అలర్జీలో సీజనల్‌, పెరీనియల్‌ అనే రెండు రకాలున్నాయి. సంవత్సరంలో కొన్ని రోజుల్లోనే అలర్జీ లక్షణాలు వేధిస్తే దాన్ని సీజనల్‌ అని అలాకాకుండా సంవత్సరం పొడవునా ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని పెరీనియల్‌ అని అంటారు. కొన్ని సీజన్‌లలో పూల పుప్పొడి గాలిలోకి విడుదలై దాని వల్ల అలర్జీ కనిపించవచ్చు. ఇక పెరీనియల్‌ అలర్జీ రెండు రకాలుగా ఉంటుంది. కార్పెట్లు, కర్టెన్లు మొదలైన ఇంట్లోని వస్తువుల వల్ల వచ్చే ఇండోర్‌ లేదా కాలుష్యం వల్ల వచ్చే ఔట్‌డోర్‌ అలర్జీలు ఉంటాయి. ఈ అలర్జీలన్నీ వేర్వేరు లక్షణాలతో బయటపడుతూ ఉంటాయి. వాటిని బట్టి అలర్జీలను ఇలా విడగొట్టుకోవచ్చు.

 
శ్వాసకోశ అలర్జీ
ఎక్కువమందిని వేధించే అలర్జీ ఇది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీలన్నీ ఈ కోవలోకొస్తాయి. ముక్కు నుంచి నీరు కారటం, తుమ్ములు, ముక్కు దిబ్బెడ, కళ్లలోంచి నీరు కారటం, కళ్లు ఎర్రబడటం, ముక్కు, గొంతు, కళ్లు, చెవుల్లో దురద...ఈ అలర్జీ ప్రధాన లక్షణాలు. అయితే ఇది సీజనల్‌గా రావొచ్చు. లేదా సంవత్సరం పొడవునా వేధించే పెరీనియల్‌ అలర్జీ కూడా అయి ఉండవచ్చు. సీజనల్‌గా అయితే కొన్ని సీజన్స్‌లో గాలిలోకి పూల పుప్పొడి విడుదలై వాటి వల్ల అలర్జీ మొదలవుతుంది. ఇంట్లోని పెంపుడు జంతువులు, ఫంగస్‌, డస్ట్‌ మైట్స్‌ వల్ల లేదా బయటి గాలి కాలుష్యం వల్ల...ఇండోర్‌, ఔట్‌డోర్‌ పెరీనియల్‌ అలర్జీలు కూడా వేధించొచ్చు.
 
జీర్ణకోశ సంబంధిత అలర్జీ
మనం తీసుకునే ఆహారం వల్ల తలెత్తే అలర్జీలన్నీ ఫుడ్‌ అలర్జీ కోవలోకొస్తాయి. కడుపులో నొప్పి, విరేచనాలు, దద్దుర్లు ఈ అలర్జీ లక్షణాలు. ఆహారంలో కృత్రిమ రంగులు, రుచిని పెంచే పదార్థాలు, ప్రిజర్వేటివ్స్‌ కలపటమే అలర్జీ కారణాలు. వీటితోపాటు రకరకాల పదార్థాలను కలిపి తినటంకూడా ఫుడ్‌ అలర్జీకి దారి తీయొచ్చు. మల్టీ గ్రెయిన్‌ ఫుడ్‌ కూడా ఆ కోవకు చెందినదే! అలాగే విదేశాల నుంచి దిగుమతి అయిన పళ్లు, కూరగాయలు, పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, సంకర వంగడాలు, హైబ్రిడ్‌ రకాలు కూడా అలర్జీని ప్రేరేపిస్తాయి. ఇలాంటప్పుడు వేటి వల్ల అలర్జీ కనిపిస్తే ఆ పదార్థానికి జీవితాంతం దూరంగా ఉండటమొక్కటే పరిష్కారం.
 
డ్రగ్‌ అలర్జీ
కొన్ని మందుల వల్ల కూడా రియాక్షన్‌ తలెత్తవచ్చు. కొందరికి పెయిన్‌ కిల్లర్స్‌ పడకపోవచ్చు. మరికొందరికి యాంటిబయాటిక్స్‌ అలర్జీకి కారణమవ్వొచ్చు. ఇలా డ్రగ్‌ అలర్జీ ఉందని తెలిసినప్పుడు జీవితాంతం వాటికి దూరంగా ఉండాలి. అలాగే కాంబినేషన్‌ డ్రగ్స్‌ వల్ల కూడా అలర్జీ తలెత్తవచ్చు. అంటే...రెండు మూడు ఆరోగ్య సమస్యలకు ఉద్దేశించిన రకరకాల మందులను వాడాల్సివస్తే మందుల మధ్య కనీసం అరగంటైనా గ్యాప్‌ పాటించాలి. అలాగే మందుల్లో నాణ్యత లోపించినా రియాక్షన్‌ తలెత్తవచ్చు. కాబట్టి నాణ్యమైన మందులనే వాడాలి.
 
ఇన్‌సెక్ట్‌ అలర్జీ
చీమలు, తేనెటీగలు, కందిరీగలు కుట్టటం వల్ల తాత్కాలికంగా నొప్పి, దురద, వాపులాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ అలర్జీ ఉన్న వాళ్లలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండి ఎక్కువ కాలం బాధిస్తాయి. అలాగే డస్ట్‌ మైట్స్‌, బొద్దింకలు లాంటి కీటకాల వల్ల కూడా అలర్జీ ఉన్న వ్యక్తుల్లో తుమ్ములు, జలుబు, కళ్లు దురదలు, గొంతులో వాపులాంటి లక్షణాలు బాధిస్తాయి. ఉబ్బసం ఉన్న వాళ్లకు ఈ అలర్జీ వల్ల ఉబ్బసం తిరగబెడుతుంది.
 
అలర్జిక్‌ ఆస్తమా
ఉబ్బసం ఉన్న వ్యక్తులకు అలర్జీ కూడా ఉంటే అలర్జీ కారక వస్తువులు, పదార్థాలకు గురయిన ప్రతిసారీ అది ఆస్తమాకు దారి తీస్తూ ఉంటుంది. ఇలాంటివాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.
 
స్కిన్‌ అలర్జీ
ఆహారం లేదా మందులు తీసుకోవటం ద్వారా, చర్మానికి ఏదైనా తగలటం వల్ల ఈ రకమైన అలర్జీలు వస్తాయి. కాంటాక్ట్‌ అలర్జీ, కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌ అనే 2 రకాల స్కిన్‌ అలర్జీలున్నాయి. వాచ్‌ సా్ట్రప్‌, ఆర్టిఫిసియల్‌ జ్యువెలరీ, ప్లాస్టిక్‌, లెదర్‌, రబ్బర్‌ మొదలైనవి శరీరానికి తగలటం వల్ల తలెత్తేవి కాంటాక్స్‌ డెర్మటైటిస్‌ అలర్జీ. ఈ అలర్జీలు రాకుండా ఉండాలంటే వాటికి దూరంగా ఉండాలి. కాంటాక్ట్‌ డెర్మటైటిస్‌ దేని వల్ల వస్తుందో తెలుసుకోవటం కోసం వైద్యులు ప్యాచ్‌ టెస్ట్‌ చేస్తారు. ఫలితాన్ని బట్టి ఆ వస్తువుకు దూరంగా ఉండాలని సూచిస్తారు. ఇక మందులు, ఆహారం వల్ల తలెత్తే చర్మ సంబంధ అలర్జీల్లో దద్దుర్లు, దురదలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి ఐస్‌, చల్లగాలి లాంటివి చల్లని చర్మానికి తగలటం వల్ల అలర్జీ వస్తుంది. దీన్ని ‘కోల్డ్‌ అర్టికేరియా’ అంటారు.
 
సమర్థవంతమైన చికిత్సలు
అలర్జీ కారకాలు, తీవ్రతలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం వ్యాధి చరిత్ర, రక్త పరీక్ష, స్కిన్‌ ప్రిక్‌ టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. రక్త పరీక్షతో జన్యుపరంగా అలర్జీ ఉందా అన్న విషయంతోపాటు అలర్జీ లెవెల్‌ తెలుస్తుంది. చర్మం పైన అనుమానిత అలర్జీ కారకాలను గుచ్చి దేని వల్ల అలర్జిక్‌ రియాక్షన్‌ తలెత్తుతుందో గ్రహించే పరీక్ష స్కిన్‌ ప్రిక్‌ టెస్ట్‌. ఈ పరీక్షతో పూలపుప్పొడి, డస్ట్‌ మైట్‌, కీటకాలు...ఇలా దేనివల్ల అలర్జీ వస్తుందో ఈ పరీక్షలతో కనిపెట్టవచ్చు. చర్మానికి తగిలినప్పుడు తలెత్తే అలర్జీలను ప్యాచ్‌ టెస్ట్‌తో గుర్తించి చికిత్స చేసే వీలుంది. అలర్జీ లక్షణాలు కారకాలకు గురయినప్పుడు మాత్రమే కనిపిస్తూ కనుమరుగవుతూ ఉంటే యాంటీ హిస్టమిన్లతో చికిత్స చేయొచ్చు. అలాకాకుండా తరచుగా వేధిస్తూ దైనందిన జీవితాన్ని డిస్టర్బ్‌ చేస్తూ ఉంటే పరిస్థితిని తీవ్రంగానే భావించాలి. ఇలాంటివాళ్లు పరీక్షలు చేయించుకుని కారకాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి. ముక్కుకు సంబంధించిన అలర్జీ కోసం నాసల్‌ స్ర్పే వాడాల్సి ఉంటుంది. అలాగే లైఫ్‌ స్టయిల్‌ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.
 
వ్యాక్సిన్లు
నాసల్‌ స్ర్పే, మందులు తీసుకుంటున్నా అలర్జీ అదుపు కాకపోతున్నా, ఈ మందులతో పని లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకున్నా అలర్జీ వ్యాక్సిన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్కిన్‌ ప్రిక్‌ టెస్ట్‌ చేసి పడని వస్తువును తెలుసుకుని దానికి విరుగుడుగా వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే డస్ట్‌, పూల పుప్పొడి...ఈ రెండింటికి సంబంధించిన అలర్జీలకు మాత్రమే వ్యాక్సిన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు నెలకు ఒకటి చొప్పున రెండేళ్లపాటు తీసుకుంటే అలర్జీ నుంచి ఐదేళ్లపాటు రక్షణ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ వ్యాక్సిన్లు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్లు తీసుకోవటానికి కనీస వయోపరిమితి 12 ఏళ్లు. ఫుడ్‌ అలర్జీకి వ్యాక్సిన్లు లేవు. డ్రగ్‌ అలర్జీకి ఉన్నా దాని ప్రభావం తాత్కాలికమే! ఇక ఇన్‌సెక్ట్‌ అలర్జీలకు వ్యాక్సిన్స్‌ ఉన్నాయి.
 
డస్ట్‌ మైట్‌ పిల్లో, మ్యాట్రెస్‌ కవర్స్‌
ఇవి డస్ట్‌మైట్స్‌ను పైకి రాకుండా అడ్డుకుంటాయి. దిండ్లు, పరుపులకు ఈ కవర్లు తొడిగితే వాటిని దాటుకుని డస్ట్‌ మైట్స్‌ బయటికి రాలేవు. దాంతో అలర్జీ నుంచి రక్షణ పొందవచ్చు. వీటితోపాటు తరచుగా దిండ్లు, పరుపులను కూడా ఎండలో ఆరేస్తూ ఉంటే డస్ట్‌ మైట్స్‌ నాశనమవుతాయి.
 
నాన్‌ అలర్జిక్‌ రైనైటిస్‌
ఈ రుగ్మత లక్షణాలన్నీ అలర్జిక్‌ రైనైటి్‌సనే పోలి ఉన్నా ఇది అలర్జీ కాదు. ఈ రుగ్మతలో ముందు తుమ్ములు, ముక్కునుంచి నీరు కారటం, ముక్కు దిబ్బెడ లక్షణాలతో మొదలై నాలుగైదు రోజుల్లో ముక్కులో నుంచి చిక్కని ద్రవం కారటం కనిపిస్తుంది. అలాగే అలర్జీ లక్షణాలతోపాటు ఒళ్లు నొప్పులు, జ్వరం ఉంటే దీన్ని ఫ్లూ జ్వరంగా భావించాలి. 
 
ఈ అలర్జీలు డేంజర్‌
సాధారణంగా వచ్చి వేధించే అలర్జీ ప్రాణాంతకం కాదు. కానీ తీవ్రమైన అలర్జీ ప్రాణాలకే ప్రమాదం తలపెట్టవచ్చు. ఇది ఫుడ్‌, డ్రగ్‌ అలర్జీల్లో ఏదైనా కావొచ్చు. తుమ్ములు, పిల్లి కూతలు, ఆయాసం, దద్దుర్లు, నీరసం...ఈ లక్షణాలు కనిపిస్తే ‘అనాఫిలాక్సిస్‌’ అనే తీవ్రమైన అలర్జీకి లోనైనట్టు అర్ధం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నాలుక, గొంతు లోపల వాపుతో శ్వాస ఆడని పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని యాంజియో న్యూరోటిక్‌ ఎడిమా అంటారు. ఈ రెండు అలర్జీలకు 5 నుంచి 10 నిమిషాల్లో చికిత్సనందించాలి. వీటిని సాధారణ అలర్జీలుగా భావించి మందులు తీసుకోకుండా సాధ్యమైనంత త్వరగా వైద్యుల్ని సంప్రదించాలి. దీనికి ఎడ్రినలిన్‌ హార్మోన్‌ ఇంజెక్షన్‌తోపాటు స్టిరాయిడ్స్‌, యాంటి హిస్టమిన్లు కూడా ఇచ్చి వైద్యులు పరిస్థితిని అదుపులోకి తెస్తారు.
 
పోలెన్‌ క్యాలెండర్‌
అలర్జీ కారక మొక్కల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మరి మన పరిసరాల్లో అలాంటి మొక్కలు ఉన్నాయో లేదో తెలుసుకునేదెలా? ఇందుకోసం ఢిల్లీ యూనివర్శిటీ క్యాంప్‌సలోని వల్లభాయ్‌ పటేల్‌ చెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతి ఒక్క రాష్ట్రానికి ఓ పోలెన్‌ క్యాలెండర్‌ను రూపొందించింది. ఏ సీజన్‌లో ఏ మొక్క పూల పుప్పొడితో ప్రమాదం ఉందో తెలుసుకుని వాటిని నాటకుండా ఉండటం కోసం లేదా ఉన్న వాటిని తొలగించుకోవటానికి ఈ క్యాలెండర్‌ ఉపయోగపడుతుంది.
 
చిన్న పిల్లల్లో 
చిన్న పిల్లల్లో సాధారణంగా కనిపించే అలర్జీ...‘ఎటోపిక్‌ ఎగ్జిమా’. దురదతో, దద్దుర్లతో కూడిన ఈ అలర్జీ పుట్టిన సంవత్సరంలోపు కనిపిస్తే ఆ పిల్లలకు ముందు రోజుల్లో నాసల్‌ అలర్జీ తర్వాత ఆస్తమా రాబోతోందని గ్రహించాలి. ఇలాంటి పిల్లలకు అలర్జీ లక్షణాలు తలెత్తకుండా నియంత్రించటం కోసం ఘనాహారాన్ని కాస్త ఆలస్యంగా సంవత్సరం వయసు నుంచి అందించాలి. అప్పటివరకూ పళ్ల రసాలు, సూప్‌లు, జావలనే ఇవ్వాలి. అలర్జీ వంశపారంపర్యంగా సంక్రమించే రుగ్మతే! అయితే దీన్ని తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా కొంతమేరకు నియంత్రించే వీలుంది. ఇందుకోసం గర్భిణిగా ఉన్నప్పుడు నట్స్‌, కోడిగుడ్లు, పాలు, సీ ఫుడ్స్‌ను పూర్తిగా మానేయాలి. వీటితోపాటు ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి.
పిల్లలు ఇంట్లోనే ఎక్కువ సమయం గడపకుండా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
శారీరక వ్యాయామం ఉండేలా చూడాలి.

అపరిశుభ్రత ఉన్న చోట సూక్ష్మజీవులకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ అవుతాం. ఇలా ఎక్స్‌పోజ్‌ అవటం వల్ల మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దృష్టంతా వాటి మీద పడుతుంది. ఫలితంగా మనలోని ఇమ్యూనిటీ ఇతరత్రా అలర్జీకారకాలకు అంత తేలికగా స్పందించదు. దీన్నే హైజీన్‌ థియరీ అంటారు. కాబట్టి అతి శుభ్రం కూడా అలర్జీ కారకమే అనుకోవచ్చు. అయితే ఎంత శుభ్రం అవసరం అనేది ఎవరికి వాళ్లు నిర్ణయించుకుని పాటించాలి.

డస్ట్‌ మైట్స్‌ దుప్పట్లు, దిండ్లు, కార్పెట్లు, కర్టెన్లు...ఇలా ఇంట్లో ప్రతిరోజూ ఉపయోగించే వస్తువుల్లో ఉంటాయి. ఈ డస్ట్‌ మైట్స్‌ విడుదల చేసే కొన్ని పదార్థాల వల్లే అలర్జీ వస్తుంది. కాబట్టి ఈ వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
తరచుగా వీటిని దులిపి ఎండలో వేస్తుండాలి.
ఇంట్లో ఫంగస్‌ ఉంటే వెంటనే తొలగించాలి.
ఇంట్లో తేమ తగ్గించాలి.
పెంపుడు జంతువులకు ఇంట్లో స్థానం కల్పించకూడదు.
ఏ ఆహారం వల్ల అలర్జీ తలెత్తినా దాన్ని జీవితాంతం మానేయాలి.
డ్రగ్‌ అలర్జీకి గురయినా దానికి జీవితాంతం దూరంగా ఉండాలి.
రకరకాల టాబ్లెట్లు ఒకేసారి వేసుకోకుండా గ్యాప్‌ పాటించాలి.
అపరాలు, ధాన్యాలు కలిపి తీసుకోకూడదు.
రకరకాల పదార్థాలు కలిపి తయారుచేసిన పదార్థాలను మానేయాలి.
పార్థీనియం అనే అలర్జీ కారక మొక్క పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి.
అలర్జీలు ప్రాణాంతకం కాకపోయినా దైనందిన జీవితాన్ని డిస్టర్బ్‌ చేస్తుంటే మాత్రం వాటిని తేలికగా తీసుకో కూడదు. తీవ్రతనుబట్టి అలర్జీలను అదుపుచేసే మందులతోపాటు వ్యాక్సిన్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయంటున్నారు ఈన్‌టి కన్సల్టెంట్‌ ‘డాక్టర్‌ వి.శాతవాహన చౌదరి’.