ఒత్తిడితోనే తల నెరుస్తుంది

బోస్టన్‌, జనవరి 23: మానసిక ఒత్తిడికి, వెంట్రుకలు తెల్లబడటానికి మధ్య గల సంబంధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి ఎలుకల్లో గుర్తించారు. ఒత్తిడి వల్ల వెంట్రుకల కుదుళ్ల దగ్గర ఉండే మెలనోసైట్లు ప్రభావితం అవుతాయని, అందువల్ల జుట్టు రంగు మారుతుందని చెప్పారు. వెంట్రుకల రంగులో మెలనోసైట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా ఒత్తిడిని కలుగజేసే ఒక రకమైన ఔషధాన్ని ఎలుకల్లో ప్రవేశపెట్టారు.

 కొన్ని వారాల తర్వాత వాటి వెంట్రుకలు పూర్తిగా తెల్లబడ్డాయి. జుట్టు తెల్లబడకుండా మందులు తయారు చేయడంలో ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెప్పారు. కాగా, ఒత్తిడి వల్ల జుట్టు తెల్లబడుతుందని చాలా కాలంగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. తాజా పరిశోధనతో శాస్త్రీయత లభించినట్లైంది