ఎంత తిన్నా బరువు పెరగడం లేదెందుకు..?

(ఆంధ్రజ్యోతి, 22-12-2019):

ప్రశ్న:నాకు ఇరవై ఏళ్లు. ఎంత తిన్నా బరువు పెరగదు, బలం రావడం లేదు. ఎప్పుడూ నీరసమే. నా సమస్యకు పరిష్కారం ఏమిటి?
- అనిల్‌ కుమార్‌, హైదరాబాద్‌
 
డాక్టర్ సమాధానం: వయసును బట్టి, జీవన విధానాన్ని బట్టి మీరు 2500 కెలోరీల ఆహారం తినాలి. కానీ బరువు పెరగాలంటే దీనికంటే అధికంగా తీసుకోవాలి. వేపుళ్లు, తీపి పదార్థాలు, మాంసం లాంటి వాటిని మితంగా వాడండి. అన్నం, కూరలు ఎక్కువగా తీసుకోండి. రోజూ అరలీటరు పాలు, అరలీటరు పెరుగు వాడాలి. ఉదయాన్నే పది నానబెట్టిన బాదం గింజలు, రెండు గుడ్లు తినండి. ఇలా ఆరోగ్యకరంగా బరువు పెరిగే ప్రయత్నం చేయండి. ఆహారంలో సరైన పోషక పదార్థాలు లేకపోవడం బలహీనతకు కారణమే. ఏవైనా విటమిన్‌ లోపాలుంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోండి. పైన పేర్కొన్న ఆహారంలోని ఐరన్‌, ప్రొటీన్లు, విటమిన్‌- సి నీరసాన్ని పోగొడతాయి. రోజూ ఓ అరగంట వ్యాయామం చేస్తే ఆహారం బాగా ఒంట బడుతుంది. వ్యాయామం వల్ల శరీరం ఉత్తేజితమవుతుంది. నీరసం, బలహీనత తగ్గుతాయి. బరువు పెరగడానికి, నీరసం తగ్గడానికి నిద్ర చాలా అవసరం. రాత్రి భోంచేసిన రెండు గంటల తరువాతే, నిద్రకు ఉపక్రమిస్తే మంచిది. 
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected] కు పంపవచ్చు)