చక్కెరకేళి అరటిపండ్లు.. ఎక్కువగా తింటే ప్రమాదమా..?

ఆంధ్రజ్యోతి, 09-12-2019:
 
ప్రశ్న: మా ప్రాంతంలో చక్కెరకేళి అరటిపళ్లు బాగా దొరుకుతాయి. కానీ అవి చాలా బలం అనీ, ఎక్కువ తినకూడదనీ అంటారు. ఇది నిజమేనా? 
- శాస్ర్తి, తణుకు
డాక్టర్ సమాధానం: తెలుగు రాష్ర్టాల్లో ఏడెనిమిది రకాల అరటిపండ్లు లభిస్తాయి. నీటి శాతం తక్కువగా ఉండే పండ్లలో కెలోరీలు, పిండి పదార్థాలు ఎక్కువ. వంద గ్రాముల అరటిపండులో... రకాన్ని బట్టి ఎనభై నుండి నూట ఇరవై కెలోరీల శక్తి లభిస్తుంది. వీటిలో పిండి పదార్థాలు ఎక్కువ. అందుకే తిన్న వెంటనే శక్తి వస్తుంది. ఈ పిండి పదార్థాలు చక్కెర రూపంలోనూ, పీచు రూపంలోనూ ఉంటాయి. కొవ్వు పదార్థాలు చాలా తక్కువ. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నా అరటిపళ్ళ గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ 45-58 మధ్య మాత్రమే ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజు పరిమాణాన్ని పెంచవు. మధుమేహం ఉన్న వారు మాత్రం భోజనం చేసిన వెంటనే అరటిపండు తీసుకోకపోవడం మంచిది. ఈ పండ్లలోని పీచుపదార్థం పెద్ద పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరటిపళ్లలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి ఆవశ్యకమైన ఖనిజం. విటమిన్‌ బి- 6, విటమిన్‌- సి అరటిపళ్ళలో అధికం. డోపమిన్‌, కాటచిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో ఉంటాయి. పండించిన నేలను బట్టి పోషక విలువలు ఆధారపడతాయి. కాబట్టి ఓ రకం పండు వేరే రకం కంటే మంచిదని చెప్పలేం. చక్కెరకేళి అయినా మరేదైనా మితంగా తీసుకుంటే ఫర్వాలేదు.
 
 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected]కు పంపవచ్చు)