రాత్రి డ్యూటీలతో హృద్రోగాలు

లాస్‌ ఏంజెలిస్‌, ఫిబ్రవరి 4 : రాత్రి డ్యూటీలు, వారానికొక రకమైన షిఫ్ట్‌లలో విధులు నిర్వర్తించే వారికి హృద్రోగాలు, మధుమేహం ముప్పు ఎక్కువని అమెరికాలోని టారో వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమి కారణంగా వీరిలో జీవ గడియారం గాడి తప్పుతోందని అధ్యయనంలో గుర్తించారు. ఫలితంగా జీవక్రియలు గతి తప్పి.. రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెర మోతాదు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో గుండెపోటు బారినపడే అవకాశాలు ఉంటాయన్నారు. కంటినిండా నిద్రపోవడం, ఆహార నియమాలు పాటించడం, ఏరోబిక్‌ వ్యాయామాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.