ఆంధ్రజ్యోతి (19-11-2019):అవకాడో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని రెట్టింపు చేసే పండు కూడా. చర్మం యవ్వనంగా, తాజాగా ఉండేందుకు ఈసారి ఇంటి వద్దనే తయారుచేసుకున్న అవకాడో మాస్క్ ప్రయత్నించండి. దీంతో చర్మ ఆరోగ్యం, అందంగా మారుతుంది. దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే...
అవకాడో, తేనె మాస్క్: బాగా మగ్గిన అవకాడో పైతోలు, గింజలు తొలగించి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిలో టేబుల్ స్పూన్ తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని 15 నిమిషాలయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో చర్మం పొడిబారడం తగ్గుతుంది.
అవకాడో, ఓట్మీల్ ప్యాక్: ఇది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పేస్ట్‌గా చేసుకొన్న అవకాడోలో అరకప్పు ఉడకించిన ఓట్‌మీల్స్ వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను మాస్క్‌లా ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
అవకాడో, బనానా, హనీ మాస్క్: అరటిపండు, గుడ్డు, అవకాడోను పేస్ట్‌లా చేసుకొని ముఖానికి పూసుకోవాలి. ఈ మాస్క్ చర్మంలోని సహజ నూనెలు తగ్గించి, చర్మాన్ని కాంతిమంతంగా మార్చుతుంది. ఎర్రటిమచ్చలను మాయం చేస్తుంది.
అవకాడో, యోగర్ట్: పావుభాగం అవకాడో గుజ్జులో టీ స్పూను యోగర్ట్ వేసి కలిపితే ఫేస్‌ప్యాక్ రెడీ. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. యోగర్ట్‌లోని లాక్టిక్ ఆమ్లం బ్యాక్టీరియా, మలినాలను తొలగించి చర్మానికి తాజాదనం, నిగారింపునిస్తుంది.