యోగాతో కుంగుబాటుకు చెక్‌

బోస్టన్‌, ఫిబ్రవరి 4 : కనీసం వారానికోసారి యోగా చేస్తే మానసిక కుంగుబాటుకు చెక్‌ పడుతుందని అమెరికాలోని బోస్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. కుంగుబాటుతో బాధపడుతున్న 30 మందిని రెండు గ్రూపులుగా విభజించి మూడు నెలల పాటు జరిపిన అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది. ఇందులో భాగంగా మొదటి గ్రూపు వారితో వారానికి మూడుసార్లు, రెండో గ్రూపువారితో వారానికి రెండుసార్లు యోగా చేయించారు. ఈక్రమంలో తొలిరోజున.. చివరిరోజున వారి మెదళ్లను ఎంఆర్‌ఐతో స్కాన్‌ చేయించి, ఆ ఫలితాలను విశ్లేషించారు. రెండు గ్రూపుల వారిలోనూ కుంగుబాటు లక్షణాలు తగ్గడాన్ని, మెదడులోని నాడీకణాల్లో సందేశాల బదిలీలో కీలకపాత్ర పోషించే గమ్మా బ్యుటైరిక్‌ యాసిడ్‌(గాబా) అనే రసాయనం మోతాదు పెరగడాన్ని గుర్తించారు.