కొబ్బరి నూనె తాగుతున్నారా..? పొరపాటున తేడా వస్తే..

 

ఆంధ్రజ్యోతి (09-12-2019):

 ప్రశ్న: పరగడుపున ఎంత కొబ్బరి నూనె తీసుకోవచ్చు? దాని వల్ల ఫలితం ఏమిటి? అసలు కొబ్బరి నూనె తాగడం మంచిదేనా?

- శ్రీనివాస్‌, వరంగల్‌ 
డాక్టర్ సమాధానం: ఇటీవలి కాలంలో బరువును నియంత్రించే ఆహారాల్లో కొబ్బరినూనె బాగా ప్రాచుర్యం పొందింది. రోజూ కొంత కొబ్బరి నూనె తాగితే బరువు తగ్గవచ్చు లేదా ఉన్న బరువు మరింత పెరగకుండా చూసుకోవచ్చు అని చెబుతున్నారు. ఈ మాట కొంతవరకు నిజమే. కొబ్బరి నూనెలో ఉన్న మీడియమ్‌ చైన్‌ ఫాటీ ఆసిడ్లు ఆకలిని తగ్గిస్తాయి. అలా, పరోక్షంగా తక్కువ కెలోరీలు తీసుకునేందుకు ఉపయోగపడతాయి. రోజూ కొబ్బరినూనె తాగడం వల్ల  లాభం కలిగిందని ఓ పరిశోధనలో తేలింది. అందులో పాల్గొన్నవారు రోజుకు ముప్పయి మిల్లీలీటర్ల మోతాదులో ఈ నూనెను తీసుకున్నారు. కానీ, మిగతా ఆహారపు అలవాట్లలో, జీవనశైలిలో ఏమాత్రం మార్పులు లేకుండా, కేవలం కొబ్బరి నూనె తాగడం వల్ల ఉపయోగం ఉండదు. పైగా అధిక కెలోరీలు తీసుకోవడం కారణంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది.  ఆరోగ్య నిపుణులను సంప్రదించకుండా ఇలాంటి ఇంటి చిట్కాలు ప్రయత్నిస్తే... పొరపాటున మోతాదులో తేడాలు వస్తే మాత్రం, ఆరోగ్యానికి అపాయకరమే. 
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్‌, 
వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌
nutrifulyou.com
(పాఠకులు తమ సందేహాలను [email protected]కు పంపవచ్చు)