ప్రైవేటు డాక్టర్లు పరమ రాక్షసులు

డెలివరీకి వెళితే సిజేరియన్లు చేస్తున్నారు 

అక్కర్లేకుండానే గర్భసంచులు తీసేస్తున్నారు 
దుర్మార్గ, నీచ కార్యక్రమాలు చేస్తున్నారు 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు కొత్త పథకం 
ఒక్కో మహిళకు రూ.15 వేలు ఇస్తాం 
ఆడపిల్ల పుడితే చంపేస్తున్నారు వెధవలంతా 
అందుకే ఆడపిల్లకు అదనంగా వెయ్యి: సీఎం 
శిశు మరణాలు తగ్గాలి: సీఎం కేసీఆర్‌ 
హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రైవేట్‌ డాక్టర్లు రాక్షసులకన్నా ఎక్కువగా తయారయ్యారు. డెలివరీకి అని ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళితే అక్కడి డాక్టర్లు రాక్షసుల్లా తయారవుతున్నారు. అంటే బాధనిపిస్తది. అక్కర ఉన్నా లేకున్నా ఆపరేషన్లు చేయడం.. గర్భసంచులు తీసేయడం.. పరమ దుర్మార్గమైన, నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పిచ్చి పిచ్చి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచిగా ఉన్న స్త్రీల ఆరోగ్యాన్ని చెడగొట్టి.. బాగున్నా కూడా అక్కర లేని పనులు చేస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. వాటిని నివారించడానికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంస్థాగత డెలివరీలను చేయిస్తామని చెప్పారు. ఇందుకు మంచి పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, డబ్బు ఎంతైనా ఖర్చు పెడతామని వెల్లడించారు. దాంతో, డెలివరీలు సురక్షితంగా జరుగుతాయని, అనవసరంగా ఆపరేషన్లు చేసే పిచ్చి పిచ్చి పనులు ఇక జరగవని వివరించారు. పిల్లలకు టీకాలు వేయించడమే కాకుండా ప్రతి గర్భవతికి రూ.15 వేలు ఇవ్వాలని అనుకుంటున్నామని కేసీఆర్‌ వెల్లడించారు. జనహిత సమావేశ మందిరంలో గర్భిణీలు, బాలింతలు, శిశువుల సంక్షేమంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో సోమవారం సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగాలని స్పష్టం చేశారు. ‘‘కొంతమందికి రెక్కాడితే తప్ప డొక్కాడదు. ప్రసవం అనంతరం వాళ్లు పని చేయలేరు. పాపం వాళ్లకు ఆ సమయంలో వేతనం రాదు. కూలీ డబ్బులు చేతికి రావు. అటువంటి వారిని కుటుంబంలో చిన్నచూపు చూడకుండా రూ.13 వేలు ఇస్తాం. గర్భవతులుగా ఉన్నప్పుడు మూడు విడతలుగా రూ.4 వేల చొప్పున ఇస్తాం. ఆడపిల్ల పుడితే చంపడం వంటి పిచ్చి పనులు చేస్తున్నారు వెధవలంతా. అటువంటి పనులు చేయకుండా ప్రోత్సాహకంగా ఉండాలని ఆడపిల్ల పుట్టిన తల్లులకు మరో వెయ్యి ఇస్తాం. ఆడపిల్లను కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వాలనుకున్నాం.’’ అని వివరించారు. మూడు నాలుగు నెలల వరకూ పిల్లలకు కావాల్సిన సబ్బులు, ఆయిల్స్‌, వారిని ఎత్తుకునే మ్యాట్స్‌ ఇతర పరికరాలు ఇందులో ఉంటాయన్నారు. ఇటీవల అధికారులు తమిళనాడుకు వెళ్లి వచ్చారని, అక్కడ ఇలాగే ఇస్తున్నారని చెప్పారు. అంగనవాడీలు ఈ పథకం అమల్లో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రైవేట్‌తో ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ రూములను నిర్మిస్తున్నామని, రూ.50 కోట్లతో వాటిని ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.