పాలకూర ఆకుపైన హృదయ కణజాలం

బోస్టన్‌, మార్చి 28: పాలకూర ఆకుపైన గుండె కణజాలాన్ని విజయవంతంగా పెంచామని వర్సెస్టర్‌ పాలిటెక్నిక్‌ ఇనిస్టిట్యూట్‌(డబ్ల్యూపీఐ) పరిశోధకులు పేర్కొన్నారు. మానవ హృదయ స్పందనలకు తోడ్పడే కణాలను ఈ ఆకులపైన అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కృత్రిమ కణజాలం అభివృద్ధి చేయడం కొత్తేమీ కాకపోయినా.. దీనికి సంబంధించి చాలాకాలంగా ఎదుర్కొంటున్న సమస్యకు ఇది పరిష్కారం చూపనుందని చెప్పారు. త్రీడీ ప్రింటింగ్‌ సహా ఇతర పద్ధతులలో కణజాలాన్ని కృత్రిమంగా తయారుచేయవచ్చని, కానీ రక్తనాళాల అనుసంధానాన్ని ఏర్పాటు చేయడం ఇప్పటివరకూ సాధ్యపడలేదని తెలిపారు. దీంతో కణజాలం పెరగాడానికి అవసరమైన అణువులు, పోషకాలు, ఆక్సిజన్‌ చేరవేతకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదని వివరించారు. తాజా ఆవిష్కరణ ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.