ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తే!

 ఆంధ్రజ్యోతి(02-02-2017):  ఎత్తైన ప్రాంతాల్లో నివసించే వారిలో గుండె జబ్బులు, డయాబెటిస్‌, స్ట్రోక్‌ వంటి జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నవర్రాకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ కొత్త విషయం వెల్లడయింది. సముద్రమట్టానికి అతి తక్కువ ఎత్తులో నివసిస్తున్న వారితో పోల్చితే 457 నుంచి 2297 మీటర్ల ఎత్తులో నివసిస్తున్న వారిలో జీవక్రియల లోపాలు (మెటబాలిక్‌ సిండ్రోమ్స్‌) తలెత్తే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తేలింది. జీవక్రియల లోపాలు అంటే అధిక రక్తపోటు, షుగర్‌ లెవెల్స్‌ పెరగడం, కొలెసా్ట్రల్‌ స్థాయిలు పెరగడం, నడుం చుట్టూ అధిక కొవ్వు చేరిపోవడం వంటి సమస్యలన్నీ వస్తాయి. ‘‘ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్‌ స్థాయి తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రాంతాల్లో నివసించినపుడు గుండె, ఊపిరితిత్తుల పనితీరు మరింత సమర్థవంతంగా ఉంటుంది. ఇన్సులిన్‌ను గ్రహించే శక్తి పెరుగుతుంది’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పెడ్రో వివరించారు. అధ్యయనంలో భాగంగా కొన్ని వేల మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి సమాచారం సేకరించారు.