ఆర్మీజవాన్‌ గుండె వద్ద బద్దెపురుగులు

 

కిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స.. 14 టేప్‌వార్మ్స్‌ తొలగింపు 

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఓ రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ గుండె వద్దకు టేప్‌వార్మ్స్‌ ప్రవేశించడంతో కిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స చేసి అతని ప్రాణాలను రక్షించారు. 25 రోజుల క్రితం నిర్వహించిన ఈ శస్త్ర చికిత్స వివరాలను వైద్యులు వెల్లడించారు. వరంగల్‌కు చెందిన రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ సారంగపాణికి తరుచు ఛాతిలో తీవ్ర నొప్పి వచ్చేది. తొలుత గుండెనొప్పిగా భావించి వైద్యులను ఆశ్రయించాడు. మందులు వాడినా ఫలితం కనిపించలేదు. దీంతో నెల క్రితం కిమ్స్‌ ఆస్పత్రి కార్డియోథోరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ కేవీ కృష్ణకుమార్‌ను ఆశ్రయించాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా.. గుండె కింది గదులను వేరు చేసే గోడ వద్ద టేప్‌వార్మ్స్‌ ఒక తిత్తిగా ఏర్పడినట్లు గుర్తించారు. ఓ 25 రోజుల క్రితం కిమ్స్‌ ఆస్పత్రిలో కృష్ణకుమార్‌ శస్త్రచికిత్స చేసి 14 టేప్‌వార్మ్స్‌ను తొలగించారు. ప్రస్తుతం అతను పూర్తిగా కొలుకున్నాడని, ఇంటికి కూడా పంపించినట్లు వైద్యులు తెలిపారు. ఈ తరహా సమస్యను వైద్య పరిభాషలో ‘హైడాటిడ్‌ డిసీజ్‌’గా వ్యవహరిస్తారని డాక్టర్‌ కృష్ణకుమార్‌ తెలిపారు. ఈ టేప్‌వార్మ్స్‌ సాధారణంగా కుక్కల్లో ఉంటాయని, వాటి నుంచి మనుషులకు చేరినప్పుడు ఈ టేప్‌వార్మ్స్‌ ఊపిరితిత్తులు, కాలేయం వద్దకు చేరుతాయని తెలిపారు. గుండె భాగానికి చేరడం చాలా అరుదని తెలిపారు. 
 
ఇవీ జాగ్రత్తలు 
  •  పెంపుడు కుక్కలు, గొర్రెలు పెంచే వారు వాటిని తాకిన సమయంలో చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. 
  •  కుక్కలకు స్నానం చేయించిన అనంతరం తప్పనిసరిగా స్నానం చేయాలి. 
  •  కుక్కల కడుపులోకి నట్టలు లేకుండా తగిన సమయంలో వాటికి డీ-వార్మింగ్‌ చేయించాలి. 
  •  పెంపుడు కుక్కలు మీ ముఖాన్ని నాకకుండా జాగ్రత్త తీసుకోవాలి.