కలబంద రసం తాగి విచారణకు..

విరుగుడుకు డీటాక్సిఫికేషనూ ఓ అస్త్రం

హైపో థెరపీ.. చిలేషన్‌ లాంటి ప్రక్రియలు కూడా
డ్రగ్స్‌ అవశేషాల తొలగింపునకు సినీ ప్రముఖుల వ్యూహం
 
హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలంటారు! డ్రగ్స్‌ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సినీ ప్రముఖుల తీరు ఇలానే ఉంది. డ్రగ్స్‌ అవశేషాలు దొరక్కుండా ఉండేందుకు వారంతా వివిధ పద్ధతులు అనుసరిస్తున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖుల్లో కొందరు కలబంద రసం (అలోవీరా జ్యూస్‌) తాగుతున్నారు. మరికొందరు ‘డిటాక్సిఫికేషన్‌’ చేయించుకొని వస్తున్నారు. ఈ పద్ధతుల ద్వారా జీర్ణాశయం, పేగుల్లోని మలినాలు శుద్ధి అవుతాయని.. నమూనాలు సేకరించినా డ్రగ్స్‌ అవశేషాలు బయటపడవని అనుమానితులు ధీమాగా ఉన్నారు. డ్రగ్స్‌ కేసులో సినీప్రముఖులను సిట్‌ ఈనెల 19 నుంచి విచారిస్తోంది. డ్రగ్స్‌ అవశేషాలను తెలుసుకునేందుకు కొందరి నుంచి రక్తం, వెంట్రుకలు, గోళ్లను అధికారులు సేకరించారు.
 
ఏమిటీ ‘డీటాక్సిఫికేషన్‌’?
డీటాక్సిఫికేషన్‌ అంటే... శరీరంలోని మలినాలు, ఇతర విష పదార్థాలను తొలగించే ప్రక్రియ. కొన్ని జీవక్రియల ద్వారా మలినాలు, విష పదార్థాలు వాటంతట అవే తొలగిపోతాయి. అవసరమనుకుంటే కృత్రిమ ప్రక్రియల ద్వారా కూడా తొలగించవచ్చు. ఫుడ్‌పాయిజన్‌ సందర్భాల్లో డాక్టర్లు విష పదార్థాలను తొలగించడం ఇదే కోవలోకి వస్తుంది. నోటిద్వారా తీసుకున్న ఆహారం జీర్ణాశయంలో జీర్ణం అవుతుంది. వ్యర్థాలన్నీ మలమూత్రాలు, స్వేదం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మత్తు పదార్థాలు తీసుకున్నవారిలో కొన్ని టాక్సిన్లు, డ్రగ్స్‌ అవశేషాలు చాలారోజులు శరీరంలోనే ఉండిపోతాయి. వాటిని డీటాక్సిఫికేషన్‌ ద్వారా బయటకు పంపిస్తారు. ‘స్టీమ్‌ బాత్‌’ ద్వారా శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమట ఎక్కువ మోతాదులో బయటకు వస్తుంది. శరీరంలో ఏమైనా టాక్సిన్లు ఉంటే చెమట ద్వారా వెళ్లిపోతాయి. ఎఫ్‌ఐఆర్‌(ఫార్‌ ఇన్‌ఫ్రారెడ్‌) ప్రక్రియలోనూ కార్బన్‌ హీటర్స్‌తో శరీర ఉష్ణోగ్రత పెంచుతారు. ఈ పద్ధతిలోనూ చెమట రూపంలో విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కొన్ని సందర్భాల్లో ‘హైపోథెరపీ’ చేస్తుంటారు. అంటే.. ‘కొలోన్‌(మల మార్గం)’ ద్వారా ట్యూబ్‌ను పంపించి కడుపు, పేగుల్లోని మలినాలను తొలగించి శుభ్రం చేస్తారు. సినీ ముఖ్యులు ఇలాంటి ప్రక్రియలను అనుసరిస్తున్నారని ఎక్సైజ్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో వారి నుంచి సేకరించే శాంపిళ్లలో డ్రగ్స్‌ అవశేషాలు ఉండకపోవచ్చని అనుమానిస్తున్నారు. రక్త నమూనాల్లో డ్రగ్స్‌ అనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు అనుమానితులు ‘చిలేషన్‌’ అనే ఒక ప్రక్రియను కూడా అనుసరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ ప్రక్రియలో సెలైన్‌ బాటిళ్ల ద్వారా రసాయనాన్ని బాడీలోకి ఎక్కిస్తారని, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుందని అంటున్నారు. కలబంద రసం తాగడం వల్ల కడుపు, పేగుల్లోని మలినాలన్నీ బయటకు వెళ్లిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లో రకరకాల ఫ్లేవర్లతో అలోవీరా జ్యూస్‌ దొరుకుతోంది. దీనిలో సహజంగా ఉండే చేదు గుణం పోవడానికి స్ట్రాబెర్నీ, యాపిల్‌ వంటి ఫ్లేవర్లను కలుపుతున్నారు. ఇలాంటి జ్యూస్‌లను ఏ ఇబ్బంది లేకుండా తాగేస్తున్నారు.
 
వివిధ రకాల డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియలతో శరీరంలోని డ్రగ్స్‌ అవశేషాలను తొలగించుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది ప్రముఖులు ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు. అల్లోవీరా జ్యూస్‌తోనూ కడుపు, పేగుల్లోని డ్రగ్స్‌ అవశేషాలు తొలగిపోతాయి. రక్తం నమూనాలను సేకరించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే... ఈ జ్యూస్‌ను తాగడం వల్ల 90 శాతం మేర ఫలితాలుంటాయి.
-డాక్టర్‌ పీఎస్‌ సాగర్‌, నేచురోపతి, అక్యుపంక్చరిస్ట్‌, బర్కత్‌పురా