ఆస్టియో పోరోసిస్‌ అతివలకేనా?

30-07-2018: కొన్ని రకాల సమస్యలను ఆడవాళ్లకే ఆపాదిచడం అనాదిగా అలవాటైపోయింది. ముఖ్యంగా ఆస్టియో పోరోసిస్‌ వంటి జబ్బులు మగాళ్లను తాకే అవకాశమే లేదన్నట్లు కొందరు మాట్లాడుతూ ఉంటారు. అదేమంటే, రుతుక్రమం, మెనోపాజ్‌ వంటి కారణాల వల్ల క్యాల్షియం లోపాలు వారికే ఎక్కువనేది వారి వాదన. క్యాల్షియం సంబంధమైన ఆహారం లేదా మాత్రలు వేసుకున్నా, వ్యాయామం లేకపోవడం వల్ల అవి వారి ఒంటపట్టడం లేదని, ఇవన్నీ, మహిళలు ఆస్టియో పోరోసి్‌సకు గురికావడానికి మూలమని చెబుతూ వచ్చారు. అయితే, స్విట్జర్‌ల్యాండ్‌లోని ఇంటర్నేషనల్‌ ఆస్టియోపోరోసిస్‌ ఫౌండేషన్‌ వారు జరిపిన ఒక అధ్యయనంలో ఈ సమస్య పురుషుల్లోనే ఎక్కువని తేలింది.
 
పొగతాగడం, అతిగా ఆల్కహాల్‌ సేవించడం, మాదక ద్రవ్యాలు వాడే అలవాట్లు పురుషుల్లో ఆస్టియో పోరోసిస్‌ తలెత్తడానికి కారణమవుతున్నట్లు వారు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యలను అధిగమించాలంటే, పొగతాగడం, మద్యం మాదక ద్రవ్యాల సేవనం తగ్గించాలి. సరిపడా క్యాల్షియం, డి- విటమిన్‌ తీసుకోవాలి. వీటికి తోడు వెయిట్‌ లిఫ్టింగ్‌ వ్యాయామాలు కూడా అవసరమే. అయితే అప్పటికే ఆస్టియో పోరోసిస్‌ సమస్య మొదలైనా ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ సమస్యకు చాలా సమర్థమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.