క్యాల్షియం మాత్రలు కాపాడతాయా?

24-05-2018: వయోవృద్దుల్ని చూడగానే చాలా మంది క్యాల్షియం, విటమిన్‌ - డి సప్లిమెంట్లు తీసుకోమంటూ సలహా ఇచ్చేస్తుంటారు. ఇవి ఎముకల ఆరోగ్యాన్నీ, దృఢత్వాన్నీ కాపాడతాయని, ఎమకలు విరిగిపోకుండా నిలబెడతాయనేది వారి అభిప్రాయం. అయితే, ఈ విషయమై ఇటీవల జరిగిన చైనా పరిశోధకుల అధ్యయనంలో ఈ సప్లిమెంట్ల వల్ల ఏ ప్రయోజనమూ లేదని బయటపడింది. కొంత మందికి సప్లిమెంట్లు, మరికొందరికి ప్లేస్‌బోలు ఇచ్చి చూస్తే, మాత్రలు వేసుకున్న వారి ఎముకలు విరిగే ప్రమాదం ఏమీ తగ్గలేదని తేలిపోయింది. కాకపోతే, ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం, విటమిన్‌ - డి తప్పని సరి అనేది ఎవరూ కొదవలేని నిజం.

 
అందువల్ల ఆ రెండింటిని ఆహార పానీయాల ద్వారా, సూర్యరశ్మి ద్వారా పొందాల్సిందే తప్ప మాత్రల ద్వారా కాదని ఆ అధ్యయనంలో స్పష్టమయ్యింది. ఆహార పానీయాల్లో ప్రత్యేకించి పాల ఉత్పత్తుల ద్వారా కలిగే ఈ ప్రయోజనం చాలా ఎక్కవ. ముఖ్యంగా పాలు, కూరగాయలు, పండ్లు, చిక్కుడు దాన్యాల్లాంటివి ప్రకృతి సహజమైన క్యాల్షియానికి పెద్ద నిధుల్లాంటివి. ఇక విటమిన్‌- డి కోసమైతే, సూర్యరశ్మిలో గడపడాన్ని మించిన మార్గమే లేదని అధ్యయనకారులు చెప్పారు. ఈ వివరాలు ఇటీవలి ‘ జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌’ లో ప్రచురితమయ్యాయి.