నాలుగు పదులకే ఇదేం నరకం?

24-09-2019: నడివయసు కన్నా ముందే ఎవరికైనా మోకాలి కీళ్లు అరిగిపోతే...మిగతా సగం జీవితం గడిచేదెలా? నడిచేదెలా? అసలింతకీ అంత చిన్న వయసులో కీళ్లు ఎందుకు అరిగిపోతాయీ అంటే...అందుకు కారణాలు అనేకం!
 
మిగతా ఏ నొప్పులైనా ఎలాగోలా తట్టుకోవచ్చు గానీ అడుగు తీసి అడుగు వేయడమే నరకంలా అనిపించే మోకాళ్ల నొప్పుల బాధ మాత్రం భరించలే నిది. కొంత వయసు పై బడ్డాక అంటే అది వేరే మాట! ఇటీవలి కాలంలో కొంత మంది నాలుగు పదులైనా నిండక ముందే ఈ నరకాన్ని చూస్తున్నారు. అలాంటి వారికి కీలు మార్పిడి చికిత్సే శరణ్యమైపోయింది. నానాటికీ మానవ జీవితాల్లో అత్యంత కీలకమైపోతున్న నీ- రిప్లేస్‌మెంట్‌ సర్జరీ పెద్ద దిక్కయిపోయింది.
 
యుక్తవయస్కుల్లోనూ...
దాదాపు అన్ని రకాల మోకాళ్ల నొప్పులకు కీళ్ల మధ్యన ఉండే కుషన్‌ లాంటి మృదలాస్థి దెబ్బతినడమే కారణం. మోకాలి కీళ్లు దెబ్బ తినడం అంటే కీళ్ల మధ్యన ఉండే మృదులాస్థి అరగడమే సమస్య. అయితే ఇటీవలి కాలంలో 40 ఏళ్ల వయస్సు లోపు వారు కూడా ఈ సమస్యకు గురవుతున్నారు. నిజానికి ఇలాంటి వారిలో కార్టిలేజ్‌ అరిగిపోదు కానీ, మెత్త బడుతుంది. అందుకు కారణం శరీర శ్రమ కానీ, వ్యాయామాలు గానీ బొత్తిగా లేకపోవడమే! కార్టిలేజ్‌ మెత్తబడటం ద్వారా తలెత్తే ఈ సమస్యను కాండ్రో మలేసియా అంటారు. దీన్నే కొందరు రన్నర్‌ - నీ అని కూడా అంటారు. సాధారణంగా గంటల పర్యంతం కదలకుండా కూర్చునే ఉద్యోగుల్లోనే ఈ సమస్య ఉంటుంది.
కొందరిలో ఏ మాత్రం కదలికలు లేకపోవడం వల్ల కీళ్లు సునాయాసంగా కదలడానికి తోడ్పడే స్పైనోవియల్‌ ఫ్లూయిడ్‌ పేరుకుపోతుంది. ఇది యుక్త వయస్కుల్లో మోకాళ్ల నొప్పులు రావడానికి గల మరో కారణం. కాకపోతే, ఈ రెండు సమస్యలూ వైద్య చికిత్సలతోనే నయమవుతాయి.
క్రీడల్లో, నృత్యంలో ఎక్కువ గంటలు గడిపే కొంత మంది యుక్తవయస్కుల్లో కీళ్లు దెబ్బతిని ఇరువైపులా ఉండే లిగమెంట్లు దెబ్బతింటాయి. ఇది కూడా మోకాళ్ల నొప్పులకు కారణమవుతుంది. ఇలాంటి వారికి కీళ్ల మార్పిడి అవసరం లేదు గానీ, ఆర్థోస్కోపీ అనే కీ-హోల్‌ సర్జరీ ద్వారా దాన్ని రిపేర్‌ చేయాల్సి ఉంటుంది.
తన శరీర కణజాలమే, తన కీళ్ల పైన దాడిచేసే రూమాటాయిడ్‌ ఆర్థరైటిస్‌ సమస్య కూడా పిన్నవయసులో మోకాళ్ల నొప్పులు రావడానికి కారణమవుతుంది. ఆటో ఇమ్యూన్‌ డిసీస్‌ అనే ఈ సమస్య మోకాళ్లకే పరిమితం కాకుండా, శరీరంలోని దాదాపు అన్ని కీళ్లూ ప్రభావితమవుతాయి. ఈ సమస్య మరీ తీవ్రంగా మారితే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది.
అతి చిన్న వయసులోనే కీళ్లు బాగా దెబ్బతిన్నవారికి ఉండదు. కొంత కాలం వాళ్లకు మందులతోనే ఉపశమనం అందించే ప్రయత్నం ఉంటుంది. ఇంక భరించలేని స్థితి ఏర్పడినప్పుడే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది.
సాధారణంగా 30-35 ఏళ్ల వయసులో కీళ్ల మార్పిడి చేస్తే అవి 20 నుంచి 30 ఏళ్ల దాకా పనిచేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో ఇంకా ఎక్కువ కాలమే మన్నుతాయి. అరుదుగా కొందరిలో 20 ఏళ్లకే దెబ్బతినవచ్చు అలాంటి వారికి రెండవసారి కీళ్ల మార్పిడి చేయవలసి రావచ్చు. ఇలా రెండవ సారి చేయడాన్ని రివిజన్‌ సర్జరీ అంటారు. అలా రెండవసారి చేసినవి ఆ తర్వాత జీవితకాలమంతా పనిచేస్తాయి.

ఫిజియోథెరపీ

మోకాలి కీలు మార్పిడి చికిత్స ఒక ఎత్తయితే, ఆ తర్వాత తీసుకునే ఫిజియోథెరపీ ఒక ఎత్తు. సర్జరీ జరిగిన తొలి 10 రోజుల దాకా ఫిజియో థెరపీ నొప్పి కాస్త ఎక్కువే అనిపించవచ్చు కానీ, ఆ తర్వాత క్రమ క్రమంగా తగ్గిపోతుంది. కొందరు ఆ నొప్పికి భయపడి, ఫిజియోథెరపీకి వెళ్లరు. ఫలితంగా కీళ్లు బిగుసుకుపోయి కీలు మార్పిడి చేయించుకున్న తాలూకు పూర్తి ప్రయోజనం అందదు. కీళ్లు పూర్తి స్వేచ్ఛగా కదలలేవు. అందుకే అటు ఇటుగా నెల రోజుల పాటు తప్పనిసరిగా ఫిజియోథెరపీ తీసుకోవాలి. అలా చేసినప్పుడే కొత్త కీలుతో కొత్త నడక మొదలవుతుంది. కొత్త జీవితం ఆరంభమవుతుంది.
 
స్థూలకాయులకు...
స్థూలకాయులకు కీళ్ల మార్పిడి చేసినా అవి ఎంతో కాలం నిలవవు అన్న కారణంగా కొందరు కీళ్లు ఎంత దెబ్బ తిన్నా, ఇంప్లాంట్‌లు వేయించుకోకుండా వాయిదా వేస్తుంటారు. కీళ్ల నొప్పుల వల్ల వీళ్లు అసలే కదలకుండా ఉండిపోవడం వల్ల ఇంకా ఇంకా బరువు పెరుగుతుంటారు. అందుకే స్థూలకాయులైన వాళ్లు సాధ్యమైనంత త్వరగా కీళ్లమార్పిడి చేయించుకోవడం శ్రేయస్కరం. సంతోషకర పరిణామం ఏమిటంటే, మార్పిడి చేయించుకున్న తర్వాత వాకింగ్‌ లాంటివి చేస్తారు కాబట్టి వాళ్ల బరువు వేగంగా తగ్గుతుంది.

వైద్య చికిత్సలేవీ లేకుండా మోకాళ్ల నొప్పులతో ఎక్కువ కాలం అలాగే ఉండిపోయే వాళ్లు వంకరగా నడుస్తారు. దీనివ ల్ల అదనంగా స్పాండిలోసిస్‌ సమస్యలు అంటే తుంటి నొప్పి, నడుము నొప్పి, మెడనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. అందుకే సాధ్యమైనంత త్వరితంగానే కీళ్ల మార్పిడి చేయించుకోవడం ఎంతో  మేలు!

అపోహలు-వాస్తవాలు
అపోహ: 60 ఏళ్ల తర్వాతే కీళ్ల మార్పిడి చేయించుకోవాలి.
వాస్తవం: 60 ఏళ్లు వచ్చిన అందరి మోకాళ్లూ అరిగిపోతాయనీ కాదు. 30 ఏళ్ల వయసులో అందరి మోకాళ్లూ బలిష్టంగా ఉంటాయనీ కాదు. పాతికేళ్ల వయసులోనే మోకాలి మార్పిడి చేయించుకున్న వాళ్లూ ఉన్నారు. 70వ ఏట కూడా కీళ్లు చెక్కు చెదరకుండా ఉన్నవాళ్లూ ఉన్నారు. అందువ ల్ల మనిషి వయసు ఎంత అని కాదు, మోకాళ్ల వయసు ఎంతనేదే ఇక్కడ విషయం.
 
అపోహ: కీళ్ల మార్పిడి తర్వాత నేల పైన కూర్చోవడం సాధ్యం కాదు
వాస్తవం: ఒకప్పుడు ఆ సమస్య ఉన్న మాట వాస్తవమే కానీ, ఆ తర్వాత హై -ఫ్లెక్స్‌ - ఇంప్లాట్స్‌ వచ్చాయి. అందువల్ల మార్పిడి తర్వాత నేల పైన కూర్చోవడం సాధ్యమే. కాకపోతే, కీళ్ల బాధలు లేని వారు కూడా నేల పైన కూర్చోవడం సరియైునదేమీ కాదు. ఎందుకంటే అలా కూర్చున్నప్పుడు కీళ్ల పైన పడే బారం 6 రెట్లకు పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యవంతుల కీళ్లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
 
అపోహ: కీళ్లమార్పిడి తర్వాత వ్యాయామంలో భాగంగా వాకింగ్‌ చేయడం సాధ్యం కాదు.
వాస్తవం: సాధ్యమే. కాకపోతే, చదునైౖన ప్రదేశంలో స్పోర్ట్స్‌ షూ వేసుకుని నడవాలి.
 
అపోహ: ఒకేసారి రెండు మోకాళ్లలో కీళ్ల మార్పిడి చేసుకోకూడదు.
వాస్తవం: సమస్య రెండు మోకాళ్లలోనూ ఉన్నప్పుడు రెండింటికీ ఒకేసారి చేయించుకోవడమే మేలు. ఎందుకంటే కీలు మార్పిడి చేయించుకోని కాలినొప్పి ఎక్కువగా ఉండడం వల్ల కీలు మార్పిడితో నొప్పి తగ్గిన కాలు పైనే శరీర భారమంతా వేసి నడుస్తారు. దీనివల్ల కీలు మార్పిడి చేయించుకున్న మోకాలు పైన రెట్టింపు భారం పడి అది దెబ్బ తినే అవకాశం ఉంది. అందువల్ల ఒకేసారి రెండు మోకాళ్ల కీలు మార్పిడి చేయించుకోవడం శ్రేయస్కరం. కాకపోతే ఆ సమయంలో అధిక రక్తపోటు, మధుమేహం పూర్తి నియంత్రణలో ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.
 
అపోహ: మధుమేహం ఉన్నవాళ్లకు కీళ్ల మార్పిడి చేయించుకోకపోవడమే మేలు.
వాస్తవం: ఇన్సులిన్‌ ద్వారా షుగర్‌ నిల్వలను పూర్తి నియంత్రణలోకి తెచ్చాకే కీలు మార్పిడి చికిత్స జరుగుతుంది కాబట్టి మధుమేహం వల్ల కలిగే అదనపు సమస్య ఏమీ ఉండదు.