కాళ్ల నొప్పుల్ని ఏం చేయాలి?

23-07-2018: అయినవాళ్లూ, ఆత్మీయుల మధ్య అప్పుడో ఇప్పుడో ఈ కాళ్లనొప్పుల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఈ నొప్పుల వింత ఏమిటంటే, అప్పటిదాకా అంతగా వేధించే నొప్పి నడక మొదలెట్టగానే తగ్గిపోతుంది. నడక ఆపేసి విశ్రాంతిగా కూర్చున్న మరుక్షణమే నొప్పి అధికమమవుతుంది. రకరకాల కాళ్లనొప్పుల్లో ఇదొక రకం. ఈ సమస్య ఎక్కువగా దీర్ఘకాలంగా మధుమేహంతో ఉన్నవాళ్లు, సిగరెట్‌, జర్దా వంటి పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్లల్లో కనిపిస్తుంది. అయితే మధుమేహంతో గుండె, కిడ్నీలు దెబ్బ తినవచ్చేమో గానీ, కండరాలకు ఏమీ కాదని, పొగ తాగడం వల్ల శ్వాసకోశాలకే తప్ప కండరాలకు వ చ్చే న ష్టం ఏమీ లేదని చాలా మంది అనుకుంటారు. అయితే మధుమేహుల రక్తంలో కొలెస్ట్రాల్‌, క్యాల్షియం నిల్వలు పెరిగిపోవడం, పొగాకు ఉత్పత్తులు వాడే వాళ్ల రక్తంలో నికోటిన్‌ నిల్వలు పెరిగిపోవడం వల్ల వీరు ఈ కాళ్లనొప్పులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మధుమేహం ఉన్నవారికి పొగతాగే అలవాటు కూడా ఉంటే వారికి రెట్టింపు ప్రమాదం ఉంటుంది. ఈ విషయాల్ని నిర్లక్ష్యం చేస్తే, పాదాల్లో పుండ్లు ఏర్పడే గ్యాంగ్రిన్‌ బాధలే కాదు, ఏకంగా అంగవైకల్యం ఏర్పడే ప్రమాదం ఉంది.
 
సహజంగా ప్రధాన రక్తనాళాలు కండరాలకు అవసరమైన రక్తాన్నీ, ఆక్సిజన్‌నూ సరఫరా చేస్తుంటాయి. ఏ అంతరాయం కారణంగానైనా ఈ రక్తనాళాలు కండరాలకు సరిపడా రక్తాన్ని సరఫరా చే యలేనప్పుడు ఈ కాళ్ల నొప్పలు మొదలవుతాయి. నడుస్తున్నప్పుడు, కాళ్లపైన ఒత్తిడి పడే బరువైన పని ఏదైనా చేస్తున్నప్పుడు సహజంగానే కండరాలకు ఆక్సిజన్‌తో కూడిన రక్తం అవసరం పెరుగుతుంది, ఏదైనా సమస్య కారణంగా రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు, ఆ ప్రమాణంలో రక్తాన్ని అందించడంలో రక్తనాళాలు విఫలమవుతాయి. ఫలితంగా విపరీతమైన నొప్పి మొదలవుతుంది.
 
కాళ్లనొప్పులకు గల రెండవ ప్రధాన కారణం సిరలు (సూక్ష్మ రక్తనాళాలు) వ్యాధిగ్రస్తం కావడం. ఈ కోవకు చెందిన వ్యాధుల్లో సీ.వీ.ఐ (క్రానిక్‌ వీనస్‌ ఇన్‌సఫిషియన్సీ) ప్రధానమైనది. సహజంగా శరీరంలోని చెడు రక్తం శుద్ధి కావడానికి సిరలు ఆ రక్తాన్ని శ్వాసకోశాల్లోకి పంపుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సిరలు వ్యాధిగ్రస్తమై బలహీనపడతాయో, శ్వాసకోశాల వైపు పంపిన రక్తం, అక్కడదాకా వెళ్లకుండానే వెనుదిరిగి వచ్చి కాళ్లలో పేరుకుంటుంది. దీనివల్ల కాళ్లల్లో నొప్పులు ఏర్పడటంతో పాటు, కాళ్లు నిస్సత్తువగా మారతాయి.
 
కాళ్ల నొప్పులు రావడానికి వేరికోస్‌ వెయిన్స్‌ అనే వ్యాధి కూడా కారణమే. ఈ వ్యాధితో పిక్కల్లోని సిరలు మెలిదిరిగి ఉబ్బుతాయి. ఇది కూడా రక్తప్రసరణకు అడ్డుపడి చెడురక్తం కాళ్లల్లో చేరిపోయేలా చేస్తుంది. దాని ఫలితమే కాళ్ల నొప్పులు. సకాలంలో ఈ వ్యాధికి చికిత్స లభించకపోతే, కాళ్లపైన నల్లటి మచ్చలు, ఎంతకూ మానని అల్సర్లు తయారవుతాయి. ఒక దశలో పిక్కలోని సిరలు నీలం రంగుకు మారతాయి. అప్పుడిక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాస్క్యులర్‌ సర్జన్‌ను సంప్రదించాలి.
సరియైున పరిమాణంలో రక్తంలో విటమిన్‌- డి లేనివారు కూడా ఈ కాళ్ల నొప్పులు, వాపులు, కండరాలు పట్టేయడం వంటి సమస్యలకు గురవుతారు. ఈ కారణంగా కండరాలు కూడా సరిగా పనిచేయవు. ఈ పరిణామాలతో చిన్నపాటి దెబ్బ తగిలినా కాలి ఎముకలు విరిగే ప్రమాదం ఉంది.
కాళ్ల నొప్పులకు దారి తీసే ఇతర కారణాల్లో వార్థక్యం, తరుచూ కండరాలు పట్టేయడం, దీర్ఘకాలంగా ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్‌, సయాటికా వంటివి కూడా ఉంటాయి.
 
వైద్య చిక్డిత్సల్లో...
కాళ్లనొప్పులు రోజురోజుకూ పెరుగుతున్నప్పుడు వెంటనే, వాస్క్యులర్‌ సర్జన్‌ను సంప్రతించి, రక్తనాళాలు, సిరల పరిస్థితిని తెలుసుకునేందుకు అవసరమైన పరీక్షలన్నీ చేయించాలి. కాళ్ల నొప్పులకు రక్తనాళాల వ్యాధే కారణమైతే, బాగు చేయడానికి, పలు చికిత్సా విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ సిరల్లోనే సమస్య ఉంటే, వీనస్‌ వాల్వ్‌ రీకన్‌స్ట్రక్షన్‌, లేజర్‌, లేదా బైపాస్‌ సర్జరీ వంటి చికిత్సలు సమర్థమంతంగా పనిచేస్తాయి. చాలా సార్లు సర్జరీ లేకుండా, కొన్నిరకాల వ్యాయామాలతోనే నయం చేసే అవకాశం ఉంది. వాటివల్ల ప్రయోజనం కలగకపోతే మాత్రం శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. కాళ్లనొప్పుల సమస్యకు ఆర్థరైటిస్‌ కారణంగా ఉంటే కొన్ని రకాల ప్రత్యేక వ్యాయామాలు, ఫిజియోథెరపీ, జీవనశైలి మార్పులతోనే చక్కదిద్దే అవకాశాలు ఉన్నాయి.
 
  
-డాక్టర్‌ కె. కె. పాండే
కన్సల్టెంట్‌ కార్డియోథొరాసిక్‌
అండ్‌ వాస్క్యులర్‌ సర్జన్‌,
ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌, న్యూఢిల్లీ