టొమాటో జ్యూస్‌తో బోన్స్‌ స్ట్రాంగ్‌

ఆంధ్రజ్యోతి,11-8-15:రోజూ రెండు గ్లాసుల టొమాటో జ్యూస్‌ తాగితే ఎముకలు బలంగా తయారవ్వడమే కాకుండా అస్టియోపోరోసిస్‌ దరి చేరకుండా ఉంటుందని పలువురు శాస్త్రవేత్తలు అంటున్నారు. టొమాటోలో ఉండే లైకోపీన్‌ అనే యాంటీఅక్సిడెంట్‌ ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుందని కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టోరంటోకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది. 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న అరవై మంది మెనోపాజ్‌ దశ దాటిన మహిళలపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా వారి మెనూలో ఒక నెల రోజుల పాటు టొమాటో, టొమాటోతో చేసిన ఇతర పదార్థాలు ఏవీ లేకుండా చేశారు. అప్పుడు వారి రక్తంలో అంటే ఎముక విరిగే సమయంలో విడుదలయ్యే ‘ఎన్‌-టెలొపెప్టైడ్‌’ అనే ఒకరకమైన కెమికల్‌ లెవల్‌ పెరగడాన్ని గమనించారు. ఆ తరువాత  వారికి వరుసగా నాలుగు నెలలపాటు 15 ఎంజీ లైకోపీన్‌ ఉన్న టొమాటో జ్యూస్‌ను అందించారు. అప్పుడు మళ్లీ పరిశీలించగా ఎన్‌-టెలొపెప్రైడ్‌ లెవెల్స్‌ చాలా వరకు తగ్గిపోయాయి. దీన్నిబట్టి టొమాటో తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంతేకాకుండా లైకోపీన్‌ పురుషుల్లో వచ్చే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నివారించడమే కాకుండా గుండె జబ్బుల నుంచి కాపాడుతుందని గతంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడయింది. అయితే.. 50 ఏళ్ల పైబడిన వారే కాకుండా.. యుక్త వయసులో ఉన్నవారికి కూడా టొమాటో జ్యూస్ మేలుచేస్తుందట..