మందుల్లేకుండానే...మాయం

ఆంధ్రజ్యోతి, 02-10-2018: ఎక్కడికక్కడ కీళ్లు బిగుసుకుపోతే ఏమవుతుంది? కీళ్లు అరిగిపోవడం మొదలవుతుంది. దీనికి విరుగుడు అనుకుని వెంటనే వాకింగ్‌, జాగింగ్‌కూ సిద్ధమైపోతే, కీళ్లు ఒత్తిడికి లోనై ఆ ఆరగడం మరీ ఎక్కువవుతుంది. అందువల్ల కండరాలు, కీళ్లు బిగుసుపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు బాగా ఉపయోగపడేది యోగా! కీళ్ల పైన ఏమాత్రం భారం పడకుండా కండరాల్లో, కీళ్లల్లో ఏర్పడిన పెళుసుతనాన్ని తొలగించే శక్తి యోగాసనాలకు ఉంది.
 
క్యాబేజీ ఆకు, పాలకూరల్లో కె- విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. అందుకే, కె. విటమిన్‌ను సరిపడా తీసుకునే వారిలో ఎముకలు, కీళ్లు అరిగే పరిస్థితి బాగా తగ్గిపోతుంది. అయితే వీటిల్లోని పోషకాలను శరీరం గ్రహించేందుకు వీలుగా, విటమిన్‌ - సి కూడా సంయుక్తంగా తీసుకోవాలి.
 
కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు రోజూ పెరుగు తినడం చాలా అవసరం. వీటి స్థానంలో ప్రోబయాటిక్‌ మాత్రలైనా తీసుకోవచ్చు. వీటితో పాటు అప్పుడప్పుడైనా నాగజెముడు పండ్లు తింటూ ఉండాలి. ఇవి కీళ్ల దృఢత్వానికి తోడ్పడతాయి.
 
పసుపులోనూ, దాల్చినచెక్కలోనూ కీళ్లల్లో వాపులు ఏర్పడకుండా చేసే యాంటీ-ఇన్‌ఫ్లమేటర్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. గోరువెచ్చని నీళ్లల్లో చిటికెడు వేసుకుని రోజూ సేవిస్తూ ఉంటే, కీళ్లు సురక్షితంగా ఉంటాయి.. దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసి మరిగించుకుని రోజుకొకసారి సేవిస్తూ ఉండాలి.
 
మైదా వంటి పిండిపదార్థాల్లో గ్లూటెన్‌ అనే జిగురు పదార్థం ఉంటుంది. దీనిలో వాపు కలిగించే లక్షణాలు ఉన్నాయి. డాక్టర్‌ను సంప్రతిస్తే, శరీరంలో నిలిచిపోయిన గ్లూటెన్‌ను బయటికి పంపే చికిత్సలు చేస్తారు. దాంతో కీళ్లు ఆహారంలోని పోషకాలను మరింతగా గ్రహించి కీళ్లనొప్పుల నుంచి బయటపడతాయి.
 
మిరపపొడిలో ఉండే క్యాప్‌సైసిన్‌లో కీళ్లను కాపాడే గుణం ఉంది. అందువల్ల పరిమితంగానే అయినా పచ్చిమిరప కాయలను వంటకాల్లో వాడటం అవసరం.
 
ఇలా మందులతో పనిలేకుండా, కేవలం ప్రకృతి సహజమైన ఆహార పదార్థాలను నిత్యం తినడం ద్వారా కీళ్లనొప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.