సర్జరీ లేకుండా పరిష్కారం

ఆంధ్రజ్యోతి,4-8-15

నడుము నొప్పి.. మెడ నొప్పి.. ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్నది ఈ స్పాండిలోసిస్‌ వ్యాధులతోనే. ఈ సమస్యకు వ్యక్తుల్లోని ప్రాణశక్తి లోపాలే కారణమంటారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్‌ కె. శివశంకర్‌. కొన్ని సందర్భాల్లో స్పాండిలోసిస్‌ సర్జరీలు ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. అయితే 95 శాతం స్పాండిలోసిస్‌ వ్యాధులను సర్జరీ లేకుండా  హోమియోపతి వైద్యంతో శాశ్వతంగా నయం చేయవచ్చని ఆయన అంటున్నారు.
 
 
స్పాండిలోసిస్‌ కారణంగా సర్జరీ చేయించుకున్న వారు అక్కడో ఇక్కడో మనకు కనపడుతూనే ఉన్నారు. కాకపోతే సర్జరీ వల్ల తాత్కాలికంగా కొంత ఉపశమనం అనిపించినా కొద్ది రోజులకే సమస్య మళ్లీ మొదటికొచ్చేసింది అని చెప్పే వారే ఎక్కువ. ఇదేమిటంటే మళ్లీ సర్జరీ చెయ్యాలనడం, అలా ఒకటికి రెండు సార్లు సర్జరీ చేయించుకున్న వారు కూడా మనకు తారపపడతారు. ఈ పరిస్థితే దుర్భరం అనుకుంటే, ఇటీవల ఒక పేరు మోసిన ఆసుపత్రిలో స్పాండిలోసిస్‌ కారణంగా సర్జరీ చేయించుకున్న ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడనే వార్త ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చింది. ఒక హోమియోపతి డాక్టర్‌గా ఆ వార్త చూసి విస్మయానికీ తీవ్రమైన వేదనకూ గురయ్యాను. సర్జరీ చేయించుకున్న ప్రతి ఒక్కరికీ ఇలా అవుతుందని కాదు గానీ ఇదీ ఒక పరిణామమే కదా!
 
సర్జరీ అరుదైన అవసరం..

పరిస్థితి బాగా విషమించిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప దాదాపు 95 శాతం స్పాండిలోసిస్‌ సమస్యలకు సర్జరీ అవసరం లేదు. ఈ మాటను ప్రపంచ ఆరోగ్య సంస్థే బలంగా చెప్పింది. ప్రమాదాల్లో వెన్నుపూసలు దెబ్బ తిన్నప్పుడో, లేదా వెన్నుపాము మీద వెన్నుపూసల మీద లేదా డిస్కులపై ఒత్తిడి పెరిగి ఆ కారణంగా మలమూత్రాలు ఆగిపోయినప్పుడో సర్జరీ అవసరం కావచ్చు. స్పాండిలోసిస్‌ బాగా ముదిరిపోయిన కొందరిలో రెండు వెన్నుపూసలు ఒకటిగా అతుక్కుపోవచ్చు. కొంత మందిలో పుట్టుకతోనే వెన్నుపూసలు అతుక్కుని (బ్లాక్‌ వర్టిబ్రా) ఉంటాయి. అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప సర్జరీ అవసరమే లేదు. స్పాండిలోసిస్‌ రావడానికి అసలు కారణం వెన్నుపూసలు బలహీనపడటం. అలాంటి వారిలో బలహీనపడిన పూసల మధ్యన ఉండే ఖాళీ తగ్గిపోయి పక్కనే ఉన్న వెన్నుపాము మీద ఒత్తిడి పడుతుంది. అక్కడ మొదలైన నొప్పి మిగతా మరికొన్ని భాగాలకూ పాకుతుంది. ఇందులో భాగంగా వచ్చేవాటిలో సయాటికా సమస్య ఒకటి. వెన్నెముకలో రెండు చోట్ల అంటే మెడ వద్ద, నడుము వద్ద మనకు అనువుగా కదిలే వెసులుబాటు ఉంటుంది. ఈ కదిలే చోట్లలోనే కొందరిలో ఈ పూసలు అరిగిపోవడం గానీ, విరిగిపోవడం గానీ, జరగవచ్చు. సమస్య మెడ వ ద్ద వస్తే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అనీ, నడుం దగ్గర వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అనీ అంటారు. ఈ సమస్యలు తలను గానీ మెడను గానీ ఎక్కువ గంటలు వంచి పనిచేసే వారిలోనే అధికంగా కనిపిస్తాయి. స్పాండిలోసి్‌సలో నొప్పి రావడమే కాకుండా ఒక్కోసారి కళ్లు తిరిగి పడిపోవచ్చు. ఈ వ్యాధిలో ఇదో పెద్ద సమస్య. దీనివల్ల రోగి లేచి నడవాలంటేనే భయపడతారు. అంతకన్నా ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు. 

కొన్నింటి సమస్య కాదు..
 స్పాండిలోసిస్‌ సమస్యలకు వృత్తిపరమైన కారణాలే కాకుండా, శరీరానికి అవసరమైనంత క్యాల్షియం తీసుకోకపోవడం,  సూర్యరశ్మికి దూరమైన కారణంగా డి- విటమిన్‌ సరిగా అందకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ వ్యాధికి దారి తీస్తాయి. ఒక వేళ ఇవి అందినా శరీరంలోని రక్తం వాటిని సరిగ్గా సంగ్రహించలేకపోవడం కూడా కారణాలుగా ఉంటాయి. అయితే, కారణం ఏదైనా, బలహీనపడిన వెన్నెముకను తిరిగి శక్తివంతం చేసే వైద్యం ఈ స్థితిలో అతి ముఖ్యం. అలా కాకుండా సర్జరీకి సిద్ధమైతే ఏమవుతుంది? ఆధునిక వైద్యులైనా రోగి వచ్చీ రాగానే సర్జరీ చేయాలని అనుకోరు. ముందు సాధారణ వైద్యం, ఫిజియో థెరపీలు, జీవశైలి మార్పులు సూచించడం వంటివి చేస్తారు. విటమిన్‌- డి, క్యాల్షియం మాత్రలు ఇవ న్నీ చెబుతారు. కానీ, ఇవేవీ బలహీన పడిన వెన్నుపూసల్ని మళ్లీ బలోపేతం చేయలేకపోతున్నాయి. చివరగా ఎంచుకునే సర్జరీతో అయినా, దెబ్బతిన్న పూసను తిరిగి బలోపేతం చేయలేరు కదా! అందుకే, దెబ్బతిన్న వెన్నుపూసను తొలగించి ఒక కృత్రిమ పూసను అందులో బిగిస్తారు. కానీ, ఒక పూస దెబ్బతిన్నదీ అంటే మిగతా పూసల పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని అర్థం. ఈ రోజున ఒక వెన్నుపూసను తొలగించి కృత్రిమ పూసను బిగించిన ట్లే ఏదో ఒకరోజున ఒక్కొక్కటిగా మిగతా పూసల్ని కూడా తొలగించి కృత్రిమ పూసల్ని బిగించాల్సిందే కదా! ఆ క్రమంలో జీవిత కాలంలో ఎన్ని సర్జరీలు జరగాలి? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బలంగా గాయమై, ఒకటి రెండు పూసలే దెబ్బతినవచ్చు. అలాంటి సమయాల్లో ఆ పూసల్ని తొలగించి ఆ రెండు కృత్రిమ పూసల్ని బిగించవచ్చు. దానితో సమస్య పూర్తిగానే పోవచ్చు, ఎందుకంటే మిగతా పూసలన్నీ పూర్తిగా, బలంగా ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా వెన్నెముకు నిలబట్టే ప్రాణశ క్తే (వైటల్‌ ఫోర్స్‌) దె బ్బతిన్నప్పుడు ఒకటి రెండు వెన్నుపూసల్ని మార్చడం వల్ల ప్రయోజనం ఉండదు. 
 
అసలు కారణం ఏమిటి..? 
మౌలికంగా శరీర వ్యవస్థనంతా ఆరోగ్యంగా, ధృఢంగా నిలబెట్టేది శరీరంలోని అణువణువునా వ్యాపించి ఉండే వైటల్‌ ఫోర్స్‌.  దాన్నే మనం ప్రాణశక్తి లేదా జీవశక్తి అంటాం. వివిధ కారణాల చేత ఈ ప్రాణశక్తి కొన్నిసార్లు బలహీన పడుతుంది. దీని వల్ల శరీరంలోని ఏ భాగమైనా బలహీనపడవచ్చు. రోగగ్రస్తం కావచ్చు. స్పాండిలోసిస్‌ సమస్యలు కూడా అందులో భాగమే. అందువల్ల స్పాండిలోసిస్‌ సమస్యను సమూలంగా, శాశ్వతంగా తొలగించాలంటే ఆ ప్రాణశక్తిని తిరిగి బలోపేతం చేయడం ఒక్కటే అసలైన చికిత్స అవుతుంది. చెట్టు ఎండిపోతే, ఆకుల మీద, కొమ్మల మీద నీళ్లు చల్లడం కాదు కదా! చెట్టు మొదట్లో నీళ్లు పోస్తాం. హోమియో వైద్యం ఆ పనే చేస్తుంది. అందుకే ఒక వెన్నుపూస దెబ్బతిన్నప్పుడు హోమియో వైద్యం తీసుకుంటే, ఆ తర్వాత మిగతా వెన్నుపూసలు దెబ్బతినే పరిస్థితి రాదు. అలా రోగానికి కాకుండా, మొత్తంగా రోగికే చికిత్స చేసే విధానాన్ని హోమియోపతి అనుసరిస్తుంది. మొత్తంగా చూస్తే 95 శాతం స్పాండిలోసిస్‌ సమస్యలకు హోమియో వైద్యంలో పక్కా వైద్యం ఉంది. 
 
శాశ్వత చికిత్స...
ప్రాణశక్తి అంటే బయటికి కనిపించే స్థూల శరీరరం కాదు, ఇది కంటికి కనిపించని సూక్ష్మ శరీరం. దీనికి భౌతిక రూపం లేదు. ఇదొక అదృశ్య శక్తి. శరీరమంతా ఇది ఒక ఆసరాగా పనిచేస్తుంది. అందువల్ల వ్యాఽధిగ్రస్తమైనప్పుడు దానికి ఇచ్చే మందులు కూడా అదృశ్య రూపంలోనే అంటే శుద్ధ శక్తి రూపంలోనే ఉండాలి. అలా శక్తి రూపంలో ఇవ్వడానికే హోమియోపతిలో పొటంటైజేషన్‌ అనే విధానం ఉంది. ఔషధ మూలికాణువుల్ని  విస్పోటనం కావించే ఈ విధానంలో భౌతిక అంశమే లేని శుద్ధ శక్తి విడుదల అవుతుంది. మనిషిలోని సూక్ష్మ శరీరానికి ఈ కనిపించని ఔషధ శక్తే అసలు సిసలైన వైద్యం అవుతుంది. అయితే, శక్తి కనిపించదని ఒప్పుకునే శాస్త్రవేత్తలే, ఈ ఔషధ శక్తిని ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. అందుకే హోమియో మందులు కేవలం ప్లాసిబో గుళికలంటూ వాదిస్తారు. మా వద్దకు వచ్చి వ్యాధి విముక్తులైన వారి రిపోర్టులను ముందు పెడితే, అదేముంది.. ప్రకృతి సహజంగానే కొన్ని వ్యాధులు వాటికవే తగ్గిపోతాయి. ఆ వ్యాధులు అలా తగ్గినవే కానీ, మీరు ఇచ్చిన మందులతో కాదు అనేస్తారు. వారి విషయంలో మాత్రం ఇలా అంటే ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, కోటానుకోట్ల మంది హోమియోపతి వైద్యంతో వ్యాధి విముక్తులవుతున్నారు. 95 శాతం స్పాండిలోసిస్‌ సమస్యలనుంచి సర్జరీలతో పనిలేకుండా కేవలం మందులతోనే విముక్తమవుతున్నారు. స్పాండిలోసిస్‌ సమస్యలు తీవ్రతను అనుసరించి  6 నుంచి 12 మాసాల వ్యవధిలో పూర్తిగా తగ్గిపోతాయి . పైగా ఇతర వైద్య విధానాల్లోలా తాత్కాలిక ఉపశమనంగా కాకుండా శాశ్వతంగానే ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
 
డా. శివశంకర్‌ కూనపరెడ్డి
రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ హోమియో 
వైద్య కళాశాల, హైదరాబాద్‌