నిద్ర తగ్గితే... ఎముకలు నుగ్గు

ఆంధ్రజ్యోతి (19-11-2019): ‘‘నిద్ర వల్ల జీవక్రియలన్నీ సజావుగా జరిగి, మొత్తం శరీర వ్యవస్థ అంతా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. ఆ నిద్రే కరవైతే ఎముకల్లోని లవణ సాంద్రత (బోన్‌ మినరల్‌ డెన్సిటీ) తగ్గిపోయి, ఎముకలు గుల్లబారిపోయి ఆస్టియోపొరోసిస్‌ అనే సమస్య తలెత్తుతుందని అమెరికాలోని బుఫేలో యూనివర్సిటీకి చెందిన అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. రోజుకు 5 గంటలు, అంతకన్నా తక్కువ సమయం నిద్రించేవారు ఎంతటి బలవర్థక ఆహారం తీసుకున్నా, వాటిలోని పోషకాలను ఎముకలు గ్రహించవు. నిద్రలేమి వల్ల సహజంగానే ఆకలి తగ్గిపోతుంది. అదే క్రమంలో జీర్ణశక్తీ తగ్గిపోతుంది. ఈ అజీర్తి వల్ల ఏదీ తినలేని పరిస్థితి ఒకటైతే, అయిష్టంగా తిన్నా అవేవీ జీర్ణంకాని పరిస్థితి నెలకొంటుంది. అందువల్ల ఎముకలకు నిత్యం అందవలసిన లవణాలు తగ్గిపోతాయి. ఇదే ఎముకలు గుల్లబారడానికి కారణమవుతుంది.

 
పురుషులతో పోిలిస్తే ఈ సమస్య స్త్రీలలోనే ఎక్కువగా ఉంటోంది. అందువల్ల స్త్రీలు 7 గంటలకు తగ్గకుండా నిద్రించాలని అధ్యయనకారులు చెబుతున్నారు. నిద్ర తగ్గితే, ఎముకలు ఆస్టియోపొరోసిస్‌ బారిన పడతాయి. నిద్రలేమితో కాళ్లు, చేతుల ఎముకలే కాదు, తుంటి ఎముక, తల నుంచీ మెడదాకా ఉండే వెన్నెముక కూడా దెబ్బతినే అవకాశం ఉంది. పని ఒత్తిళ్ల వల్ల కొందరు తక్కువ గంటల నిద్రకు పరిమితమవుతారు. వారు విధిగా రోజులో 7గంటల సమయాన్ని నిద్రకు కేటాయించాలి. మరికొందరి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారికి అసలు నిద్రే పట్టదు. ఇలాంటి వారు నిద్ర పట్టకపోవడాకికి గల కారణాలేమిటో న్యూరాలజిస్టు ద్వారా తెలుసుకుని వెంటనే, అవసరమైన వైద్య చికిత్సలు తీసుకోవడం తప్పనిసని అంటున్నారు పరిశోధకులు.