స్కోలియోసిస్‌తో జాగ్రత్త

ఆంధ్రజ్యోతి,29/06/14

వెన్నెముక వంకర తిరిగిపోయే స్కోలియోసిస్‌ సమస్య గురించిన అవగాహన సమాజంలో అతి త క్కువ మందికే ఉంది. ఆ అవగాహనను పెంచేందుకే జూన్‌ 29వ తేదీని ప్రపంచ స్కోలియో దినంగా నిర్వహిస్తున్నారు. అధ్యయనాల ప్రకారం ప్రతి వెయ్యిమంది పిల్లల్లో 3 నుంచి 5 మంది ఈ స్కోలియోసిస్‌ బారిన పడుతున్నారు. వెన్నెముక వంకరగా ఉండడాన్ని ఏదో సాధారణ శారీరక లోపంగా భావిస్తారే తప్ప చాలా మంది దీన్ని ఒక వ్యాధిగా గుర్తించడం లేదు. అందుకే చాలా మంది సమస్య విషమించేదాకా డాక్టర్‌ను సంప్రదించడం లేదు. ఎంతో సమర్థవంతమైన శస్త్ర చికిత్సలు, ఇతర వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఈ దశలో కూడా చాలా మందికి ఆ విషయమే తెలియదు. స్కోలియోసిస్‌కు సకాలంలో వైద్య చికిత్సలు అందకపోతే క్రమంగా అది గుండెకూ శ్వాసకోశాలకూ మధ్యనున్న ఖాళీని కుదించే ప్రమాదం ఉంది. దీనివల్ల శ్వాస సమస్యలు మొదలవుతాయి. ‘‘ సమస్య ఒక మోస్తరుగా ఉన్నప్పుడు ఫిజియోథెరపీ కొంత మేరకు ఉపశమనాన్ని ఇస్తుంది. వెన్ను భాగంలోని కండరాల్ని దృఢంగా, సులువుగా కదిలేలా చేసే ఏ వ్యాయామమైనా ఈ సమస్యనుంచి ఊరట కలిగిస్తుంది. అయితే వెన్నెముక 40 శాతానికి మించి వంకర తిరిగినప్పుడు సర్జరీ ఒక్కటే సరియైన పరిష్కారమవుతుంది. ఆఽధునిక రీతిలో సర్జరీ చేయించుకున్న వారు కేవలం వారం రోజుల్లోనే ఆసుపత్రినుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు’’ అంటున్నారు కామినేని హాస్పిటల్‌కు చెందిన స్పైన్‌ సర్జన్‌ డాక్టర్‌ వి సూర్యప్రకాశ్‌ రావ్‌. . ఏమైనా ప్రపంచ స్కోలియోసిస్‌-డే నిర్వహణ స్కోలియోసిస్‌ చికిత్సల గురించిన అవగాహనను పెంచడంతో పాటు తొలిదశలోనే సమస్యనుంచి పూర్తిగా బయటపడేందుకు ఎంతో తోడ్పడుతుందనేది వాస్తవం.