తుంటికీ కంటికీ లింకు!

‘జర్నల్‌ ఆఫ్‌ ద అమెరికన్‌ మెడికల్‌ అసోషియేషన్‌’లో ఇటీవల ప్రచురితమైన ఒక వ్యాసంలో తుంటి ఎముకలు విరగడానికి గల కారణాల్లో కంటిచూపు సమస్యలే ప్రధానంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. క్యాటరాక్ట్‌ సమస్యను నిర్లక్ష్యం చేసిన వాళ్లతో పోలిస్తే, సకాలంలో సర్జరీ చేసుకున్న వాళ్లల్లో తుంటి ఎముక విరిగే సమస్య చాలా తక్కువగా ఉందని ఆ వ్యాసంలో తెలిపారు. నిజానికి నడకలో ప్రతి కదలికలో సమతుల్యత, స్థిరత్వం చూపు మీదే ఆధారపడి ఉంటుంది. దృష్టిలోపం ఏర్పడిన వారిలో నడకలో, వృత్తి వ్యవహారాల్లో స్థిరత్వం ఉండదు కాబట్టి, తూగి పడిపోయే ప్రమాదమే ఎక్కువ. తుంటి ఎముక విరిగి పడిన 49శాతం మందిలో క్యాటరాక్ట్‌ సమస్యలే కారణంగా ఉన్నట్లు కూడా శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కనుగొన్నారు. కంటి చూపునకూ, కాలు విరగడానికీ సంబంధమేమిటీ? అనుకుని నిర్లక్ష్యం చేస్తే, తుంటి విరిగి మంచాన పడి ఉండడమే మిగులుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే క్యాటరాక్ట్‌ సమస్యలు ఉన్నవారు, వెంటనే సర్జరీ చేయించుకుంటే, ఆ పరిస్థితి ఉండదని వైద్య నిపుణులు ఆ వ్యాసం ద్వారా సూచిస్తున్నారు.