యువత.. కీళ్ల మోత

యువతలో ఆర్థరైటిస్‌ ఎఫెక్ట్‌
మోకాళ్లు, తుంటి, భుజం, మెడ సమస్యలు
రోజుకు 4 నుంచి 5 వేల మంది బాధితులు
 
గ్రేటర్‌లో రోజుకు నాలుగు నుంచి ఐదు వేల మంది ఆర్థరైటిస్‌ (కీళ్ల నొప్పులు) సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్నారు. మెకాళ్ల నొప్పులతో 40 శాతం, తుంటి నొప్పితో 25 శాతం, భుజం నొప్పులతో 15 శాతం, ఎల్‌బో, చేతి జాయింట్ల నొప్పులు, చీళ్ల మండలం తదితర భాగాలలో సమస్యలతో 20 శాతం మంది వైద్యులను సంప్రందిస్తున్నట్లు ఒక అంచనా. ఇలా వచ్చిన వారిలో చాలా మందికి మందులు, ఇంజెక్షన్లతో ఉపశమనం లభిస్తుంది. తప్పని స్థితిలో కొందరికి సర్జరీలు చేయాల్సి వస్తోందని వైద్యులు అంటున్నారు.
 
హైదరాబాద్‌ సిటీ, 12-10-2019 (ఆంధ్రజ్యోతి): ఇంతకు ముందు 65ఏళ్ల వయస్సులో ఉండే ఎముకల అరుగుదల ఇప్పుడు 35 ఏళ్ల వయస్సు నుంచే కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ఎముకల అరుగుదల, పెళుసుగా మారి విరగడం, నడుము, మణికట్టు, తుంటి వద్ద ఫ్యాక్చర్లు పెరిగాయని డాక్టర్లు అంటున్నారు. నగరంలో రోజుకు 40 నుంచి 50 కీళ్ల మార్పిడిలు జరుగుతుండగా, 30 నుంచి 40 తుంటి మార్పిడిలు జరుగుతున్నాయని వైద్యులు వివరించారు. ఆర్థరైటిస్‌పై అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబర్‌ 12న వరల్డ్‌ ఆర్థరైటిస్‌ డేగా నిర్వహిస్తున్నారు.
 
ముప్పై రకాల నొప్పులు
మనిషిలో సుమారు 30 రకాల నొప్పులు వస్తుంటాయి. మోకాళ్లు, మడమ, మణికట్టు, వేలి జాయింట్లు, ముంజేయి, భుజం, మెడ, నడుము, తుంటి తదితర చోట్ల ఆర్థరైటిస్‌ సమస్య వస్తోంది. వీటన్నింటినీ ఆర్థరైటిస్‌, ఆస్టియోపోరాసిస్‌, ఓస్టియో ఆర్థరైటిస్‌ వంటి పేర్లతో వ్యవహరిస్తుంటారని వైద్యులు తెలిపారు.
 
నాలుగుదశల్లో అరుగుదల
ఎముకల అరుగుదల నాలుగు దశల్లో ఉంటుందని వైద్యులు చెప్పారు. మొదటి దశలో జాయింట్ల వద్ద ఉన్న కార్టిలేజ్‌లో అరుగుదల మొదలవుతోంది. రెండో దశలో కార్టిలేజ్‌ పెచ్చులూడిన్నట్లుగా మారుతుంది. మూడో దశలో కార్టిలేజ్‌ గుంతలు పడిన్నట్లు మారుతాయి. నాలుగో దశలో శస్త్ర చికిత్స చేయడం, మోకాళ్లు, తుంటి వంటివి మార్పిడి చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వైద్యులు వివరిస్తున్నారు.
 
లక్షణాలు ఇలా...
పొద్దున లేవగానే కీళ్లు మొత్తం బిగుసుకుని పోవడం, తీవ్రమైన నొప్పి, చేతులు, కాళ్లు, భుజాలు, మణికట్టు వంటి కీళ్లలో బాగా నొప్పి, వాపు ఉంటాయి. ఈ సమస్య వల్ల కీళ్లలో నొప్పి, వాపు తీవ్రం కావడం తద్వారా నిద్రలేమి, రక్తహీనత, ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం చూపుతాయి. అనవరసరమైన ఒత్తిడి పెరుగుతుంది. రక్తపోటు కూడా అధికమవుతుంది. నరాల బలహీనత, చర్మంపై పుండ్లు ఏర్పడుతాయి.
 
కారణాలు ఇవీ...
ఆర్థరైటిస్‌ సమస్యలు రావడానికి పర్యావరణ కాలుష్యంతో పాటు ధూమపానం, మద్యపానం, అధిక కొలెస్ట్రాల్‌ ఉన్న పదార్థాలు తినడం, బరువు పెరగడం వంటివి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. కొందరికి జన్యుపరంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశముంది. అధిక బరువును తగ్గించుకోవడం, వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను కొంత మేరకు అధిగమించవచ్చు.
 
ఒక్కో దశలో ఒక్కో రకమైన చికిత్స
ఆర్థరైటి్‌సకు ఒక్కో దశలో ఒక్కో రకమైన చికిత్స ఉంటుంది. ప్రారంభ దశలో కీలులో ఖాళీ ఎక్కువగా ఉండదు. నొప్పి వల్ల మాత్రమే రోగి చురుకుదనం తగ్గుతుంది. ఈ సమయంలో తగిన మం దులు, విశ్రాంతి, ఫిజియోథెరపీతో వైద్యం అందించవచ్చు. రెండో దశ కీలులో ఖాళీ పెరుగుతుంది. నొప్పి కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ దశలో విశ్రాంతి, ఫిజయోథెరపీ, మందులు వాడకంతో పాటు ఇంజెక్షన్లు అవసరమవుతాయి. మూడు, నాల్గో దశల్లో కూడా సాధ్యమైంత వరకు మొదట మందులతో వైద్యం అందించాలి. తప్పని సరి అయితే కీహోల్‌ సర్జరీ చేయాలి. 90 నుంచి 95 శాతం వరకు రోగులకు సర్జరీ కాకుండా ఇతర చికిత్స విధానాలనే అవలంభిస్తారు. ఎక్కువ శాతం మందులతో నయం చేసేందుకే వైద్యులు ప్రయత్నిస్తుంటారు.
 - డాక్టర్‌ హెచ్‌ఆర్‌ మాధురి, రుమటాలజిస్టు, కేర్‌ ఆస్పత్రి
 
జీవనశైలి మార్పులతోనే...
సాధారణంగా వయస్సు రీత్యా కానీ, జెనిటిక్‌ సమస్య వల్ల కానీ ఆర్థరైటిస్‌ సమస్యలు వస్తాయి. మారిన జీవన శైలి ఆర్థరైటి్‌సకు ప్రధానకారణంగా కనిపిస్తోంది. అధిక బరువు ఉండడంతో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. బరువు పెరిగితే ఆ భారం మోకాలి కీళ్లపై పడుతుంది. భారీకాయంతో నడిచే సమయంలో మోకాళ్లపై అధిక బరువు వేయడంతో కార్టిలేజ్‌ త్వరగా అరిగిపోతోం ది. ఆ సమయంలో ఎముకలు ఒకదానితో ఒకటి రాసుకుపోవడం వల్ల, నొప్పి వంటివి చోటు చేసుకుంటాయి. క్రీడాకారులకు మోకాళ్లు, జాయింట్ల వద్ద దెబ్బలు తగిలి కార్డిలేజ్‌ దెబ్బ తినడం, ద్విచక్రవాహనాలపై నుంచి కింద పడినప్పుడు దెబ్బ తగిలి కార్టిలేజ్‌ దెబ్బ తినవచ్చు. తరచూ వేగంగా మెట్లు ఎక్కడం వల్ల కూడా కీళ్లలో అరుగుదల త్వరగా ఏర్పడుతుంది. పౌష్టికాహారం లోపం, అల్కాహాల్‌, స్మోకింగ్‌ వల్ల ఎముకలు బలహీనంగా తయారు అవుతుంటాయి.
- డాక్టర్‌ రాజ్‌కిరణ్‌, రుమటాలజిస్టు, హైదరాబాద్‌ రుమటాలజీ సెంటర్‌
 
మహిళల్లో తొమ్మిది రెట్లు ఎక్కువ
కీళ్ల మధ్యలో నొప్పి, వాపు, కీళ్లపై తేలికపాటి ఎరుపు, కీళ్లు గట్టిపడడం ఆర్థరైటిస్‌ లక్షణాలు. రుమటాయిడ్‌ లూపస్‌ వంటివి ఎక్కువ కావడం వల్ల ఆర్థరైటిస్‌ ఆటో ఇమ్యున్‌ సమతుల్యత దెబ్బతింటుంది. మహిళల్లో ఆర్థరైటిస్‌ సమస్యలు తొమ్మిది రెట్టు ఎక్కువ. కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం, బుగ్గలపై ఎర్రటి దద్దుర్లు, నోటిపూతలు, చర్మం రంగు మారడం, జ్వరం, విపరీతమైన ఆలసట లూపస్‌ లక్షణాలుగా భావిస్తాం. లూపస్‌ రక్తంలో చేరితే అది తక్కువ హిమాగ్లోబిన్‌, తెల్లకణాల సంఖ్య తగ్గడం, ప్లేట్‌లేట్‌ పడిపోవడానికి కారణమవుతాయి. మూత్రపిండాలలో చేరితే ప్రొటీన్‌ కోల్పోతుంది. గుండెకు చేరితే దాని చూట్టు ద్రవం చేరడం, గుండె స్పందనలు ఆగిపోవడం చోటు చేసుకోవచ్చు. మెదడుకు చేరితే ఫిట్స్‌, కోమా సమస్యలు ఎదుర్కొవచ్చు.
- డాక్టర్‌ వి.శరత్‌ చంద్రమౌళి, రుమటాలజిస్ట్‌, కిమ్స్‌ ఆస్పత్రి