కీళ్లు... కిర్రు కిర్రు!

15-07-2019: అరిగిన టైరు మార్చినంత సులువుగా కీళ్లు మార్చుకోవచ్చు అనుకుంటాం! కానీ అవి అరగకుండా నియంత్రించే మార్గాల గురించి పట్టించుకోం! అందుకు దారితీసే కారణాలు తెలుసుకుని, అప్రమత్తంగా వ్యవహరిస్తే.... పది కాలాలపాటు కీళ్లను పదిలంగా కాపాడుకోవచ్చు!
 
కీళ్ల పైన ఉండే రక్షణ పొర కంది, వాచిపోవడమే కీళ్ల వాతం! ఇది చిన్న వయసులో మొదలవవచ్చు. యుక్తవయసులోనూ తలెత్తవచ్చు, నడి వయసులో, వృద్ధాప్యంలోనూ కనిపించవచ్చు. 3, 4 ఏళ్ల వయసులో వచ్చే కీళ్ల వాతం ‘రుమాటిక్‌ ఫీవర్‌’. ఇది పెరిగే వయసుతోపాటు తగ్గిపోతుంది. 16, 17 ఏళ్ల యుక్తవయసు మొదలుకుని వృద్ధాప్యం వరకూ వచ్చే కీళ్ల వాతం ‘రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌’! ఈ రెండు సమస్యల్లో ఒకటి కంటే ఎక్కువ కీళ్లు వేధిస్తాయి. అయితే ఏ వయసులో కీళ్ల నొప్పులు మొదలైనా దాని మూలాలు ఎంతో ముందు నుంచి మనలో ఉన్నాయని గ్రహించాలి. ప్రధానంగా....
 
జన్యుపరమైన కారణం: కీళ్ల వాతానికి సంబంధించిన జన్యువుతో పుట్టడం మూలంగా ఏదో ఒక వయసులో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఈ సమస్య వంశపారంపర్యం. తల్లితండ్రులు, మేనత్త, మేనమామ...ఇలా రక్తసంబంధీకుల నుంచి సంక్రమిస్తుంది.
 
అధిక బరువు: ఎముకలు మోయగలిగిన బరువుకు మించి శరీరం బరువెక్కితే కచ్చితంగా కీళ్లు ఒత్తిడికి గురవుతాయి. దాంతో ప్రధానంగా మోకాళ్లు, తుంటి కీళ్లు అరగడం మొదలుపెడతాయు.
ప్రమాదాలు: రోడ్డు ప్రమాదాల్లో, క్రీడల్లో కీళ్లకు దెబ్బలు తగిలినా తక్షణ చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో కీళ్లు అరిగిపోవచ్చు.
 
కీళ్లకు దెబ్బలు తగిలితే?
సాధారణంగా ప్రమాదాల్లో కీళ్లకు దెబ్బలు తగిలినప్పుడు నొప్పి తగ్గేవరకూ కంగారుపడి, తగ్గగానే దెబ్బ గురించి మర్చిపోతాం! లేదా అదే తగ్గిపోతుందిలే! అని నొప్పిని ఎక్కువ కాలం భరిస్తూ, చికిత్సకు తాత్సారం చేస్తాం! కానీ వాపు లేని నొప్పి రెండు రోజుల్లో తగ్గిపోయి, కదలికలకు ఎటువంటి ఇబ్బంది కలగకపోతే ఆందోళన పడనవసరంలేదు. నొప్పి తగ్గించే మందులు వేసుకుని, ఐస్‌ ప్యాక్‌ పెట్టి, కీలు ఎత్తులో ఉంచి, విశ్రాంతి ఇవ్వాలి. అయినా తగ్గకపోతే ఎక్స్‌ రే, ఎమ్మారై తీయించుకోవాలి. ప్రమాదం జరిగినప్పుడు కేవలం ఎముకలే కాకుండా, ఆ ప్రదేశంలోని కండరాలు, మినిస్కస్‌, లిగమెంట్లు దెబ్బ తినవచ్చు. వీటిలో సమస్యలను వెనువెంటనే గుర్తిస్తే తక్షణమే రిపేర్‌ చేయవచ్చు. అలా కాకుండా ఆలస్యం చేస్తే మరమ్మతు చేయడం క్లిష్టమై, శాశ్వత సమస్యగా మిగిలిపోతుంది. పైగా ఈ సమస్య కారణంగా ఎముకలూ అరిగిపోయి, కీళ్ల మార్పిడి చేయించుకోవలసి వస్తుంది. లిగమెంట్లు దెబ్బతింటే నెలన్నర లోపు సర్జరీతో సరి చేయించుకోవాలి. లేదంటే కీళ్లు అరగడం మొదలు పెడతాయి.
 
కీళ్ల వాతం ఉంటే?
ఉదయం నిద్ర లేచిన వెంటనే కొద్ది నిమిషాల పాటు చేతివేళ్లు లేదా పాదం వేళ్లు బిగుసుకుపోవడం...
తక్కువ జ్వరం ఎక్కువ కాలంపాటు వేధిస్తూ ఉండడం
పెద్ద కీళ్లు (తుంటి, మోకాలు, భుజం) నొప్పి పెడుతూ ఉండడం

పరీక్షలు!

రక్తపరీక్ష: ఈ పరీక్షతో వంశపారంపర్యంగా జన్యువుల ద్వారా కీళ్ల వాతం సంక్రమించిందని నిర్థారించుకోవచ్చు. కీళ్ల వాతాన్ని కలిగించే ‘రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌’ ఉంటే ఈ పరీక్షతో బయల్పడుతుంది. కాబట్టి కుటుంబంలో కీళ్ల వాతం ఉంటే, పిల్లలు 16 ఏళ్ల వయసులో తప్పనిసరిగా ఈ పరీక్ష చేయించుకుని కీళ్ల వాతం వచ్చే అవకాశాలను ముందుగా గుర్తించి, జాగ్రత్త పడవచ్చు.
 
ఇన్‌ఫ్లమేటరీ ఆర్థ్రయిటిస్‌ ప్రొఫైల్‌: రక్తపరీక్షలో రుమటాయిడ్‌ ఫ్యాక్టర్‌ ఉందని తేలితే మరింత లోతైన పరిశీలన కోసం చేసే పరీక్ష ఇది. ఈ పరీక్షలో పాజిటివ్‌ ఫలితం వస్తే రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, సోరియాసిస్‌, స్జౌగ్రెన్స్‌ సిండ్రోమ్‌ (ముఖం, గొంతు, ఇతర కీళ్లల్లో ఇన్‌ఫెక్షన్‌), ఎరిథిమా (ముఖం ఎర్రబారడం)... ఇలా కీళ్ల వాతంతో సంబంధం ఉన్న కొన్ని రకాల ఆటోఇమ్యూన్‌ వ్యాధులను కూడా ఈ పరీక్షతో కనిపెట్టవచ్చు.
ఫలితాన్ని బట్టి మూల కారణాన్ని చికిత్సతో సరిదిద్ది కీళ్ల వాతాన్ని అదుపు చేయవచ్చు.
 
ప్రతి మూడు నెలలకూ లివర్‌ టెస్ట్‌!
కీళ్ల వాతం తగ్గించే మందులు ప్రధానంగా కాలేయం, మూత్రపిండాల మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ మందులు వాడేవాళ్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి కాలేయ పరీక్ష చేయించుకుంటూ ఉండడం అవసరం. పరీక్షలో కాలేయం ఆరోగ్యంగా ఉందని తేలితే, అవే మందులు కొనసాగిస్తూ ఉండవచ్చు.
 
కీళ్ల చికిత్స ఇలా!
నోటి మాత్రలు: వాతం ఉన్న ఎక్కువ శాతం మందికి నోటి
మాత్రలతో నొప్పులు అదుపులోకి వస్తాయి.
ఇంజెక్షన్స్‌: కొంతమందికి రెసిస్టెన్స్‌ ఉండి, నోటి ద్వారా అందించే మందులతో నొప్పులు తగ్గవు. ఇలాంటివాళ్లకు బయలాజిక్స్‌ అనే
ఇంజెక్షన్స్‌ ఇవ్వవలసి ఉంటుంది.
మృదులాస్థి అరిగితే: వాతం వల్ల కాకుండా ప్రమాదాలు, అధిక బరువు వల్ల మృదులాస్థి అరిగితే, దాన్ని పెంచే నోటి మాత్రలు వేసుకుని, వ్యాయామాలు చేయాలి. అప్పటికీ నొప్పులు అదుపులోకి రాకపోతే రోగి శరీరం నుంచి స్టెమ్‌సెల్స్‌ సేకరించి తిరిగి మోకాల్లోకి ఇంజెక్షన్‌ ద్వారా ప్రవేశపెడతారు. ఈ పరిస్థితిని మించి కీళ్ల నొప్పులు ఉంటే, రోగి నుంచి ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా సేకరించి, ఇంజెక్ట్‌ చేస్తారు. ఈ చికిత్సలన్నీ ఆర్థ్రయిటిస్‌ ప్రధమ దశలో ఉన్నవారికే ఉపయోగపడతాయి.
సర్జరీ: వాతం, ప్రమాదాలు, అధిక బరువు... ఏ కారణం వల్ల కీళ్లు సరిదిద్దలేనంతగా అరిగిపోయినా, సర్జరీ తప్పదు. అయితే కీలు మొత్తం మార్చకుండా ఎముక అరిగిన ప్రదేశాన్ని గుర్తించి, ఆ ప్రాంతాన్ని మాత్రమే ‘పార్షియల్‌ నీ రీప్లే్‌సమెంట్‌’ సర్జరీ ద్వారా సరి చేయవచ్చు. రోగి వయసు, కీలు అరిగిన తీరు ఆధారంగా ఎలాంటి సర్జరీ అవసరం అనేది వైద్యులు నిర్ణయిస్తారు.
నీ రీప్లేస్‌మెంట్‌: 60 ఏళ్లు దాటినవారికి, కీళ్లు నడవలేనంతగా అరిగిపోయినప్పుడు ఈ సర్జరీ చేయక తప్పదు. దీన్లో కూడా ‘హైఫ్లెక్స్‌’ (మోకాలును ఎక్కువగా వంచి పనులు చేసుకోవడానికి వీలుగా), చిన్న వయస్కులైతే ఎక్కువ కాలం మన్నే ‘ఆక్సీలియం’, పెద్ద వయస్కులైతే ‘క్రోమియం కోబాల్ట్‌’ మెటీరియల్‌తో తయారైన కృత్రిమకీళ్లు సర్జరీ ద్వారా అమరుస్తారు.
 
మందులు వాడకపోతే?
కీళ్ల వాతం నొప్పులు మందులతో అదుపులోకి వస్తాయి. దాంతో కొందరు రెండు, మూడేళ్లపాటు వాడి మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాపు క్రమక్రమంగా పెరుగుతూ కీళ్ల మధ్య ఉన్న మృదులాస్తి అరిగిపోతుంది. దాంతో కీళ్ల ఎముకలు అరిగి చిన్న వయసులోనే కీళ్ల మార్పిడి అవసరమవుతుంది. కాబట్టి భవిష్యత్తులో కీళ్లు అరిగిపోకుండా చక్కగా పని చేస్తూ ఉండాలంటే వైద్యులు సూచించినంతకాలం మందులు వాడుతూనే ఉండాలి.
 
టీనేజర్లలో... మోకాలి నొప్పులు!
కాండ్రోమలాసియా: మోకాలిచిప్ప దగ్గర ఉండే మృదులాస్థి మరీ మృదువుగా మారే సమస్య ఇది. ఎక్కువసేపు కూర్చుని లేచినా, మెట్లు ఎక్కినా మోకాళ్లలో నొప్పి మొదలవుతుంది. ఈ సమస్య కనిపించినప్పుడు కార్టిలేజ్‌ గట్టిపడే మాత్రలు తీసుకుంటూ, మృదులాస్థి గట్టిపడే వ్యాయామాలు చేస్తూ, పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది.
 
యూరిక్‌ యాసిడ్‌: జంతుసంబంధ ప్రొటీన్‌ను జీర్ణం చేసుకోలేని, జన్యుపరంగా సంక్రమించిన లక్షణం కారణంగా, రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయి పెరిగిపోయే సమస్య ఇది. దాంతో ఆహారంలో ప్రొటీన్‌ పెరిగితే, యూరిక్‌ కీళ్ల మధ్య యాసిడ్‌ క్రిస్టల్స్‌ తయారై సమస్య మొదలవుతుంది. ఈ సమస్యనే ‘గౌట్‌’ అంటారు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా, దీర్ఘకాలంలో మోకాళ్లు అరిగిపోతాయి.