భంగిమ సరైనదేనా?

18-02-2019: సాంకేతిక వస్తువులను వాడుతూ, వాటికేసి చూస్తూ రోజంతా గడిపేస్తూ ఉంటాం. అయితే ఆ సమయంలో మన శరీర భంగిమ ఎలా ఉంటోంది? ఆ భంగిమ ప్రభావంతో మన శరీరం ఎంత అసౌకర్యానికి గురవుతుందో గ్రహించి, సరిదిద్దుకుంటూ ఉండాలి. లేదంటే శాశ్వత తిప్పలు తప్పవు.
 
ఒక్కో సందర్భంలో ఒక్కోలా కూర్చుంటాం. డాక్టర్‌ని కలవడం కోసం ఎదురుచూస్తున్నప్పుడు వెనక్కి జారగిలబడి కూర్చుంటాం. ఆఫీసుల్లో మెడ ముందుకు చాపి మానిటర్‌ని ఎక్కువ సమయం చూస్తూ గడిపేస్తాం. సినిమాహాల్లో కాళ్లను ముందుకు చాపి, సీట్లో వెనక్కి వాలిపోతాం. భంగిమ ప్రభావం అన్నిటికంటే ఎక్కువ తల మీదే పడుతుంది. భుజాలకు సమాంతరంగా ఉన్నప్పుడు వెన్నుపై పడే 5 కిలోల బరువు కాస్తా, తలను ఏ కొంచెం పక్కకు లేదా ముందుకు వంచినా, రెండింతలు పెరిగిపోతుంది. దాంతో వెన్ను నొప్పి, దీర్ఘకాలంలో మోకాలి నొప్పి, దాన్నుంచి కాలి గిలక నొప్పులు మొదలవుతాయి. ఈ నొప్పులు రాకుండా ఉండాలంటే...
 
మానిటర్‌, మీ కనుచూపు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.
కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు, చేతులు నేలకు సమాంతరంగా ఉంచాలి.
 మెడను ముందుకు లేదా కిందకు ఎక్కువ సమయంపాటు చాపి ఉంచకూడదు.
సెల్‌ఫోన్‌ను కంటికి ఎదురుగా ఉంచి గమనించాలి. అంతేగానీ, దాన్ని వాడేటప్పుడు తలను కిందకు వంచకూడదు.
సెల్‌ఫోన్‌ను చేత్తో చెవి దగ్గర పెట్టుకునే మాట్లాడాలి, లేదా ఇయర్‌ ఫోన్స్‌ వాడాలి. అంతేగానీ మెడ ఆధారంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు.