ప్రకృతి వైద్యంతో కీళ్లనొప్పి దూరం!

ఆంధ్రజ్యోతి (07-01-2020): నడి వయసులో కీళ్లనొప్పులు లేని వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు! మెడనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల వంటి కీళ్ల బాధలు, ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి! అయితే.... కీళ్లనొప్పికి పెయిన్‌ కిల్లర్స్‌కు బదులు ప్రకృతి చికిత్సా విధానాలను ఆశ్రయించడం మేలు! ఏ అవయవమైనా, శరీరంలోని ఏ కీలైనా, శక్తిమంతంగా పనిచేస్తేనే నిండూనూరేళ్లు ఆరోగ్యంగా ఉంటాం. కానీ, ఆహార పదార్థాల్లో ఆమ్లం అధికమై, క్షారం బాగా తగ్గిపోవడంతో శరీరం కదల్లేని పరిస్థితీ, కీళ్లు దెబ్బతిని కాలు కదపలేని దుస్థితీ ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు... అంటే, సేంద్రియ ఎరువులతోనే పంటలు పండించే రోజుల్లో శరీరానికి కావలసిన ఆమ్లం, క్షారం సమతుల్యంగా ఉండేవి. శరీర అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే రక్తం ఆరోగ్యంగా ఉండాలి. రక్తం ఆరోగ్యంగా ఉండడం అంటే, అందులో ఆమ్లం, క్షామం సమతుల్యంగా ఉండాలి. రక్తంలో ఆమ్లతత్వం పెరిగితే ఎముకలు కీళ్లు అరిగిపోతాయి. కండరాలు బలహీనమవుతాయి. రక్తంలో ఆమ్లతత్వం పెరిగే కొద్దీ ఎముక కూడా కరిగిపోతుంది. కడుపులో అల్సర్లు తలెత్తుతాయి. ఎక్కువ మంది నేడు తీసుకుంటున్న ఆహార పదార్థాలు, ఆమ్లాన్ని పెంచేవిగానే ఉన్నాయి.

 
ఆమ్లంతో చేటు!
తెల్లని ఆహారపదార్థాలు అంటే... పాలిష్‌ పట్టిన బియ్యం, పంచదార, పాలతో చేసిన స్వీట్లు, ఐస్‌క్రీములు, మైదాపిండి, ఉప్పు, వంటివి రక్తంలో ఆమ్లాన్ని పెంచుతాయి. పచ్చళ్లు, గసగసాలు, దాల్చిన చెక్క(పట్టా) సాజీర, లవంగాలు, బిర్యానీలు, మాంసాహారంతో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. ఇలాంటి ఆహార పదార్థాల ద్వారా కొన్ని విష పదార్థాలు శరీరంలో చేరతాయి. వీటి వల్ల రక్తం ఆమ్లతత్వంతో నిండిపోతుంది. ఈ ఆమ్లంతోనే ఎముకలు, కీళ్లు, కండరాలు, దెబ్బతింటాయి. మాంసాహారంతో రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ పెరుగుతుంది. ఇది కీళ్లలోకి చేరి సమస్యలు తెచ్చిపెడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ శాతం పెరిగితే ‘గౌట్‌’ అనే కీళ్ల వ్యాధి వస్తుంది.
 
ఉప్పు తెచ్చే ముప్పు!
ప్రతి వ్యక్తికి రోజుకు 2-3 గ్రాముల ఉప్పు అవసరం. అయితే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పండ్ల రసాల్లోనూ ఉప్పు ఉంటుంది. అది మన జీవక్రియలకు సరిపోతుంది. అదనంగా ఉప్పు వాడవలసిన అవసరం లేదు. కానీ, రోజుకు 15 - 20 గ్రాముల ఉప్పు వాడతున్నాం. దీనివల్ల కణం లోపలా, బయటా ఉండే సోడియం, పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. ఎక్కువైన ఉప్పులో కొంత మల, మూత్ర, స్వేదాల ద్వారా బయటికి వెళ్లినా, మిగిలిన ఉప్పు రక్తంలోకి చేరి, చివరికి కీళ్లల్లో పేరుకుంటుంది. ఉప్పుకు నీటిని గ్రహించే లక్షణం ఉంది. ఉప్పు కీళ్లలో సైనోవియల్‌ ద్రవాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా ఆ ద్రవం తగ్గిపోయి, కీళ్లు పెళుసుబారిపోతాయి. దానిఫలితంగా ఎముకలు ఒకదానితో ఒకటి రాపిడి జరిగి, మృదులాస్థి అరిగిపోయి, కీళ్ల వాపు, నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
 
వ్యాయామంతో కీళ్ల చైతన్యం!
కీళ్ల నొప్పులు ఉన్న వారు ఎక్కువ దూరాలు నడవలేరు. ఎందుకంటే నడవడం వల్ల శరీరం బరువు తుంటి, మోకాళ్ల కీళ్లు, మడమ కీళ్ల మీద పడుతుంది. దాంతో కీళ్లు మరింతగా దెబ్బ తింటాయి. యోగాసనాలతో ఈ సమస్య ఉండదు. ఎందకంటే ఆసనాలు కీళ్లను పటిష్టపరిచేవే గానీ, నష్టపరిచేవి కావు. కాలి మడమ, మోకాలు, మణికట్టు, భుజాలను గుండ్రంగా తిప్పడం, మెడ వ్యాయామాలు చేయడం, నడుము గుండ్రంగా తిప్పడంతో పాటు, అర్థసీతాకోకచిలుక వ్యాయామం (హాఫ్‌ బటర్‌ఫ్లై), పూర్తి సీతాకోకచిలుక వ్యాయామం (ఫుల్‌ బటర్‌ఫ్లై) వంటి వ్యాయామాలతో ఉపశమనం పొందొచ్చు.
 
కూరగాయల రసంతో...
కీళ్లు సమర్థంగా పనిచేయడానికి కావలసిన ఏ, సీ, ఇ విటమిన్లు, కాపర్‌, సెలీనియం, జింక్‌లాంటి పోషక పదార్థాలు అందాలంటే పండ్లు, సలాడ్‌లు విరివిగా తీసుకోవాలి. ఈ తరహా ఆహార పదార్థాలను మూడు భాగాలుగా విభజిస్తే.....
 
కాలేయానికి మేలు చేసే విటమిన్‌ ఏ కోసం క్యారెట్‌, బీట్‌రూట్‌, టొమాటో, ముల్లంగి, కొత్తిమీర, కరివేసాకు, మునగాకు లాంటివి రసంగా వాడుకోవడం మేలు.
 
బి విటమిన్ల కోసం కీర, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ లాంటివి తీసుకోవాలి.
 
కీళ్ల దృఢత్వానికి అతి ముఖ్యమైన క్యాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం కోసం మునగాకు, గుమ్మడి, బూడిద గుమ్మడి, తోటకూర లాంటివి రసంగా తీసుకోవడం మంచిది.
 
యోగాసనాలతో...
కీళ్లనొప్పులు ఉన్నవారు అన్ని రకాల ఆసనాలూ వేయవచ్చు. కొత్తగా ఆసనాలు వేస్తున్నప్పుడు కొంచెం నొప్పి అనిపించడం సహజమే! కాకపోతే, కీళ్లనొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఏ ఆసనమూ వేయకూడదు. కీళ్లనొప్పుల్ని తగ్గించడంలో తోడ్పడే కొన్ని ఆసనాలను నెమ్మదిగా, ఒక్కొక్కటిగా సాధన చేయాలి.
 
వాటిలో సులువుగా వేయగల ఆసనాలు నాలుగు రకాలు ఉన్నాయి.
 
నిలబడి వేసే అర్థకటి చక్రాసనం, అర్థ చక్రాసనం, పాద హస్తాసనం కూర్చుని చేసే వక్రాసనం, అర్థమత్స్యేంద్రాసనం, ఉష్ట్రాసనం పొట్టపై పడుకుని చేసే భుజంగాసనం, శలభాసనం, దనురాసనం.
వెన్నుపై పడుకుని చేసే ఉత్థాన పాదాసనం, పవన ముక్తాసనం, శవాసనం.
 
చివరగా వేసే శవాసనంతో అంతకు ముందు వేసిన ఆసనాల ద్వారా కలిగిన అలసట, నొప్పి తగ్గిపోయి శరీరంలోని ప్రతి అవయవం పూర్తిగా విశ్రాంతి పొందుతుంది.

ఆహారంతో కీళ్లు పటిష్ఠం!
ఎముకలు, కీళ్ల దృఢత్వానికి గింజ ధాన్యాలు ఎంతో అవసరం. గింజల పై పొట్టులో ఎముకలు, కీళ్లకూ పనికొచ్చే క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం ఉంటాయి. అయితే పాలిష్‌ పట్టడం ద్వారా వాటి పై పొరలో ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు బయటికి వెళ్లిపోతాయి. అందువల్ల పై పొట్టు ఉన్న గింజ ధాన్యాలు తినడం శ్రేయస్కరం. చిరుధాన్యాల్లో అన్నింటికన్నా ఎక్కువ క్యాల్షియం రాగుల్లో ఉంటుంది. 100 గ్రాముల రాగుల్లో 344 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది. బియ్యంలో 10 గ్రాములే ఉంటుంది. అందువల్ల వారానికి మూడునాలుగు రోజులైనా రాగి సంకటి తినాలి. ఆకుకూరల్లో, తోటకూరల్లో 100 గ్రాములకు 800 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది. అందువల్ల తోటకూర, మునగాకు, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు వంటి ఆకుకూరలను విరివిగా తినాలి. వీటతో పాటు రాగి మొలకలు, రాగి లడ్డు, రాగిమాల్ట్‌ తీసుకోవడం ఎంతో అవసరం.
 
క్షారత్వం కోసం...
ఆమ్లత్వాన్ని కలిగిన ఆహారం కీళ్లకు నష్టం చేస్తుంది కాబట్టి క్షారత్వాన్ని పెంచే ఆహారం తీసుకోవడం తప్పనిసరి! తాజాపండ్లు, ఆకుకూరలు, కాయకూరలు, గింజల్లో క్షారత్వం నిండుగా ఉంటుంది. కాబట్టి కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు, నివారణకూ ఈ ఆహారాన్ని తీసుకోవచ్చు. పండ్లు తినడం వల్ల శరీరంలో క్షారతత్వం, ప్రాణశక్తి పెరిగి, శరీరంలోని కణాలన్నీ శక్తిమంతమై, రోజువారీ జరిగే కీళ్ల నష్టం తగ్గుతుంది. పండ్లలో ఉన్న ఎంజైమ్‌లకు కీళ్ల వాపు, నొప్పులను తగ్గించే గుణం ఉంది. నిమ్మకాయలోని సిట్రిక్‌ ఆమ్లం దెబ్బతిన్న కణాలను బాగుచేస్తుంది. కమలా, బత్తాయి, నారింజ, అనాస, దానిమ్మ లాంటి పండ్లు ఎక్కువ మేలు చేస్తాయి. అందుకే రెండు పూటలా అపక్వాహారం, అంటే... తాజాపండ్లు తీసుకుంటే రూమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి సాంత్వన చేకూరుతుంది.
- డాక్టర్‌ టి.కృష్ణమూర్తి, సూపరింటెండెంట్‌
రెడ్‌క్రాస్‌, యోగా అండ్‌ నేచర్‌క్యూర్‌ సెంటర్‌, జూబ్లీ హిల్స్‌, హైదరాబాద్‌.