తెగిన వేళ్లను అతికించవచ్చు

ఆంధ్రజ్యోతి,15-09-13

చేతులుండీ వేళ్లు లేకపోతే... చేతులు ఉన్నా లేనట్లే. చేతి వేళ్లు లేకపోతే ఏ పనీ చేయలేరు. ఒక వస్తువును పట్టుకోవాలంటే చేతి వేళ్లు ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మరి అంతటి ప్రాముఖ్యం ఉన్న వేళ్లు ప్రమాదవశాత్తూ తెగిపోతే జీవితాంతం అలానే గడపాలా? అంటే ఆ అవసరం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఆధునిక సదుపాయాలున్న ఆస్పత్రిలో, నిష్ణాతులైన వైద్యులను సంప్రదిస్తే చేతి వేళ్లను సర్జరీ ద్వారా అతికించి కాపాడే అవకాశం ఉంటుందని అంటున్నారు ప్లాస్టిక్‌ అండ్‌ కాస్మెటిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శశికాంత్‌. 
 
ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో చేతికి గాయం అవుతూనే ఉంటుంది. చిన్న గాయమైతే పర్వాలేదు గానీ పెద్దగాయమైతే, చేతి వేలు సగానికి తెగిపోతే, గోరు చితికిపోతే నిర్లక్ష్యం చేయడం ఏ మాత్రం మంచిది కాదు. అదే తగ్గిపోతుందిలే అని సాధారణ చికిత్సలు తీసుకుని వదిలేస్తే ఆ తరువాత చికిత్స తీసుకోవడానికి అవకాశం ఉండదు. చికిత్స తీసుకున్నా ఫలితం ఉండదు. ఇంట్లో కూరగాయలు కోస్తున్న సమయంలో, ఫ్యాక్టరీలో యంత్రాలపై పనిచేసే సమయంలో చేతి వేళ్లు కట్‌ కావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రమాదాల్లో చేతి వేళ్లు చితికిపోతాయి. కోపంలో గ్లాస్‌ను పగులగొట్టినప్పుడు చేతి వేళ్లకు గాయాలవుతాయి. ప్రమాదం ఎలా జరిగినా, తీవ్రత ఎలా ఉన్నా నిపుణులైన వైద్యులకు చూపించుకోవడం ఉత్తమం. 
 
తెగితే ఏం చేయాలి? 
చేతి వేలు పూర్తిగా కట్‌ అయినట్లయితే, ఆ భాగాన్ని శుభ్రంగా కడిగి ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి, ఐస్‌కవర్‌లో పెట్టుకుని వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లాలి. ప్రమాదం జరిగిన 6 నుంచి 8 గంటలలోగా ఆస్పత్రికి చేరుకునేలా చూసుకోవాలి. సమయంలోగా ఆసుపత్రికి చేరుకుంటే సర్జరీ ద్వారా తెగిన వేలును అతికించే అవకాశం ఉంటుంది. డ్రెస్సింగ్‌ చేసుకుని, రక్తస్రావం కాకుండా కట్టు కట్టుకుని ఆధునిక సదుపాయాలున్న ఆస్పత్రికి వెళ్తే ఉపయోగం ఉంటుంది. అక్కడ వైద్యులు రక్తనాళాల పరిస్థితి ఎలా ఉంది? కండరాలు ఎంత మేర కట్‌ అయ్యాయి? టెండాన్స్‌ ఎలా ఉన్నాయి? తదితర విషయాలను పరిశీలించి అవసరమైన చికిత్సను అందిస్తారు. చేయి పూర్తిగా కట్‌ అయినప్పుడు కూడా సమయంలోగా ఆస్పత్రికి వస్తే ఆపరేషన్‌ చేసి చేయి పోకుండా కాపాడే వీలుంది. నరం కట్‌ అయి చేతి స్పర్శ కోల్పోయినప్పుడు నరాన్ని తిరిగి అతికించడం ద్వారా పోయిన స్పర్శ వచ్చేలా చేయవచ్చు. కండరం బాగా దెబ్బతింటే ఇతర భాగంలో నుంచి కండరం తీసుకుని సర్జరీ ద్వారా అమర్చడం జరుగుతుంది. దీన్ని ఫ్లాప్‌ సర్జరీ అంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి చేతులు, కాళ్లు బాగా గీరుకుపోయి ఉంటాయి. లోతైన గాయాలు ఏర్పడతాయి. అటువంటి వారికి ఈ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్సలతో అవయవాలు పనితీరు కోల్పోకుండా కాపాడవచ్చు. 
 
వేలు అతికించే పరిస్థితి లేకపోతే...
కొందరిలో వేలు కట్‌ అవుతుంది. ఆస్పత్రికి వచ్చే సరికి బాగా ఆలస్యం అవుతుంది. సర్జరీ చేసి వేలు తిరిగి అతికించే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు రీకన్‌స్ట్రక్ట్‌ సర్జరీ ఉపయోగపడుతుంది. అంటే కాలు వేలును తీసుకువచ్చి చేతికి అతికించడం జరుగుతుంది. చేతి వేలు పూర్తిగా కోల్పోతే కాలు నుంచి వేలును తీసుకుని చేతికి అమర్చవచ్చు. దీనివల్ల చేతితో చేసే పనులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. వస్తువులు పట్టుకోవడంలాంటివి చేసుకోవచ్చు. కొందరికి చేతి వేలు గోరు భాగంలో సగం తెగిపోతుంది. అటువంటప్పుడు కూడా ఇతర భాగంలో కండరాన్ని తీసుకువచ్చి వేలు పూర్వస్థితికి వచ్చేలా చేయవచ్చు. వేలు రూపం కోల్పోకుండా కాపాడవచ్చు. అనుభజ్ఞులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీలను సమర్ధవంతంగా చేయగలుగుతారు. చేతికి గాయాలనైప్పుడు చిన్న గాయమే కదా అని నిర్లక్ష్యంగా ఉండిపోతే స్టిఫ్‌నెస్‌ ఏర్పడి చేతి వేళ్లు కదలలేని స్థితి ఏర్పడవచ్చు. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మరువద్దు. 
 
డాక్టర్‌ శశికాంత్‌
ప్లాస్టిక్‌ - కాస్మెటిక్‌ సర్జన్‌
యశోద హాస్పిటల్స్‌
మలక్‌పేట్‌, హైదరాబాద్‌
ఫోన్‌ : 99499 98378