సుఖ నిద్ర కోసం...

ఆంధ్రజ్యోతి,16/09/14

 రోజుకు ఎన్ని గంటలు నిద్రిస్తున్నామనేది ఎంత ముఖ్యమో, ఏ భంగిమలో పడుకుంటున్నామనేదీ అంతే ముఖ్యం.  ప్రత్యేకించి భుజాలు, వెన్ను, మెడ భాగాల్లో నొప్పి ఉన్నప్పుడు, లేదా గురక సమస్య, పాదాల వాపుల వంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ భంగిమల ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది. అయితే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 57 శాతం మంది ఏదో ఒక వైపునే పడుకుంటారని తేలింది. ప్రారంభంలో ఎలా పడుకున్నా మద్యలోనైనా ఆ భంగిమలోకి మారతారని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక 17 శాతం మంది వెల్లకిలా పడుకుంటారని, 11 శాతం మంది పొట్ట మీద పడుకుంటారని ఆ అధ్యయనాలు చెబుతున్నారు ఇక  మిగతా కొందరు ఏ రోజుకారోజు వేరు వేరు భంగిమల్లో పడుకుంటారని కూడా ఆ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. శరీరంలోని వివిధ భాగాల్లో  నొప్పులు ఉన్నవారు  ఏ భంగిమలో పడుకుంటే మేలో ఆ వివరాలు ఇప్పుడు మీకోసం...
 
 
1. భుజం నొప్పికి...
నొప్పి ఉన్న భుజం వైపు తిరిగి పడుకోకూడదు. వెళ్లకిలా పడుకోవడమే అన్ని విధాలా ఉత్తమం. నొప్పి లేని మరో భుజం వైపు తిరిగి కూడా పడుకోవచ్చు. కాకపోతే అలా పడుకున్నప్పుడు ఛాతీ కింద ఒక దిండు పెట్టుకోవాలి. ఒక వ్యక్తి మీద చేయి వేసినట్లు భుజాన్ని కాస్త దూరంగా చాపి పడుకోవాలి.
2. వెన్నునొప్పికి...
వెళ్లకిలా పడుకుని, వెన్నుకింద సహజమైన ఒంపు నిలిచేలా ఒక దిండు ఉంచుకోవాలి. మోకాలి మడతల కింద కూడా ఒక దిండు కానీ, లేదా మడచిన టవల్‌ను గానీ ఉంచుకోవాలి. అన్నంటినీ మించి వెన్నునొప్పి సమస్య ఉన్నవాళ్లు వెళ్లకిలా పడుకోవడమే ఉత్తమమని నిపుణులు చెబుతారు.
ఏదో ఒక వైపు తిరిగి పడుకున్నప్పుడు అదనపు సపోర్టు కోసం మోకాల మధ్య ఒక దిండు ఉంచుకోవాలి. తుంటి సమస్యలు, మోకాళ్ల సమస్యలు ఉన్నవారికి కూడా ఈ విధానం ఉపశమనకరంగా ఉంటుంది. 
వెన్నునొప్పి ఉన్నవారు పొట్ట మీద పడుకోవడం వల్ల వెన్ను, మెడ భాగాలు ఒత్తిడి గురవుతాయి. అందువల్ల ఈ భంగిమ వీరికి ఉపయుక్తం కాదు. ఒకవేళ తప్పనిసరి అయితే, పొత్తి కడుపు, తుంటి భాగానికీ మధ్య ఒక దిండు ఉంచుకోవాలి. దీని వల్ల వెన్ను, మెడ భాగాల మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది.
3. మెడ నొప్పికి...
ఈ నొప్పి ఉన్నవారు, అటూ ఇటూ పోకుండా మెడను ఒక తటస్థ భంగిమలో ఉంచడం చాలా అవసరం. పొట్టను నేలకు ఆనించి ఎప్పుడూ పడుకోకూడదు. అయితే మెడ కింది ఎక్కువ దిండ్లు పెట్టుకోవడం వల్ల మెడ వంగిపోయే స్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా భుజాల కన్నా కొంచెం ఎత్తుకు వచ్చేలా దిండు ఉపయోగించాలి. నిపుణులైతే మడచిన టవల్‌ను మెడకింద పెట్టుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.
4. గురక సమస్యకు 
గురక లేదా ‘ఆబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా’ సమస్యను తగ్గించడానికి ఏదో ఒకవైపు తిరిగి పడుకోవడం గానీ, లేదా పొట్ట మీద పడుకోవాలి. ఇది నాలుక వెనక్కి జరిగి గొంతులో అడ్డుపడి శ్వాసలో అంతరాయం రాకుండా నిరోధిస్తుంది. అలాగే నోట్లోని ఏదైనా కండర కణజాలం అలా అడ్డుపడకుండా కూడా తోడ్పడుతుంది. దీనికి తోడు అరచేతికీ తలకూ కింద ఒక టెన్నిస్‌ బాల్‌ ఉంచుకోవడం వల్ల కొంత  ఉపశమనంగా ఉంటుంది. 
5. ఆసిడ్‌ రిఫ్లెక్స్‌
కడుపులోని ఆమ్లాలు నోట్లోకి వచ్చే ఆసిడ్‌ రిఫ్లెక్స్‌ (పులి తేన్పులు) సమస్యను నివారించడానికి తల పైకి ఉండేలా దిండులు అమర్చుకోవడం అవసరం. లేదా మంచం తలవైపు భాగం ఎత్తుగా ఉండేలా మంచం కింద ఇటుకలు పెట్టాలి. అదీ కాకపోతే ఏదో ఒక వైపు తిరిగి పడుకోవడం మేలు.
6. ప్లాంటార్‌ ఫెసైటిస్‌
కాళ్లల్లో వాపు ఏర్పడే ఫాంటార్‌ ఫెసైటిస్‌ సమస్యకు పాదాలను, మడమలను ఏ మాత్రం ఒత్తిడి పడకుండా విశ్రాంత స్థితిలో ఉంచడం చాలా ముఖ్యం. పాదాలు  బిగపట్టినట్టు ఉండే పరిస్థితి లేకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం.