చలి కీళ్లకు దెబ్బ

03-12-2018: చలికాలం వచ్చిందంటే కీళ్ల నొప్పులు మొదలు! అరిగినవి, విరిగినవి... ఇలా ప్రతి కీలూ కలుక్కుమనాల్సిందే! ఈ నొప్పులకు విరుగుడు లేదా? ఈ బాధలు తప్పే మార్గం లేదా?
 
కీళ్లు పట్టేస్తాయి, బిగుసుకుపోతాయి, కిర్రుమంటాయి. చలికాలం వచ్చిందంటే అప్పటివరకూ నిశ్శబ్దంగా ఉండిపోయిన నొప్పులన్నీ నిద్ర లేస్తాయు. ఇలా ఎందుకంటే?....ఈ కాలంలో చర్మం అడుగున రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దాంతో కీళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా రక్తం ద్వారా కీళ్లకు అవసరమైన పోషకాలు అందకపోవడం వల్ల, మృదులాస్థి కుంచించుకుపోయి కీళ్లు బిగుసుకుంటాయి. ఆ ప్రదేశంలో నొప్పి మొదలవుతుంది. అయితే సమస్య ఎముకలది కాకపోయినా, అప్పటికే ఉన్న కీళ్ల సమస్య పెరగకపోయినా, చలికాలం వల్లే ఎముకల్లో ఇబ్బందులు ఎక్కువవుతున్నట్టు అనిపిస్తుంది.
 
ఇలాంటి ఇబ్బంది ఆస్టియో ఆర్థ్రయిటిస్‌, రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌ ఉన్నవాళ్లకు మరింత ఎక్కువ. అంతకు ముందు ప్రమదాల్లో కీళ్లు, లిగమెంట్లకు తగిలిన దెబ్బల వల్ల కూడా చలికాలంలో నొప్పులు మొదలవుతాయి. ఈ సమస్యలన్నీ శీతకాలంలో చలి వల్ల ఎక్కువ అవుతాయి కాబట్టి ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘రేనాడ్స్‌ ఫినామినా’ అని పిలుస్తారు. ఈ నొప్పుల బాధ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని ఉపశమన పద్ధతులు పాటించడంతోపాటు, కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అవేంటంటే...
 
బద్ధకం వదిలేద్దాం!
చలికాలం బద్ధకం పెరిగిపోతుంది. మిగతా రోజులతో పోలిస్తే చలి రోజుల్లో ఉదయాన్నే లేవలేం! ఎక్కువ సమయంపాటు వెచ్చగా, ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తుంది. వ్యాయామం అలవాటు ఉన్నా ఈ రోజుల్లో కాస్త బద్ధకిస్తాం! ఇలా శరీర కదలికలు తగ్గడం వల్ల శరీరంలో రక్తప్రసరణ తగ్గుతుంది. చేతి వేళ్లు, మోకాళ్లు, మోచేతుల్లోని కీళ్ల దగ్గర తగ్గిన రక్తప్రసరణ ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది. కీళ్లు పాక్షికంగా బిగుసుకుపోవడం, కదలికలు కొంత కష్టం కావడం లాంటి లక్షణాలు మొదలవుతాయి. అదే సమయంలో స్వల్పంగా నొప్పులూ పెరుగుతాయి.
 
ఇలా చేద్దాం!
 
ఏసీకి దూరంగా: ఆఫీసులు, సినిమా హాళ్లు... ఇలా ఎయిర్‌ కండిషనర్ల చల్లదనాన్ని చలికాలంలోనూ తప్పించుకోలేం! కానీ కీళ్ల నొప్పులు పెరగకుండా ఉండాలంటే ఎసిలకు దూరంగా ఉండాలి.
 
ఎండ సోకాలి: ఆహారం ద్వారా అందే క్యాల్షియం శరీరం శోషించుకోవడానికి సరిపడా విటమిన్‌ డి అవసరం. ఇందుకోసం రోజు మొత్తంలో కొంతసేపైనా చర్మానికి ఎండ సోకాలి. కాబట్టి చలికాలం పొద్దేక్కేవరకూ నిద్రపోకుండా నడక అలవాటు ఉన్నవాళ్లు ఈ కాలంలోనూ కొనసాగించాలి.
 
స్టెరాయిడ్లు మీకు మీరే వాడద్దు!: స్ట్టెరాయిడ్లు, కొన్ని రకాల యాంటీబయాటిక్‌ మందుల వాడకం వల్ల ఎముకలు గుల్లబారతాయి. వైద్యుల పర్యవేక్షణ లేకుండా, వైద్యులు సూచించకుండా వీటిని వాడకూడదు.
 
నొప్పులు తగ్గాలంటే?
చలికి విరుగుడు వేడి కాబట్టి, చలితో పెరిగే నొప్పులు తగ్గాలంటే వెచ్చదనం పెంచాలి. ఇందుకు హీటర్లు, స్వెటర్లు వాడవచ్చు.
గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసి కాళ్లు, చేతులు ముంచి, వేళ్లు కదిలిస్తూ ఉండాలి.
చల్లని వాతావరణం, ఏసీలకు దూరంగా ఉండాలి.
ఒంటికి ఎండ సోకేలా చూసుకుంటున్నా, వాతావరణంలో ఉన్న కాలుష్యం కారణంగా సూర్యకిరణాలు సూటిగా చర్మానికి తగలవు. ఫలితంగా చర్మంలో సింథసిస్‌ సక్రమంగా జరగక సరిపడా విటమిన్‌ ‘డి’ తయారవదు. కాబట్టి ప్రతిరోజూ కనీసం 10 మైక్రోగ్రాముల విటమిన్‌ డి సప్లిమెంటు తీసుకోవాలి.
నొప్పులు భరించలేనంతగా ఉంటే, వైద్యుల పర్యవేక్షణలో స్టెరాయిడ్లు వాడవచ్చు.
చేతి వేళ్లలో నొప్పులు ఉన్నవాళ్లు ‘హ్యాపీ బాల్‌’ నొక్కే వ్యాయామం చేయాలి.
వేళ్ల కదలికలకు వీలుండేలా చపాతీ పిండి పిసకడం లాంటి పనులు స్వయంగా చేయాలి.
గ్రిప్పర్స్‌, ఎలాస్టిక్‌ గ్యాడ్జెట్స్‌ వాడాలి.

దెబ్బల నిర్లక్ష్యం తగదు!

చిన్నాచితకా ప్రమాదాలను పెద్దగా పట్టించుకోం! కానీ ఎముకలు, మరీ ముఖ్యంగా కీళ్లకు తగిలే దెబ్బలు అప్పటికి ప్రభావం చూపించకపోయినా, దీర్ఘకాలంలో ఆర్థ్రయిటిస్‌కు దారి తీస్తాయి. అప్పటివరకూ లేని కీలు నొప్పి చలికాలంలో మొదలయిందంటే.. దాని అర్థం అంతకు ముందు జరిగిన ప్రమాదంలో కీలు గాయపడడమే! కీలులో నొప్పి ఉందంటే, కీలు మాత్రమే దెబ్బతింది అనుకోవడానికి లేదు. కీలు చుట్టూ ఉండే లిగమెంట్లు చిరిగినా, దెబ్బతిన్నా నొప్పి కీలులోనే మొదలవుతుంది. ఇవి ఎక్స్‌రేల్లో కనపడవు. కొన్ని సందర్భాల్లో విరిగిన ఎముకలు వంకరగా అతుక్కుంటాయి. అలా జరిగినా నొప్పులు తప్పవు. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు రక్తస్రావం కాకపోయినా, ఎముకలు, కీళ్ల దెబ్బలను నిర్లక్ష్యం చేయకుండా, వైద్యులకు చూపించాలి. అవసరమైతే ఎమ్మారై స్కానింగ్‌ ద్వారా లిగమెంట్ల పరిస్థితిని గమనించి, తగిన చికిత్స తీసుకోవాలి.
 
లిగమెంట్లు ఎంతో కీలకం!
కారు సాఫీగా నడవడానికి నాలుగు చక్రాలు ఎంత అవసరమో, కీళ్లు సాఫీగా కదలడానికి లిగమెంట్లు అంత అవసరం. లిగమెంట్లు, ఎముకలను సరైన కోణంలో కదిలేలా ఆసరా అందిస్తాయి. వీటిలో చీరికలు ఏర్పడితే ప్రమాదం జరిగిన కొద్ది రోజుల వరకూ నొప్పి వేధించి తగ్గిపోయినా, ఆ నష్టం దీర్ఘకాలంలో ఆర్థ్రయిటిస్‌కు దారి తీస్తుంది. కాబట్టి లిగమెంట్‌ గాయాల్ని సర్జరీతో సరి చేయించుకోవాలి.
 
మెత్తని సోఫాలో కూర్చోవద్దు!
మోకాలి కీళ్ల ఆర్థ్రయిటిస్‌ ఉంటే... అరగడం మొదలైన ఎముకలు మరింత అరిగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం...
 
మెత్తని సోఫాలను వాడకూడదు. సోఫాలో కూర్చున్నప్పుడు మోకాలు 90 డిగ్రీల కోణంలో ముడుచుకుంటుంది. ఈ యాంగిల్‌లో ఉన్న మోకాళ్ల మీద భారం మోపుతూ లేచే ప్రయత్నం చేస్తే కీళ్ల అరుగుదల పెరుగుతుంది. కాబట్టి సోఫా బదులు, బ్యాక్‌ సపోర్ట్‌ ఉన్న చెక్క కుర్చీలు వాడాలి.
ట్రెడ్‌మిల్‌, జుంబా, ఏరోబిక్స్‌కు బదులు మెత్తని పచ్చిక మీద నడక, సైకిల్‌ తొక్కడం, క్రాస్‌ ట్రైనర్‌ వాడడం మొదలైన వ్యాయామాలు చేయాలి. పార్షియల్‌ స్క్వాట్‌ వ్యాయామం చేయవచ్చు.
మెత్తని బూట్లు వాడాలి.
ఈత కొట్టడం కీళ్లకు అనువైన వ్యాయామం.
నేల, బల్లల మీద పడుకోకూడదు.
బరువును అదుపులో ఉంచుకోవాలి.
వైద్యులు సూచించిన ఫిజియోథెరపీ చేయాలి.

సర్జరీ ఎప్పుడంటే?

కీళ్ల నొప్పులు పెరిగినంత మాత్రాన మోకాలు మార్పిడి చేయించుకోవలసిన అవసరం లేదు. మందుల వల్ల నొప్పులు అదుపులోకి రాకపోయినా, మందుల వల్ల సమస్యలు తలెత్తినా, పది అడుగులు వేయలేకపోతున్నా అలాంటివారికి సర్జరీ అవసరం అవుతుంది. రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌లో అత్యధికంగా ప్రభావితం అయ్యేవి మోకాలి కీళ్లే! ఇలాంటివారికే సర్జరీ అవసరం ఉంటుంది.
 
ఫాస్ట్‌ట్రాక్‌: సర్జరీ చేసిన ఆరు గంటలలోపే రోగిని నడిపించవచ్చు. మూడో రోజు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవచ్చు. రెండు వారాల తర్వాత అన్ని పనులూ స్వయంగా చేసుకోవచ్చు.
 
జెండర్‌ నీ: పురుషులతో పోలిస్తే మహిళల జీవనశైలి కొంత విరుద్ధంగా ఉంటుంది. కూరగాయలు తరగడం, పూజ చేసుకోవడం, బట్టలు ఉతకడం లాంటి పనుల కోసం నేల మీద కూర్చునే అలవాటు మహిళలకు ఉంటుంది. దాంతో కీళ్లను ఎక్కువగా వంచవలసిన అవసరం వీళ్లకు ఎక్కువ. ఈ పనులన్నిటికీ ఆటంకం కలగకుండా ఉండడం కోసం మోకాలి మార్పిడి సర్జరీ చేసే సమయంలో కీళ్లను వైద్యులు ప్రత్యేకంగా కత్తిరిస్తారు. ఈ సర్జరీ వల్ల నేల మీద కాకపోయినా, కొంత తక్కువ ఎత్తులో కూర్చుని పనులు చేసుకునే వీలు కలుగుతుంది.
 
కీళ్ల నొప్పుల్లో రకాలు
ఆస్టియో ఆర్థ్రయిటిస్‌: పెరిగే వయసుతోపాటు, బరువు పెరగడం వల్ల, లేదా అంతకు ముందు జరిగిన ప్రమాదాల్లో కీళ్లు దెబ్బతినడం వల్ల మొదలయ్యే కీళ్ల నొప్పులివి.
జరుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌: రోగనిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల మొదలయ్యే కీళ్ల నొప్పులివి.
గౌట్‌ ఆర్థ్రయిటిస్‌: రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ పెరగడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు.
సెప్టిక్‌ ఆర్థ్రయిటిస్‌: ఇది చిన్నపిల్లల్లో సహజం. పిల్లలకు ఏదో ఒక సమయంలో చెవి, ముక్కు, లేదా ఛాతిలో ఇన్‌ఫెక్షన్‌ వస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ప్రమాదవశాత్తూ కిందపడి ఎముకలకు దెబ్బలు తగిలించుకుంటే, ఆ ప్రదేశంలో రక్తం గడ్డ కడుతుంది. ఆ రక్తం శరీరంలో మరో చోట ఉన్న ఇన్‌ఫెక్షన్‌ను ఆకర్షించి కీలుకు కీడు చేస్తుంది.
ఇన్‌ఫెక్టివ్‌ ఆర్థ్రయిటిస్‌: ఇది సెప్టిక్‌ ఆర్థ్రయిటిస్‌ అయి ఉండవచ్చు. లేదా ఎముకలకు క్షయ సోకి ఉండవచ్చు.

-డాక్టర్‌ టి.దశరథ రామరెడ్డి,

కన్సల్టెంట్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, యశోద హాస్పిటల్స్‌,
సోమాజిగూడ, హైదరాబాదు.