వెన్నునొప్పితో నరకం ఆయుర్వేదంతో కొత్తజీవితం

ఆంధ్రజ్యోతి,02-01-13

కలవారి పెద్దింటి కోడలు. మామగారు ఎమ్మెల్యే. ఇక చెప్పేదేముంది! వయసులో చిన్నదైనా బాధ్యతల కండువా భుజానకేసుకుంది. ఎంతమంది పని వాళ్లున్నా అందరికీ తలలో నాలుక ఆమే. క్షణం తీరిక లేని జీవితం. ఎప్పుడూ ఎవరో వెనుక తరుముతున్నట్లే హడావుడి.  అలాంటి ఆ వ్యక్తికి అనుకోని ఉపద్రవం పిడుగులా వచ్చి మీద పడింది. వెన్నునొప్పి ఆెెు జీవితంలో పెనుతుపాను సృష్టించింది. మంచానికే  పరిమితం కావాల్సిన పరిస్థితిలో సర్జరీ  వద్దనుకుని ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించింది. మూడు నెలల్లో తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందిన ఒక యువతి కేస్‌ స్టడీని వివరిస్తున్నారు             డాక్టర్‌ బుక్కా మహేశ్‌బాబు
 
ఆమె పేరు అమృత. వయస్సు 28 సంవత్సరాలు. ఇద్దరు పిల్లల తల్లి. ఆమె ఏ ప్రమాదానికి లోనుకాలేదు. ఎప్పుడూ దెబ్బలు కూడా తగిలించుకోలేదు. కానీ, ఆమె బాధ్యతలే ఆమెకు మోయలేని భారమయ్యాయి. ఆమె శరీరాన్ని అతలాకుతలం చేశాయి. నెమ్మదిగా మొదలైన వెన్నునొప్పి క్రమేపీ తీవ్రత పెంచింది. సంసారసుఖానికి పూర్తిగా దూరమైపోయింది. తనకేమైనా అయితే పిల్లల భవిష్యత్తు ఏమిటన్న బెంగ ఆమెను బాగా కృంగదీయసాగింది.  నగరంలోని ప్రముఖ వైద్యులందరూ ఆమెను పరీక్షించారు. అందరూ సర్జరీయే పరిష్కారమని తేల్చేశారు. డాక్టర్ల నిర్ణయానికి హోరుగాలిలో చిగురుటాకులా ఆమె కంపించిపోయింది. సర్జరీ చేయించుకుంటే జీవితాంతం బెడ్‌రెస్ట్‌ తప్పదని ఎవరో హెచ్చరించడంతో ఆమెకు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయ్యింది. ఒక పక్క నొప్పి తీవ్రత, మరో పక్క సర్జరీ భయం...ఏం చేయాలో పాలుపోని గందరగోళ మానసిక పరిస్థితి. ఓ బలహీన క్షణాన ఆత్మహత్యే శరణ్యమని కూడా భావించింది. అయితే  ఈ చావు కన్నా ఆ రేవు మేలన్నట్లు సర్జరీకి సిద్ధపడిపోయింది. ఆ క్షణంలో ఒక స్నేహితురాలు ఆమెకు ఆపద్బాంధవిగా అడ్డుపడింది. ఆ ఫ్రెండ్‌ సలహాతో అమృత మా వైద్యశాలకు వచ్చింది. ఆమె మా వద్దకు వచ్చినపుడు ఎదుర్కొంటున్న శారీరక లక్షణాలు ఇలా ఉన్నాయి.
వ్యాధి లక్షణాలు
వెన్ను నొప్పులతో కలతనిద్ర.
ఎక్కువసేపు కూర్చోలేదు.
రెండడుగులు వేయాలన్నా కష్టం.
ఎడమ కాలులో నొప్పి భరించలేనట్లుగా ఉంది. అది క్రమేపీ ఎడమ తుంటి నుంచి కిందవరకు జలపాతంలా జారుతుంది.
రెండు కాళ్లలో తిమ్మిర్లు.
పిక్కలు బిగదీసినట్లుగా పట్టేస్తాయి.
ఒక్కోసారి నిలబడ్డప్పుడు రెండు కాళ్లలో పటుత్వం లేనట్లుగా ఉంటుంది. వీటికి తోడు మెడనొప్పి. ఎడమ చేతిలో కూడా తిమ్మిర్లు. కొంచెం మామూలుగా తన పని తాను చేసుకున్నా మెడ ప్రాంతపు వెన్నుపూసల్లో ఫటఫటమని చప్పుళ్లు వస్తాయి. పడుకుని లేచినప్పుడు ఎడమ చేతిలో ఈ చప్పుళ్లు ఎక్కువగా ఉంటాయి.

చేతుల్లో వస్తువు జారిపోయిన విషయం తెలియదు.

బరువులు పట్టుకోలేని పరిస్థితి.

వ్యాధి నిర్ధారణ

మెడ, నడుము నొప్పులతో దాదాపు సంవత్సర కాలం నుంచి బాధపడుతూ అన్ని రకాల స్పెషాలిటీ వైద్యాలు చేయించుకున్నారు. సర్జరీ పరిష్కార మార్గంగా చెప్పడంతో అప్పుడు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించారు. ఆమె లక్షణాలన్నీ పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేసుకున్నాము. ఆయుర్వేదంలో చెప్పబడిన ఒక ప్రత్యేక వాత వ్యాధిగా గుర్తించాము. ఆ వాత వ్యాధి మూడు, నాలుగు ప్రత్యేక అంశాలతో కూడి పరిస్థితిని గంభీరం చేసింది. ఇలాంటి వాత వ్యాధులు అరుదైనవి. కాని ఇటీవల ఇలాంటి వ్యాధుల సంఖ్య పెరుగుతోంది. ఈ లక్షణాలు కలిగిన వాత వ్యాధి మనిషిని అతలాకుతలం చేస్తుంది. జీవితాన్ని పీల్చి పిప్పి చేసి జీవచ్ఛవంలా మార్చేస్తుంది. ఇది తీవ్రమైన గృధ్రసీ వాతముతో కూడిన మన్యాస్తంభ వాతవ్యాధిగా పేర్కొనవచ్చు. ఎంఆర్‌ఐ రిపోర్ట్స్‌ పరిశీలించిన తర్వాత ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. వెన్నెముక ఎల్‌3-ఎల్‌4 మధ్య భాగంలో ఉన్న డిస్క్‌ ఉబ్బి వెన్నుపాము ప్రవేశద్వారంలోకి ఎడమపక్క వైపు జారింది. అలాగే వెన్నెముక ఎల్‌4-ఎల్‌5 ప్రాంతంలో కూడా డిస్క్‌ ఉబ్బి వెన్నుప్రాంతంలోకి జారింది. అయితే సమస్య గంభీరమయ్యే అంశం ఇక్కడే ఉంది. డిస్క్‌ చుట్టూ రక్షణ కవచంలా ఉండే యాన్యులస్‌ అనబడే డిస్క్‌ జారకుండా ఉండే కవచం చితికిపోయింది. దాంతో చెదిరిన డిస్క్‌ వెన్నుపాము ప్రాంతంలో బాగా కదలడం సులువైంది. దీనివల్ల వెన్నుపాము పైపొరపై మరింత ఒత్తిడి పెరిగి సమస్యను జటిలం చేసింది. వీటికి తోడు మెడ ప్రాంతపు వెన్నెముక సి4-సి5, సి5-సి6 మధ్య ఉన్న డిస్క్‌లు జారి ఆ ప్రాంతపు వెన్నుపాము పైపొరపై ఒత్తిడి పెంచింది. చేతుల్లో తిమ్మిర్లు రావడానికి, బలం తగ్గడానికి ఇతరత్రా కారణాలకు, ప్రధానమైనటువంటి సమస్యలకు  ఇవే మూలం. ఈ రిపోర్టును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత వెంటనే కొన్ని ప్రధానమైన సలహాలు, సూచనలు రోగికి ఇచ్చాము. ముఖ్యంగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నడుము గట్టిగా పట్టుకోవడం, ముందుకు వంగకుండా ఉండటం, చెక్కబలపై పడుకోవడం లాంటి సలహాలు ఇచ్చాము. డిస్క్‌లు చెదరడంతోపాటు ఎల్‌4-ఎల్‌5 ప్రాంతంలో డిస్క్‌ చుట్టూ ఉన్న రక్షణలో చిరిగిపోవడం వల్ల డిస్క్‌ మరింతగా వెన్నుపామును ఒత్తుకుంటే కాలు పనిచేయకుండా పోయే అవకాశం ఉంది.

వైద్య విధానం

ఇలాంటి కేసులు మా అనుభవంలో ఎన్నో చూసి ఉండటం వల్ల చికిత్సతోపాటుగా రోగికి ఆత్మవిశ్వాసం కల్పించడం ప్రధానంగా భావించి భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధి తగ్గడం ఖాయమని రోగికి భరోసా ఇచ్చాము. ఇక్కడ వ్యాధి నిర్ధారణతోపాటు నిర్ణీత కాలవ్యవధిలో వ్యాధి తగ్గుతుందన్న అంశం అత్యంత కీలకమైంది. నిర్ణీత కాల వ్యవధిలో అత్యంత తీక్షణంగా పనిచేసే ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఆయుర్వేద రసాయనిక నానో ఔషధాలను వ్యాధి తీవ్రత, శరీర ధర్మములాంటి ప్రత్యేక అంశాలను పరిశీలించి ఔషధ మాత్ర నిర్ధారించడం జరిగింది. ఔషధ చికిత్స ప్రధానంగా చెప్పాము. చెదిరిన డిస్క్‌లు, వెన్నుపాము పైపొరపై ఒత్తిడి, చిరిగిన డిస్క్‌ చుట్టూ ఉండే రక్షణ వలయం అతకడానికి ప్రత్యేక కాంబినేషన్‌లో ఔషధాన్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేసుకున్నాము.

చికిత్స ప్రారంభం

సుమారు ఆరువారాల పాటు ఔషధ చికిత్స కొనసాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం మొదటి రెండు వారాలలోనే ఆమె చిన్న చిన్న పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. ఎడమ కాలులో భరించలేనంతగా ఉన్న నొప్పి కొంతమేరకు తగ్గుముఖం పట్టింది. దాంతో ఆమెకు మాట పట్ల, మందు పట్ల విశ్వాసం పెరిగింది. సాధారణంగా ఆయుర్వేదమంటే కఠిన పథ్యాలు, కఠిన నిబంధనలు ఉంటాయని ప్రజల విశ్వాసం. వాస్తవానికి ప్రాచీన ఆయుర్వేద ఋషులెవరూ అంత భయంకరమైన కఠిన పథ్యాలు ఏమీ చెప్పలేదు. ఆ ఆయుర్వేద ఋషులు ఆధునిక వైద్యులు కూడా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన విషయాలు చెప్పారు. వెన్నుకు సంబంధమైన వాత వ్యాధుల విషయంలో వారికి కూడా శాస్త్రీయ దృక్పథం ఉన్నట్లు వారు పేర్కొన్న అంశాలను బట్టి స్పష్టంగా అధ్యయనాల్లో తేలింది. వెన్ను నరాల ఒత్తిడి వల్లే గృధ్రసీ వ్యాధి వస్తున్నట్లు పేర్కొన్నారు. శుశృత సంహితలో నర్వ్‌స్‌ సిస్టమ్‌ గురించి పూర్తి స్థాయి అవగాహన ఉన్నట్లు స్పష్టంగా తేలింది. ఇలాంటి ప్రధాన శాస్త్రీయ అంశాలు ప్రజల్లో తెలియకపోవడం వల్లనే ఆయుర్వేదంలో ఇలా తగ్గుతాయన్న శాస్త్రీయ అంశాలు ఇటీవలే ప్రజలకు అర్థమవుతున్నాయి. ఆయుర్వేదం శాస్త్రీయమైనదని ప్రజలు పూర్తిగా విశ్వసించాల్సి ఉంది. అలా విశ్వసించిన వాళ్లకు మంచి అనుభవం కలిగిన వైద్యుని పర్యవేక్షణలో చికిత్స జరిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయనడానికి ఈ కేసే ప్రబల నిదర్శనం. నాలుగు వారాల తర్వాత ఆమె ముఖములో చిరునవ్వు వెలిగింది. ఇప్పుడు పదిలంగా కూర్చోగలదు. నిలబడగలదు. రెండడుగులే కాదు...వంద అడుగులు నడవగలదు. ఎడమ కాలులో ఉండే భరించలేనంత నొప్పి బాగా తగ్గింది. తిమ్మిర్లు కూడా బాగా తగ్గాయి. రెండు కాళ్లలో బలం వచ్చింది. ఇక బతకగలనన్న భరోసా కలిగింది. ఆయుర్వేద మందులు ఆలస్యంగా పనిచేస్తాయని, తీక్షణంగా పనిచేయవని, అత్యవసర పరిస్థితుల్లో అసలు పనిచేయవని, కషాయాలు, చేదు మాత్రలు ఉంటాయని, రకరకాల సమయాల్లో వాడాల్సి ఉంటుందని, దోసిళ్ల కొద్దీ మందులు మింగాల్సి ఉంటుందని...ఇలాంటి వదంతులు, అపోహలు ప్రజల్లో చాలా వ్యాప్తి చెందాయి. అయితే ఈ కేసులో ఆమె వాడిన మందులు అత్యంత సూక్ష్మమైనవి. చేదుమాత్రలు అసలేకావు. అత్యంత ప్రభావశీలమైనవి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ప్రయోజనం తప్ప ఇబ్బందులు కలగచేయనివి. ఆయుర్వేద ఔషధాలు కూడా అన్ని పరీక్షలు పూర్తిచేసుకుని అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో ఔషధ మాత్ర నిర్ణయించడం, వివిధ నిర్ణీత వేళల్లో తీసుకోవడం అత్యంత కీలకమైంది. అందుచేత ఔషధాలు నిర్ణీత వేళల్లో క్రమం తప్పకుండా వేసుకోవడం చికిత్సలో అత్యంత కీలకమైన అంశం. అందుకే మన పూర్వీకులు వైద్యుడిపైన, ఔషధంపైన విశ్వాసం ముఖ్యమని చెబుతారు. సహనము, విశ్వాసము, శ్రద్ధ దీర్ఘకాలంగా వెన్నునొప్పి సమస్యలతో బాధపడే వారికి అత్యంత కీలకమైనవి. మందు పనిచేస్తున్న క్రమంలో మధ్యమధ్యలో వైద్యుని కలుస్తూ సలహాలు, సూచనలు తీసుకుంటూ మార్పులు, చేర్పులు చేసుకోవలసి ఉంటుంది. ఇలా ఆమె క్రమం తప్పకుండా మా సలహా మేరకు నడుచుకోవడం వల్లే అద్భుతమైన విజయాన్ని సాధించగలిగింది.

చికిత్సా ఫలితం
కేవలం నెలరోజుల్లోనే మెడప్రాంతంలో వాపు తగ్గింది. చేతుల్లో బలం వచ్చింది. ఇంట్లో శుభకార్యానికి షాపింగ్‌ చేయగలిగింది. మంచానికి పరిమితమైన ఆమె లేచి తన పనులు తాను చేసుకుంటూ బయటి పనులు కూడా చేయగలగడం చికిత్సలో ఎంతో పురోభివృద్ధి. ఔషధాలను మరో ఆరువారాలు కొనసాగిస్తూ కేవలం వెన్నుప్రాంత సమస్యలపై పనిచేయగలిగిన కొన్ని ప్రత్యేకమైన ఔషధ విలువలతో కూడిన లతలు, గుల్మాలు, బెరడ్లు, పుష్పాలు, కాండాలు, వేర్లు లాంటి వాటి చేత ప్రత్యేకంగా తయారుచేసిన తైలాలతో తైల చికిత్సను రెండువారాల పాటు చేయడం జరిగింది. రెండు నెలలు గడిచేసరికి ఆమె దాదాపు మామూలు మనిషయ్యారు. తర్వాత కొన్ని ముఖ్యమైన వ్యాయామాలు సూచించాము. మూడో నెల దాటేసరికి మెడ ప్రాంతంలోని వాపు పూర్తిగా తగ్గిపోయింది. ఎడమకాలులో భరించలేనంతగా ఉండే నొప్పి ఇప్పుడసలేలేదు. ఇంటి పనులు మళ్లీ అవలీలగా చేసుకోగలుగుతున్నారు. చిన్న చిన్న బరువులు కూడా ఎత్తుతున్నారు. పిక్కలు పట్టేయడం లేదు. మూడు నెలల తర్వాత దాదాపు చికిత్స పూర్తయ్యింది. ఇప్పుడు ఆమె నడకలో వేగం పెరిగింది. సర్జరీ అనే మాట ఆమెకిప్పుడు ఓ పీడకల.
 
డాక్టర్‌ బుక్కా మహేశ్‌బాబు
గురు ఆయుకేర్‌ మల్టీ స్పెషాలిటీ
ఆయుర్వేద హాస్పిటల్‌
చందనా బ్రదర్స్‌ ఎదురుగా, 
చిక్కడపల్లి, హైదరాబాద్‌
ఫోన్‌: 9885306096, 040 27618612