ధ్యానం వ‌ల్ల ఫలితాలు ఉండ‌వా?

06-02-2018: మెడిటేష‌న్ చేస్తే ప్ర‌శాంత‌త చేకూరుతుంద‌ని, కోపం, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయ‌ని ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఇందులో వాస్తవం లేద‌ని బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు. ధ్యానం వ‌ల్ల ప‌లు ర‌కాల ప్ర‌యోజనాలు ఉంటాయ‌ని జ‌రుగుతున్న ప్ర‌చారం నిజం కాద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

`ధ్యానం వ‌ల్ల స‌త్ప్ర‌వ‌ర్త‌న‌, ప్ర‌శాంత‌త చేకూరుతాయా` అనే అంశం గురించి వారు 20 అధ్య‌య‌నాల‌ను చేసి ఫ‌లితాల‌ను స‌మీక్షించార‌ట‌. ధ్యానం చేసిన బృందాన్ని, చేయ‌ని బృందాన్ని ప‌రీక్షించి చూసి వారు ఫ‌లితాల‌ను వెల్ల‌డించారు. మెడిటేష‌న్ వ‌ల్ల సానుకూల దృక్ప‌థం ఏర్ప‌డ‌డం అనేది అపోహ మాత్ర‌మేన‌ని తెల్చారు. మెడిటేష‌న్ చేసిన కొద్ది సేపు అలాంటి మాన‌సిక స్థితి ఉంటే ఉండొచ్చ‌ని, దైనందిన కార్య‌క్ర‌మాల్లో మాత్రం వారు త‌మ కోపాన్ని, దూకుడును అదుపు చేసుకోలేక‌పోతున్నార‌ని వారు తెలిపారు. ధ్యానం వ‌ల్ల క‌లిగే మార్పుల గురించి ఇంకా లోతైన అధ్య‌య‌నం చేయాల్సి ఉంద‌ని వారు వెల్ల‌డించారు.