యోగా నియమాలు

20-06-2019: యోగాభ్యాసం ఫలం పరిపూర్ణంగా పొందడం కోసం యోగా ముందు, తర్వాత కొన్ని నియమాలు పాటించాలి. తీసుకోవలసిన ఆహారం, పాటించవలసిన జాగ్రత్తల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి.
యోగాభ్యాసానికి మూడు గంటల ముందు వరకూ సుష్టుగా భోజనం చేయకూడదు. యోగాకు అరగంట ముందు చిన్న పండును తినవచ్చు. అలాగే యోగా చేయడానికి అరగంట ముందు వరకూ చిన్న గ్లాసుకు మించి నీళ్లు తాగకూడదు.
యోగా చేస్తున్న సమయంలో వీలైనన్ని తక్కువ నీళ్లు తాగాలి.
యోగా పూర్తయిన తర్వాత అరగంట వరకూ ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఆలోగా యోగాతో శరీరంలో పెరిగిన రక్తప్రసరణ నెమ్మదిస్తుంది.
యోగాభ్యాసం ముగిసిన తర్వాత 10 నిమిషాల వరకూ శవాసనం వేయాలి. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. యోగాతో అలసిన కండరాలు ఈ సమయంలో స్వాంతన పొందుతాయి.
నిశ్శబ్దమైన ప్రదేశంలో యోగా సాధన చేయాలి.
యోగాభ్యాసం చేయబోయేముందు మలమూత్రాశయాలు ఖాళీగా ఉండాలి.
ఆదరాబాదరాగా, ఆందోళనతో, అలసటతో యోగాభ్యాసం చేయకూడదు.
యోగా ముగించిన 20 నుంచి 30 నిమిషాల తర్వాత స్నానం చేయాలి.