ఆనందం! ఆరోగ్యం! యోగాభ్యాసం

నిత్యజీవనస్రవంతిలో ప్రతీ ఒక్క అంశమూ ప్రధానమే! ఆనందంగా జీవించడానికి ధనం ఎంత ముఖ్యమో ఆహ్లాదంగా గడపడానికి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. నేటి టెక్నాలజీ యుగంలో సుఖమయజీవితానికి అలవాటుపడ్డ మనిషి, శారీరక శ్రమకు క్రమంగా దూరమయ్యాడు. మానసికంగా బలహీనుడయ్యాడు. అందుకే ఇప్పుడు రకరకాల ఆరోగ్య డైట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు. జిమ్‌ల బాట పడుతున్నారు. కానీ వీటన్నింటికంటే యోగా అత్యంత మేలైనదని పలు అధ్యయనాలు చెప్పకనే చెబుతున్నాయి. అందుకే ప్రతీ సంవత్సరం జూన్‌ 21వ తేదిన ప్రపంచ దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. 2015వ సంవత్సరంలో మొట్టమొదటి యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇక అప్పటినుంచీ ప్రతీ సంవత్సరం జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి యోగా ప్రయోజనాలేమిటో, పిల్లలు యోగా చేయడం వల్ల కలిగే ఫలితాలేమిటో ఒక్కసారి చూద్దామా!
 
యోగా పరిపూర్ణమైన ఒక ఆధ్యాత్మిక రూపం. వ్యాయామ సాధనాల సమాహారం. ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం, అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి ఆధ్యాత్మిక సాధనలకు యోగానే పునాది. పెద్దల నుంచి పిన్నల వరకూ ప్రతీ ఒక్కరికీ యోగా అవసరమే. యోగాభ్యాసంలో మనస్సు, శరీరం ఏకమవుతాయి. యోగాసనాలు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడతాయి. శారీరకంగానూ ప్రయోజనాలు అనేకం. బౌద్ధ, జైన, సిక్కు వంటి ధార్మిక మతాలతోపాటు ఇతర ఆధ్యాత్మిక సాధనల్లోనూ యోగా ప్రాముఖ్యత కనిపిస్తుంది. యోగాన్ని శాస్త్రీయంగా క్రోఢీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి మహర్షి. ఉపనిషత్తులు, భగవద్గీతలోనూ యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనల్లో తేలింది. ఇండియాలో పురుడుపోసుకున్న యోగా ఇప్పుడు ప్రపంచమంతా పాకింది. ఎక్కడ చూసినా యోగా గురించే చర్చ. ఎందరో యోగా గురువులు వచ్చారు. యూట్యూబ్‌ వీడియోలు యోగాసనాలను నేర్పుతున్నాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉంది కాబట్టే యోగా దినోత్సవం నాడు వేలమంది ఒకచోట చేరి యోగా ఆవశ్యకతను దశదిశలా చాటుతున్నారు.
 
ప్రధాని చొరవ వల్లే...సాధ్యమైంది
2014 సెప్టెంబర్ 27. యోగా దినోత్సవానికి బీజం పడిన రోజు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 69వ సదస్సు ఒక గాఢమైన ముద్రలోకి వెళ్లింది. యోగా ప్రాముఖ్యత గురించి ప్రధాని నరేంద్రమోదీ వివరిస్తుంటే.. సభ్యులంతా శ్రద్ధగా ఆలకించారు. యోగా ఒక్క ఇండియాకే పరిమితం కాదని, ఈ భూమ్మీద ప్రతి మనిషికి యోగాసనాలు అవసరమేనని మోదీ తనదైన శైలిలో విడమరిచి చెప్పారు. ప్రతీ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐరాస వేదికగా అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అదే ఏడాది డిసెంబర్ 11న మోదీ ప్రతిపాదనకు ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ 193 సభ్య దేశాలకు 177 దేశాలు ఏకగ్రీవంగా ఓటేశాయి. పండంటి ఆరోగ్యానికి యోగా ఎంతో అవసరమని జనరల్ అసెంబ్లీ తీర్మానంలో పేర్కొంది. రోజూ యోగాసనాలు వేయడం ద్వారా రోగాలు దరిచేరవని, ఎలాంటి మానసిక రుగ్మతలైనా పారిపోతాయని, మానవ జీవితాల్లో సామరస్యం ఇనుమడిస్తుందని అందులో వివరించింది. 

మొట్టమొదటిసారిగా...
2015 జూన్ 21న ఢిల్లీ రాజ్‌పథ్‌లో కేంద్రప్రభుత్వం మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. అదే రోజు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించడం మరో విశేషం. ఒకే వేదికపై 35,985 మంది యోగా చేసిన అతి పెద్ద ఈవెంట్‌తోపాటు 84 దేశాల పౌరులు పాల్గొన్న ఏకైక యోగా కార్యక్రమంగా జంట రికార్డులు నమోదయ్యాయి. ఆ రోజు ఇండియాతోపాటు ప్రపంచమంతా ఉత్సాహంగా యోగా డేని జరుపుకుంది. లక్షలాదిమంది రోడ్ల మీద, పార్కుల్లో, మైదానాల్లో యోగాసనాలు వేశారు. యోగా సందేశాన్ని దశదిశలకు చాటారు. 
 
మానసిక ప్రయోజనాలెన్నో...
యోగా అంటే కేవలం ఆసనాలే కాదు, ధ్యానం కూడా అందులో ఒక భాగం. ధ్యానం, ఆసనాలు మనిషికి బిజీలైఫ్‌ ఒత్తిళ్ళనుంచి ఉపశమనం కలిగిస్తాయి. యోగా వల్ల ఉద్యోగ, వ్యాపార ఒత్తిళ్ళతో డిప్రెషన్‌కి గురైనవారు త్వరగా దానినుంచి బయటపడతారని మానసిక విశ్లేషకుల మాట. అలాగే ధ్యానం మనిషి శరీరాన్ని, మనస్సుని ఏకం చేస్తుంది. తలవని తలంపుగా వచ్చే ఆలోచనలకు చెక్‌ పెడుతుంది. మానసిక ఆహ్లాదాన్ని అందించడంలో యోగాను మించిన సాధనం లేదంటే అతిశయోక్తి కాదు. మానసిక దృఢత్వాన్ని పదిలపరచి, ధైర్యంగా, స్థైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా మనస్సుని సమాయత్తపరుస్తుంది. అలాంటి క్రియాత్మక ఆసనాలు యోగాలో మాత్రమే సాధ్యం. 
 
శరీరానికి పరమౌషధం...యోగా!
మానసికంగా ఉపశమనం కలిగించే యోగా...శారీరకంగా కూడా ఎంతో ప్రయోజనకరం. మొండిరోగాలను నయం చేయగల శక్తి యోగాకు ఉంది. క్రమం తప్పని యోగాతో నేటి ఆధునిక సుఖజీవనంలో భాగమవుతున్న బద్ధకానికి చెక్‌ పెట్టవచ్చు. రేపు చేయచ్చు, మాపు చేయచ్చు వంటి ఆలోచనలు నిత్యం యోగా చేయడం వల్ల దరిచేరవట. ఎప్పటి పనులు అప్పుడు చేసుకునేందుకు ఉత్సాహాన్ని నింపటంలో యోగా ఉపయోగపడుతుందని యోగాపై వెలువరించిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే నేడు ఎక్కడ చూసినా, నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేదు...అందరూ యోగా బాట పడుతున్నారు. పతంజలి యోగసూత్రాలను అనుసరిస్తున్నారు. 
 
మెటబాలిక్‌ సిండ్రోమ్‌కి యోగా...?
జీవనవిధానంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా మారడం వల్ల నేడు... చిన్నపిల్లలనుంచి పెద్దల వరకూ డయాబెటిస్‌, హైబీపీ వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. అయితే వీటికి యోగాతో మంచి పరిష్కారం దొరుకుతుందంటున్నారు. యోగాతో శరీరంలో రక్తప్రసరణ వేగం పెరుగుతుంది. తత్ఫలితంగా చాలావరకు రోగాలు దరిచేరవు. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఎముకలు దృఢమవుతాయి. నిత్యం యోగా చేయడం వల్ల, నిద్రసమస్యలు కూడా ఉండవు. ప్రశాంతమైన నిద్ర ప్రశాంతమైన జీవనానికి సంకేతం.

జ్ఞాపకశక్తిని పెంచుతుంది
యోగా వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచనా విధానం మెరుగుపడతాయంటున్నారు యోగా గురువులు. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. దానివల్ల పెద్దవయసులో వచ్చే అల్జీమర్స్‌ వ్యాధులను నివారించవచ్చు. అలాగే ఏకాగ్రతను పెంచడంతో యోగా బహుముఖ సాధనంగా పనిచేస్తుంది. అందుకే ఏకాగ్రత స్థాయిలు తక్కువగా ఉన్నవారు యోగా చేయాలంటున్నారు. 
 
కొత్తగా రూపుదిద్దుకుంటున్న యోగా!
కాలం మారింది. కాలంతోపాటు మనుషుల ఆలోచనలు, ఆచరణలు మారుతున్నాయి. నయా ట్రెండ్‌లు పుట్టుకొస్తున్నాయి. యోగా అవుట్‌డేటెడ్‌ అని తీసిపారేయకుండా ఆరోగ్యజీవనవిధానమే లక్ష్యమే అప్‌డేటెడ్‌ యోగా వైపు దృష్టిపెడుతున్నారు. బీర్‌యోగా, గోట్‌యోగా, డాగ్‌యోగా, క్యాట్‌యోగాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కొత్తగా పిల్లలకోసం కిడ్స్‌యోగా కూడా వచ్చింది. పార్కుల్లో యోగాభ్యాసాలు సాగుతున్నాయి. కమ్యూనిటీ సెంటర్లు యోగా సెంటర్లుగా మారుతున్నాయి. అంతెందుకు...మహానగరాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు మొదలుకొని, కాలనీల వరకూ వీధి వీధినా యోగా గ్రూపులు ఏర్పడి యోగాభ్యాసాలు సాగిస్తున్నారు. దాంతోపాటే డైట్‌ఫుడ్‌ పట్ల కూడా అవగాహన పెంచుకుంటున్నారు. 
 
పిల్లలకు కూడా ప్రత్యేక యోగా!
నేటి పిల్లలు చదువుల పోటీలో విపరీతంగా అలసిపోతున్నారు. యాక్టివిటీలంటూ ఆయాసపడుతున్నారు. ఒలింపియాడ్‌లు, పోటీపరీక్షలంటూ నిద్రకు దూరమై, ఒత్తిడితో జీవిస్తున్నారు. అందుకే పిల్లలకు కూడా యోగా మంచిదే! అంటున్నారు చైల్డ్‌ సైకాలజిస్టులు. పిల్లల్లో జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో యోగాను మించిన సాధనం లేదంటున్నారు. అలాగే పిల్లలు నీరసపడిపోకుండా వారు ఉల్లాసంగా, ఉత్తేజంగా తమ పనులు తాము చేసుకోవడంలో, వ్యక్తిత్వపరంగా, ఆలోచనాపరంగా యోగా అద్భుతంగా పనిచేస్తుందట. అందుకే ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్‌యోగా సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. మూడేళ్ళ పిల్లలనుంచి కూడా యోగా నేర్పుతున్నారు. కిడ్స్‌యోగా శిక్షణనివ్వటానికి పలు శిక్షణాకేంద్రాలు కూడా వెలుస్తున్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అని తేడాలేదు... కిడ్స్‌యోగా క్లాసులు అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి ఇప్పటినుంచే పిల్లల క్రమబద్ధమైన జీవనానికి యోగా చేయించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పిల్లల మానసిక నిపుణులు. అనేక ఒత్తిళ్ళను తట్టుకుని జీవితమనే పోరాటంలో వారిని విజయులుగా తీర్చిదిద్దడంలో యోగా కూడా తనవంతు పాత్ర నిర్వహిస్తుందని అంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులూ... ఆలోచించండి. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యానికి వారి జీవితంలో యోగాని కూడా ఒక అలవాటుగా మార్చటానికి ప్రయత్నించండి. 

సూర్యనమస్కారాలు–ప్రాధాన్యం
సూర్యనమస్కారాలు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి. యోగాసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానంతో కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్యనమస్కారాలు. నిజానికి సూర్యనమస్కారాలు బ్రహ్మముహూర్తంలో చేస్తేనే మంచి ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. వీటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. సూర్యనమస్కారాలతో శరీర సమతుల్యతను సాధించవచ్చు. అధికబరువు తగ్గడం, జీర్ణప్రక్రియ మెరుగవడంతోపాటు, సూర్యనమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు, మధుమేహం, బీపీ, గుండెజబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉన్న 12 రకాల భంగిమల వల్ల శారీరకంగా, మానసికంగా ఫలితాలెన్నో. వేగంగా చేసే భంగిమలతో కండరాలకు మంచి జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి. గాఢంగా గాలిని పీల్చి వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి నిత్యం సూర్యనమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆచరించి చూడండి...