సంపూర్ణ ఆరోగ్యానికి యోగా!

యోగా..యోగా.. తరగని అందానికీ, చెదరని ఆరోగ్యానికీ, దృఢమైన వ్యక్తిత్వానికీ చిరునామా. ఏ సెలబ్రిటీ ఆరోగ్యరహస్యాన్నడిగినా వెంటనే వచ్చే సమాధానం ‘యోగా’. సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టరు సూచించే ప్రథమ ఔషదం యోగా. యోగ సాధన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు. యోగ సాధనతో సంపూర్ణ, సమగ్ర వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా రూపుదిద్దుకుంటాడు. యోగసాధనతో, వ్యక్తిలో శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక వికాసం అలవడుతుందనేది అనేక అధ్యయనాల సారాంశం.

యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం ఇతర వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితమవుతోంది. యోగ సాధన వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. శ్వాసప్రక్రియపై ఏకాగ్రత ఉంచి సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చు. 

మనోవికాసానికి

యోగ సాధన అంటే సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్రలు, క్రియలు మాత్రమే కాదు. యోగా అంటే అసాధ్యమైన భంగిమలలో మన శరీరాన్ని వంచడమే కాదు. మనసు, శరీరాల సంయోగంతో శ్రద్ధగా యోగా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తపోటు నివారణ, ఒత్తిడి తగ్గడం, బరువు తగ్గడం కొలెస్టరాల్ నియంత్రణ లాంటి ఎన్నో అద్భుతమైన అనుకూల ప్రభావాలు చూపించే యోగా ఇప్పుడు నిపుణులు సూచిస్తున్న ప్రథమ వ్యాయామ విధానం. బరువు తగ్గడానికి మంచి మార్గమైన యోగా అందంగా, ఆరోగ్యంగా ఉండే శరీరాన్ని ఇస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా, మానసిక ఆనందం ఇచ్చే మార్గం యోగానే. సంపూర్ణ మనోవికాసానికి మనోసాధన అవసరం. శరీరం, మనస్సుకి ఉన్న మలినాలు, జాడ్యాలు పోవటానికి సరైన జ్ఞానం మాత్రమే సహాయ పడగలదు. ఇవన్నీ కలిపితేనే సంపూర్ణ యోగసాధన.

బరువు తగ్గడానికి

 ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ పట్టిపీడిస్తున్న సమస్య అధికబరువు. వ్యాయమాలు, ఆహార నియమాలు అంటూ బరువు తగ్గించుకోవడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గడానికి యోగా అద్భుతంగా సహాయపడుతుంది. ఒక సారి డైట్ ప్లాన్‌ను వదిలేశారంటే తిరిగి మళ్ళీ అతి సులభంగా బరువు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి డైట్ ప్లాన్‌తో పాటు రెగ్యులర్‌గా యోగ సాధన చేస్తే తప్పనిసరిగా అధిక బరువును కోల్పోయి స్లిమ్‌గా మారవచ్చన్నది నిపుణుల సూచన. అంతేకాకుండా యోగ సాధనతో ఎల్లప్పుడూ ఒకే బరువును మెయింటైన్ చేయవచ్చని వారి అభిప్రాయం. 

మానసిక ప్రశాంతత 

యోగ సాధన వల్ల మెదడులోని ఆలోచనాత్మక, సృజనాత్మక భాగాల మధ్య సమన్వయం పెరుగుతుంది. శ్వాస క్రియ సాధనసహా సమతౌల్యం తెచ్చే ఇతర ఆసనాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మెదడులోని రెండు భాగాలు సమన్వయంతో పని చేస్తాయి. దీనివల్ల మానసిక పరిణతి సాధిస్తారు. దైనందిన జీవితంలోని నిరంతర కార్యక్రమాలను ఏ ఆటంకం లేకుండా చేసుకుంటారు. అంతర్గత సంభాషణ సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతారు. యోగాతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా తీరిక లేని పనులతో సతమతమయ్యేవారు యోగసాధనకు కాస్త సమయం కేటాయించడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఏ వ్యాయామం అయినా సరైన విధానంలో శ్రద్ధగా సాధన చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. 
 
తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతి 
 జీవనశైలి వల్ల కొంతమందికి తగినంత విశ్రాంతి సమయం లభించదు. మరికొంతమందికి అతి విశ్రాంతి. ఈ రెండు జీవనశైలులు మంచివి కావు. అవసరమైనంత విశ్రాంతి మాత్రమే తీసుకోవటం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే విశ్రాంతికి సమయం లేనివారికి యోగాలో అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలనిచ్చే (దీర్ఘ విశ్రాంతినిచ్చే) ప్రక్రియలు అనేకం ఉన్నాయి. వీటినే యోగనిద్ర లేదా రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అంటారు. ఈ రకమైన యోగసాధన చేయడం వల్ల కేవలం ఐదు నుంచి పది నిమిషాల వ్యవధిలో శరీరం అంతా దీర్ఘ విశ్రాంతి పొందుతుంది. 1-2 గంటలు నిద్రపోతే శరీరానికి ఎంత విశ్రాంతి లభిస్తుందో, కేవలం ఐదు నుంచి పది నిమిషాలలో అటువంటి లోతైన విశ్రాంతి లభిస్తుంది. శరీరంలోని కేంద్ర నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అన్నీ దీర్ఘమైన, లోతైన విశ్రాంతిని పొందుతాయి. తద్వారా శరీరంలో జరిగే జీవక్రియలన్నీ సహజంగా, సామరస్యంగా జరుగుతూ శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. 

మంచి రక్త ప్రసరణ

యోగాలోని వివిధ భంగిమలు, శ్వాస ప్రక్రియల సంయోగంతో శరీరంలో రక్తప్రసరణ సజావుగా సాగుతుంది. రక్త ప్రసరణ బాగుంటే, ప్రాణ వాయువు, ఇతర పోషకాలు శరీరంలో చక్కగా సరఫరా అయి ఆరోగ్యకరమైన అవయవాలు, మెరిసే చర్మం కలిగి ఉండేందుకు దోహదపడుతుంది. స్వల్ప కాలం పాటు శ్వాస నిలిపి ఉంచే వివిధ ఆసనాల వల్ల గుండె, ధమనులు చురుగ్గా పని చేస్తాయి. యోగా వల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. రక్తం గడ్డ కట్టదు. కనుక గుండె సమర్థవంతంగా పనిచేస్తుంది. మంచి ఆరోగ్యం అంటే రోగం లేకపోవడమే కాదు, నిజానికి మన మనసుకు, భావోద్వేగాలకు మధ్య సమతౌల్యం కలిగి వుండడం కూడా. యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. శరీరాన్ని రోగాలకు దూరంగా ఉంచి, చురుగ్గా, ఆనందంగా, ఉత్సాహంగా తయారు చేస్తుంది.

నొప్పుల నివారణ

 శక్తిని, సరళతను ఇస్తుంది కనుకనే యోగా వెన్నునొప్పి, కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. కంప్యూటర్‌ ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే వారు, నిత్యం ఎక్కువ దూరం వాహనాలు నడిపేవారు క్రమం తప్పకుండా యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.  ఎందుకంటే యోగా వెన్ను పూసలో ఒత్తిడిని, బిగుతును తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరాకృతి మెరుగయ్యేలా చేస్తుంది. యోగాలో భాగంగా దీర్ఘంగా, నెమ్మదిగా చేసే వివిధ శ్వాస క్రియల వల్ల ఊపిరితిత్తులు, ఉదర భాగాలకు సామర్ధ్యం పెరుగుతుంది. దీని వల్ల దైనందిన పనితీరు మెరుగు పడుతుంది, సహన శక్తి పెరుగుతుంది. దీర్ఘ శ్వాసల వల్ల కూడా విశ్రాంతి కలిగి శారీరక, మానసిక ఒత్తిడి నుంచి కోలుకునేలా చేస్తుంది.

సమతౌల్యం సాధించేందుకు

వయసు పెరిగే కొద్దీ మెదడుకీ, శరీరానికి సమతౌల్యం దెబ్బతింటుంది. నిత్యం చేసే పనుల్లో శారీరక కదలికలు లేకుండా స్తబ్దుగా ఉండేవారి జీవన శైలిలో ఈ ప్రమాదం ఎక్కువ. దీనివల్ల పడిపోవడం, ఎముకలు విరగడం, వెన్ను పూస ఆరోగ్యంగా లేకపోవడం లాంటి చాలా సమస్యలు వస్తాయి. యోగావల్ల కోల్పోయిన ఈ సమతౌల్యాన్ని, కీలకమైన నియంత్రణను తిరిగి పొందవచ్చు. బలాన్ని, సరళతను పెంచి సమతౌల్యంగా వున్నామనే భావనను యోగా కలిగిస్తుంది. ఈ మార్పు వల్ల మెదడు చురుగ్గా పని చేసి భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి వస్తుంది.

గర్భిణీలకు యోగా!

గర్భం దాల్చిన సమయంలో మనసుపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు యోగా బాగా ఉపయోగపడుతుంది.  యోగ సాధన ద్వారా మానసిక స్థైర్యం పెరిగి భయాలు, అపోహలు తొలిగిపోతాయి. శారీరకంగా, మాననసికంగా దృఢంగా తయారవుతారు. నిత్యం యోగా చేయడం వల్ల అలసట, ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ, జీర్ణ క్రియ, శ్వాస క్రియ మెరుగవుతాయి, నాడీ వ్యవస్థ నియంత్రణలోకి వస్తుంది. గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే నిద్రలేమి, నడుము నొప్పి, కాళ్ళు పట్టేయడం, అజీర్ణం లాంటి సమస్యలనుంచి కూడా బయట పడవచ్చు. కానీ యోగసాధన చేసే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది.
 
అడ్డంకులుఅధిగమించాలి
యోగ సాధన ప్రారంభించిన కొత్తలో కొన్ని అడ్డంకుల వల్ల సాధనకు అంతరాయం కలుగుతుంది. ఆ సమయంలో దృఢమైన నిర్ణయం, బలమైన సంకల్పంతో సాధనకు సమయాన్ని వెచ్చించటం అలవాటు చేసుకోవాలి. ఈ క్రింది అడ్డంకులు అధిగమించి ముందుకెళ్ళాలి.
•యోగ సాధన చేయాలని కోరిక ఉన్నప్పటికి, మనసులో తగిన సంకల్పం లేకపోవటం.
• యోగ సాధనలో ప్రతి విషయంలో అనుమానం కలగటం.
•సాధన విషయంలో ఆలస్యం, సోమరితనం అడ్డంకులుగా మారుతాయి.
• ముహూర్తం కుదరలేదని, టైమ్‌ లేదని, సాకులు చెబుతూ సాధన వాయిదా వేయటం.
• అనారోగ్యం అంటే జ్వరం, దగ్గు, బాగా నీరసం, బాగా తలనొప్పి వల్ల సాధన చేయలేం.
•యోగ సాధన సమయంలో చరవాణి(సెల్‌) ఒక అడ్డంకిగా మారుతుంది. అందువలన సాధనకి ముందే ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో ఉంచాలి.
• టీవీలో వచ్చే కార్యక్రమాలు చూస్తూ యోగ సాధన నిర్లక్ష్యం చేయడం.
•ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌..ఇలా ఏదో ఒక దానిలో మునిగిపోయి సాధనను నిర్లక్ష్యం చేయడం.
ఎన్నో లాభాలు!
యోగాతో ఎన్నో లాభాలు. శారీరక, మానసిక దృఢత్వానికి యోగా దివ్యౌషధం. 
•శ్వాసక్రియ ఇబ్బందులు లేకుండా సులభంగా జరుగుతుంది. ఆక్సిజన్‌తో కూడిన రక్తము శరీరం అంతా బాగా ప్రసరిస్తుంది.
•గ్రంథులన్నీ సహజంగా, సరిపడ హార్మోన్సు విడుదల చేస్తాయి. నాడీ వ్యవస్థతో పాటు శరీరమంతా చక్కని విశ్రాంతి పొందుతుంది.
• యవ్వనం పెరుగుతుంది. ముసలితనం వాయిదా పడుతుంది.
•కళ్ళ సమస్యలు, నిద్ర సమస్యలు తగ్గిపోతాయి.
•కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి.
•చర్మానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సైనస్‌, ఎలర్జీ సమస్యలు తగ్గిపోతాయి.
• తలనొప్పి, మైగ్రేన్‌ (పార్శ్వనొప్పి) తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ సమస్యలు పరిష్కారమవుతాయి.
•మోకాళ్ళ నొప్పులు, మెడనొప్పులు, నడుము నొప్పులు తగ్గిపోతాయి.
• మనస్సు ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి.
• ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ, భావోద్వేగ నియంత్రణ అలవడతాయి. అనవసర ఆలోచనలు అదుపులోకి వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు, పరిష్కరించుకొనే సామర్థ్యం, ధైర్యం పెరుగుతాయి.

•తోటి మనుషులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భావావేశం, దూకుడుతనం తగ్గి, నిదానం, సహనం అలవడతాయి. ఒత్తిడిని ఎదుర్కోగల, వెంటనే తగ్గించుకోగల మెళకువలు అలవడుతాయి.

– హర్షవర్ధన్‌