యాప్‌ ‘యోగం’

ఇక మీదట మీకు నచ్చిన సమయంలో, నచ్చిన ప్రదేశంలో యోగ చేయొచ్చు. అలా చేయాలంటే యోగా నేర్పించే గురువులు ఉండాలి కదా అంటున్నారా? ఆ సందేహం మీకు అక్కర్లేదు యోగా గురువులు అప్లికేషన్‌(యాప్‌) రూపంలో వచ్చేశారు. మీకు అవసరమైన అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు. వీలుపడిన సమయంలో యోగా చేసి శారీరక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉండొచ్చు. ఇందుకు ఉపయోగపడే ఆరు మొబైల్‌ అప్లికేషన్‌ల గురించిన వివరాలే ఇవి... 

ప్రెగ్నెన్సీ ఎక్సర్‌సైజ్‌: ఐఓఎస్‌ మొబైల్‌ ఫోన్లకు మాత్రమే. పదివారాల ప్రెగ్నెన్సీ వరకు ఈ అప్లికేషన్‌ ఉచితం. ఆ తరువాత అంటే 11 నుండి 40 వారాల వరకు మూడువందల రూపాయల రుసుము చెల్లించి వాడుకోవాలి ఈ అప్లికేషన్‌ను. ప్రెగ్నెన్సీ ఎక్సర్‌సైజ్‌ అప్లికేషన్‌లో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్యాల్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన వ్యాయామాలు ఉన్నాయి. ఒక్కోవారానికి తగ్గట్టు శరీరానికి ఏ వ్యాయామం మంచిదో చెప్తుంది. అంతేకాకుండా శక్తి వచ్చేందుకు, కండరాలు టోన్‌ అయ్యేందకు, ఒత్తిడినుంచి బయటపడి సుఖ ప్రసవం అయ్యేందుకు తోడ్పడే వ్యాయామాలు ఇందులో ఉన్నాయి. ఏ వ్యాయామం చేయడం వల్ల శరీరలో ఏ భాగంపై ప్రభావం పడుతుంది, ఎన్నిసార్లు చేయాలి వంటి వివరాలు ఉన్నాయి. ఈ అప్లికేషన్‌లో డ్యూడేట్‌ క్యాలెండర్‌ కూడా ఉంది. డ్యూడేట్‌ను బట్టి ఏ వ్యాయామం సరిపడుతుందో కూడా తెలియచేస్తుంది.
 
యోగా స్టూడియో: ఐఓఎస్‌ ఫోన్‌కు వర్తిస్తుంది. దీని ధర 250 రూపాయలు. ఈ అప్లికేషన్‌లో 65 రకాల యోగా, మెడిటేషన్‌ తరగతులకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. వీటి నిడివి పది నుంచి 60 నిమిషాల పాటు ఉంటుంది. మీరు ఎంత సమయాన్ని కేటాయించగలరు, ఏ స్థాయి వరకు చేయగలరనే అంశాల బట్టి క్లాసులు ఎంపిక చేసుకోవచ్చు. క్లాసులు డౌన్‌లోడ్‌ చేసుకున్నాక వీడియోలు రన్‌ అవ్వడానికి ఇంటర్నెట్‌ కనెక్షన్‌ అవసరం లేదు. యోగా స్టూడియో అప్లికేషన్‌ లైబ్రరీలో 280 యోగా భంగిమలు ఉన్నాయి. మీ షెడ్యూల్‌ను బట్టి క్లాసులకు సంబంధించిన రిమైండర్‌లు కూడా పంపుతుంది.
 
ఎ పోజ్‌ ఫర్‌ దట్‌: ఐఓఎస్‌, విండోస్‌లో దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ధర 190 రూపాయలు. శరీరానికి వచ్చే జబ్బులు, మానసిక రుగ్మతల నుండి బయటపడాలంటే సరైన భంగిమలో ఆసనాలు వేస్తే చాలని నమ్ముతారు యోగా గురువులు. ఆ సూత్రం ఆధారంగా తయారుచేసిందే ఎ పోజ్‌ ఫర్‌ దట్‌ అప్లికేషన్‌. ఇందులో 88 భంగిమలు ఉన్నాయి. అన్ని భంగిమలకీ సంబంధించిన ఫోటోలు, సూచనలున్నాయి. వ్యాధులు, శక్తి తదితర అంశాల ఆధారంగా వీటిని ఎనిమిది రకాలుగా వర్గీకరించారు. వీటిని నెలసరి, వెన్నునొప్పి, డిప్రెషన్‌లతో పాటు పలు శారీరక సమస్యల ఆధారంగా 30 రకాలుగా విభజించారు. ఒక్కో సెషన్‌ 30 నిమిషాల వ్యవధితో ఉంది. ఈ అప్లికేషన్‌లో ఉన్న మరో ఫీచర్‌ ఏమిటంటే రోజుకో పోజును పోస్టు చేస్తుంది. ఈ యాప్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటే ‘యోగా-పీడియా’ అనే ఉచిత వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 
పాకెట్‌ యోగా: ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రీ, విండోస్‌ ఫోన్లలో ఈ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ధర 190 రూపాయలు. సముద్రం, ఎడారి, పర్వతాలు అనే మూడు రకాల విన్యాసాలను ఆధారంగా చేసుకుని ఇందులో సెషన్స్‌ ఉంటాయి. 30 నుంచి 60 నిమిషాల వ్యవధితో ఉంటా యి ఈ సెషన్‌లు. వీటిని యోగా చేయడం తాజాగా మొదలుపెట్టిన వాళ్లు, ఇప్పటికే చేస్తున్న వాళ్లు, నిష్ణాతులు అని మూడు రకాలుగా విభజించారు. ఇందులో ఉన్న మరో సౌలభ్యం యోగా సెషన్‌లను యాపిల్‌ టివి లేదా ఎయిర్‌ప్లే రిసీవర్‌ ద్వారా ప్రసారం చేసుకోవచ్చు.

ఐదు నిమిషాల యోగా: ప్రస్తుతానికి ఐఓఎస్‌ ఫోన్‌కి మాత్రమే వర్తిస్తుంది. ధర 60 రూపాయలు. ఈ ఐదు నిమిషాల యోగాలో 350 కంటే ఎక్కువ సెషన్‌లే ఉన్నాయి. చాలా తక్కువ వ్యవధి అని ఆలోచించనక్కర్లేదు. ఎందుకంటే ఐదు నిమిషాల్లోనే ప్రభావంతంగా చేసే సెషన్‌లు ఉన్నాయి. యోగా కొత్తగా మొదలుపెట్టే వాళ్లకి బాగుంటుంది. ఒక్కో భంగిమ గురించి వివరించి ఆయా భంగిమల్ని సరిగా చేసేలా సూచనలు ఉన్నాయి ఇందులో. ఒత్తిడి, ఆందోళన, వ్యతిరేక భావనలను వదిలేసి జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే వాళ్లు 28 రోజుల కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. 

కిడ్స్‌ యోగావెర్స్‌: ఇదికూడా ఐఓఎస్‌కు మాత్రమే. నాలుగు నుంచి ఎనిమిదేళ్ల పిల్లలకోసం ప్రత్యేకంగా తయారుచేసిన అప్లికేషన్‌ ఇది. పిల్లలు సులభంగా యోగా చేసేలా చేతితో వేసిన ఇలుస్ర్టేషన్‌లు ఉన్నాయి ఇందులో. పోజుతో పాటు దాన్ని ఎలా చేయాలి, శ్వాస ఎలా తీసుకోవాలి చెప్తారు. పిల్లలకి సులభంగా అర్థమయ్యేలా రూపొందించారు. ఈ అప్లికేషన్‌ రెండు వెర్షన్‌లలో లభిస్తోంది. ఐ యామ్‌ లవ్‌. దీని ధర 250 రూపాయలు. ఐ యామ్‌ సన్‌, ఐ యామ్‌ మూన్‌ల ధర 300 రూపాయలు. ఐ యామ్‌ లవ్‌లో 13 భిన్నమైన భంగిమలు ఉంటాయి. ఇవి రోజును ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉపయోగపడతాయి. ఐయామ్‌ సన్‌, ఐ యామ్‌ మూన్‌లలో 19 భంగిమలు ఉంటాయి. ఇవి శారీరకంగా, మానసికంగా పిల్లలు శక్తివంతులుగా ఎదిగేలా తోడ్పడతాయి.