యోగా ‘థెరపీ’

కొందరు ప్రత్యామ్నాయ వైద్యంగా భావిస్తారు. కొందరు అనుబంధ చికిత్సగా ఆమోదిస్తారు. కొందరు పరిపూర్ణ వైద్యమనీ విశ్వసిస్తారు. ఎలా అయితేనేం, యోగాకు వైద్య ప్రతిపత్తి లభిస్తోంది. జాతీయ అంతర్జాతీయ అధ్యయనాలు ‘యోగా థెరపీ’ ప్రభావాన్ని నిర్ధారిస్తున్నాయి. (జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం) 

 
ఇప్పటిదాకా...
అంతెత్తు ఆకారం. కొనదేలిన ముక్కు. అరమోడ్పు కళ్లు. పద్మాసన ముద్ర. గుబురైన గడ్డం. పతంజలిని తలుచుకోగానే ఓ మహర్షి రూపమే కళ్లముందు మెదులుతోంది.
ఇక ముందు...
మరో రూపంలోనూ ఊహించుకోవచ్చు. ఒంటిమీద తెల్లకోటు, మెడలో స్టెతస్కోపు, చేతిలో రక్తపోటును కొలిచే పరికరం.
బల్లమీద నేమ్‌ప్లేట్‌...
డాక్టర్‌ పతంజలి
యోగా థెరపిస్ట్‌
 
నిన్నమొన్నటిదాకా, వైద్య ప్రపంచం యోగాను గుర్తించలేదు. ఆసనాల్ని ఆమోదించలేదు. ప్రాణాయామానికి పసలేదని గేలి చేసింది కూడా.
పరిస్థితులు మారుతున్నాయి. సాక్షాత్తు ఇంగ్లీషు వైద్యులే యోగాసనాలు వేయమంటున్నారు. తామే స్వయంగా సాధన చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో యోగా విభాగాలు వెలుస్తున్నాయి. తెల్లవారుజామున ఓంకారం వినిపిస్తోంది. యోగా... ‘యోగ చికిత్స’గా, ‘యోగా థెరపీ’గా ప్రాచుర్యం పొందుతోంది. రోగి ఆరోగ్య స్థితిని బట్టి... కొన్నిసార్లు ప్రధాన చికిత్సగా, కొన్నిసార్లు అనుబంధ చికిత్సగా మారిపోతోంది. ఈ మార్పు.. యాదృచ్ఛికం కాదు, అనివార్యం. 
కొన్ని దశాబ్దాల క్రితం వరకూ... అంటువ్యాధులు ప్రపంచాన్ని కలవరపెట్టాయి. శక్తిమంతమైన ఆవిష్కరణలతో ఆ సంక్షోభాన్ని నిలువరించగలిగాడు మనిషి. అంతలోనే మరో విపత్తు. 
ఈసారి జీవనశైలి వ్యాధులు ప్రకోపించడం ప్రారంభించాయి... ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగం, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్‌.
ఒత్తిడితో చిత్తయిపోయిన మనసులు, వ్యాయామమంటూ లేని శరీరాలు, నిర్జీవమైన జీవనవిధానం, కాలకూటంలో ముంచితేల్చిన తిండి, నిలువునా ముంచేసే వ్యసనాలు... చెట్టంత మనిషిని అస్తిపంజరంలా మార్చేస్తున్నాయి. 
 ఈ తప్పుల కుప్పను శుభ్రం చేయగల శక్తి ఏ పాశ్చాత్య వైద్య విధానానికీ లేదు. మనిషిని మనిషిగా కాకుండా - అవయవాల సమాహారంగా... కాలికి కాలునూ వేలికి వేలునూ వేరుచేసి చూసే హ్రస్వదృష్టి వాటిది. 
అప్పుడే...
యోగా కనిపించింది. 
‘శరీరం మీదా, మనసు మీదా యోగా ప్రభావం ఎంత?’ అన్న కోణంలో విశ్వవిద్యాలయాలూ, వైద్య సంస్థలూ అధ్యయనాలు ప్రారంభించాయి. 
ఏకకాలంలో -
శరీరానికి స్వస్థతనూ...
మనసుకు సాంత్వననూ...
అందించగలిగే శక్తి యోగాకు ఉందనీ, యోగాకు మాత్రమే ఉందనీ అర్థం చేసుకున్నారు. 
‘పవర్‌ ఆఫ్‌ యోగా’ ప్రపంచానికి తెలిసిపోయింది.
 
యోగ చికిత్సకు పతంజలి అష్టాంగయోగమే ఆధారం. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం - విడివిడిగా దేనికదే శక్తి కేంద్రం. మూడూ కలిస్తే మహాశక్తే! 
ఆసనం అంటే పీఠం. ఓ పీఠం మీద నువ్వు కూర్చునే భంగిమే... యోగాసనం! ఆసుపత్రి దాకా అక్కర్లేదు. ల్యాబ్‌ రిపోర్టులూ అవసరం లేదు. నువ్వు ఎంతసేపు సుఖంగా, సౌకర్యంగా కూర్చోగలుగుతున్నావ్‌? - ఈ చిన్న పరీక్ష చాలు, నీ ఆరోగ్య పరిస్థితిని బేరీజు వేయడానికి.
పతంజలి పరమలక్ష్యం.. ఆధ్యాత్మిక ఉన్నతి. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే సుదీర్ఘ సాధన చేయాలి. గంటల తరబడి ఏకాగ్రతతో కూర్చోవాలి. శరీరం నీ స్వాధీనంలో ఉన్నప్పుడే, ఇదంతా సాధ్యం. ఆ పట్టు ఆసనాలతో వస్తుంది. రోజువారీ జీవితంలో పాతికశాతం శరీరంలోనూ కదలిక ఉండదు. అదే యోగాలో... వందశాతం కదలిక ఉంటుంది. పతంజలి మహర్షి యోగశాస్ర్తాన్ని సంకలనం చేసే సమయానికే వందలకొద్దీ ఆసనాలున్నాయి. కాలక్రమంలో ఇంకొన్ని వచ్చి చేరాయి.
ప్రాణాయామం... ప్రాణశక్తి మీద నియంత్రణను ఇస్తుంది. ‘స్వర్ణకారుడు బంగారాన్ని నిప్పుల కొలిమిలో కాల్చి, అందులోని మలినాల్ని వేరు చేసినట్టు... సాధకుడు ప్రాణాయామం ద్వారా తనలోని చెడును తొలగించుకుంటాడు’ అంటుంది యోగశాస్త్రం. శరీరాన్ని ఓ యంత్రంతో పోల్చవచ్చు. మెషీన్‌లో ఓ పెద్ద చక్రం ఉంటుంది. దాని కిందనో, పక్కనో అంతకంటే కాస్త చిన్న చక్రం ఉంటుంది. అంతకన్నా చిన్న చక్రం, అంతకన్నా చిన్నచిన్న చక్రాలు... ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటన్నింటినీ నడిపించే మూలచక్రమేదో ఉండితీరుతుంది. అదే యంత్రానికి ఆధారం. శరీర యంత్రానికి కూడా అలాంటిదే ఒకటుంటుంది. దానికే ‘ప్రాణశక్తి’ అని పేరుపెట్టారు. శ్వాసను నియంత్రించడం ద్వారా, ప్రాణశక్తిని కూడా నియంత్రించవచ్చని మన పెద్దలు కనిపెట్టారు. అందుకు ప్రాణాయామాన్ని ఓ మార్గంగా ఆవిష్కరించారు. 
ఆలోచనల తెప్పలు మనిషిని స్థిమితంగా ఉండనీయవు. బెల్లం చుట్టూ ఈగల్లా, పువ్వు చుట్టూ తుమ్మెదల్లా ముసురుకుంటూనే ఉంటాయి. అన్నింటినీ బుర్రలోకి ఎక్కించుకుంటే పిచ్చాసుపత్రి పాలే. అందులోంచి అవసరమైన వాటినే ఏరుకోవాలి. మిగతా చెత్తనంతా రిసైకిల్‌బిన్‌లో పడేయగలగాలి. ఆ ఎరుక ధ్యానంతో ఒంటబడుతుంది. 
యోగా... శరీరాన్ని దార్లో పెడుతుంది. ప్రాణాయామం... ప్రాణశక్తినిస్తుంది. ధ్యానం... ఆలోచనల మీద నియంత్రణ ఇస్తుంది. పతంజలి అష్టాంగయోగలో ఈ మూడూ మూడు మెట్లు. అక్కడిదాకా వెళ్లామంటే, సగం దూరం ప్రయాణించినట్టే. ఇంకో సగం ప్రయాణం తర్వాతే... మానసిక, శారీరక, ఆధ్యాత్మిక పరిపూర్ణత. అంటే, ఇంకో ఐదు మెట్లు ఎక్కాలి.
‘యమ’ సంఘంలో ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది. అందులోనూ కొన్ని ఉపసూత్రాలు. అహింస... హింస వద్దంటుంది. సత్యం... రుజు మార్గంలో నడుచుకోమంటుంది. అపరిగ్రహం... పరులసొమ్మును ఆశించవద్దంటుంది. అస్తేయం.. నేను, నాది అన్న సంకుచిత భావన కూడదంటుంది. బ్రహ్మచర్యం... అనైతిక బంధాలకు దూరంగా ఉండమంటుంది. 
‘నియమం’... శారీరక, మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుంది. శౌచం (పరిశుభ్రత), తనస్సు (సాధన), స్వాధ్యాయం (ఆత్మవికాసం), ఈశ్వర ప్రణిధానం (జీవితం క్షణభంగురమన్న ఎరుక) - ఇందులో ప్రధానమైనవి. 
మరో మెట్టు.. ‘ప్రత్యాహారం’. ఇంద్రియాలు వేరూ మనం వేరూ అన్న ప్రజ్ఞ, పంచేంద్రియాలపై పట్టు. చివరిమెట్టు... ‘సమాధి’. సమత్వంతో నిండిన బుద్ధే సమాఽధి. ఈ దశకు చేరుకుంటే ప్రపంచమే తనదైపోతుంది, తనే ప్రపంచం అవుతాడు.
పతంజలి మహర్షి... చేయితిరిగిన లెక్కల మాస్టారిలా ఓ గొప్ప ఫార్ములా తయారు చేసి పెట్టారు. ఆ ప్రకారంగానే.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ, ఒక్కో భ్రమా తొలగించుకుంటూ, ఒక్కో జాడ్యాన్నీ వదిలించుకుంటూ ముందుకెళ్ల గలిగితే... అనారోగ్యపు ఆనవాళ్లులేని శరీరం, నెగెటివ్‌ భావనలు లేని మనసు మన సొంతం అవుతాయి. ఇక... అధిక రక్తపోట్లు ఉండవు, ఊబకాయాలుండవు, బలహీనమైన గుండెలు ఉండవు, బలవన్మరణాలూ ఉండవు. ఆయుష్మంతులైన పౌరులతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం! 
క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలో పతంజలి మహర్షి... ఆవిష్కరించిన ‘యోగా జీవనశైలి’లోని మంచిని అర్థం చేసుకోడానికి, ఆచరణయోగ్యమని ఆమోదించడానికి, భారతీయ యోగా ‘గ్లోబల్‌ యోగా’గా అవతరించడానికి... వేల సంవత్సరాలు పట్టింది. 

మనో వైద్యం...

యోగా... నేరుగా మనసు మీదే గురిపెడుతుంది. సకల రుగ్మతలకూ మూలం మనసేనంటుంది. అధి (ఒత్తిడి) అన్న మాటలోంచే ‘వ్యాధి’ పుట్టుకొచ్చింది. మనోమయకోశంలోని చికాకులే... అన్నమయ కోశంలో సమస్యలకు కారణం అవుతాయనీ, తీవ్ర శారీరక రుగ్మతలకు దారి తీస్తాయనీ యోగాచార్యులు హెచ్చరిస్తారు. మనోజయమే మహాజయం. మనసును గెలిచినవాడు ప్రపంచాన్ని గెలవగలడు. ప్రపంచాన్ని గెలిచినా, మనసును గెలవలేకపోతే మాత్రం.. పాతాళానికే. యోగ సాధన ప్రారంభించిన కొద్దికాలానికే కనిపించే తొలి ప్రభావం... ఒత్తిడి నుంచి విముక్తి. అర్థంలేని ఆలోచనలన్నీ కొమ్మ మీది పిట్టల్లా ఎగిరిపోతాయి. సెరొటొనిన్‌, డోపమైన్‌ మొదలైన ఒత్తిడి వ్యతిరేక హార్మోన్ల ఊట పెరుగుతుంది. అనుబంధాల హార్మోన్‌ ఆక్సిటోసిన్‌ చొరవతో జీవితం పట్ల మమకారం రెట్టింపు అవుతుంది. 
యోగాకూ, గాబా అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ ఊటకూ ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు. ఒత్తిడి, భయం, ఆందోళన తదితరాల్ని నిలువరించే శక్తి దీనికుంది. గాబా లోపంతో... స్కిజోఫ్రేనియా, మూర్ఛవ్యాధి తదితర సమస్యలొచ్చే ఆస్కారం ఉంటుంది. ఆమధ్య జర్నల్‌ ఆఫ్‌ అటెన్షన్‌ డిజార్డర్స్‌ ఓ కేస్‌ స్టడీని ప్రచురించింది... ఏకాగ్రత లోపమూ, మహామొండితనమూ ఉన్న పిల్లలకు ఓ విద్యాసంస్థవారు యోగచికిత్స ఇప్పించారు. ఆరునెలల వ్యవధిలోనే ఆ విద్యార్థుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. వయోధికుల జ్ఞాపకశక్తిని కొండచిలువలా మింగేసే అల్జీమర్స్‌కు యోగనిద్రలో పరిష్కారం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.
కుంగుబాటు ప్రభావాలు ఏ రూపంలో అయినా ఉండవచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఓ గాయనికి విదేశాల్లో స్థిరపడిన యువకుడితో వివాహమైంది. ఇక్కడి కెరీర్‌ను వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అలా అని, భర్తకు దూరంగానూ ఉండలేదు. ఆ సమస్య కారణంగా ఆమె కుంగుబాటుకు గురైంది. స్వరపేటికలో సమస్యలొచ్చాయి. భ్రమరి ప్రాణాయామ, కపాలభాతి, నాడీశుద్ధి ద్వారా... ఆమె మునుపటిలా పాడగలుగుతోంది ఇప్పుడు. 
ఓ విదేశీ వైద్య సంస్థ వారు అబ్సస్సివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌తో బాధపడే రోగులకు చికిత్సలో భాగంగా యోగా నేర్పించారు. కొంతకాలం తర్వాత... సగానికి సగం మందికి మందుల అవసరం లేకపోయింది. మిగతా సగం మందికి డోసేజీ తగ్గించారు. 
హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన సత్బీర్‌ఖల్సా ఇన్‌సోమ్నియా (నిద్రలేమి)కి యోగాను ఓ చికిత్సగా పరిచయం చేశారు. ఆ ప్రభావాల మీద ఆయన ఓ పెద్ద అధ్యయనమే చేశారు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఫిజీషియన్స్‌ సాధారణ ఆందోళనను తగ్గించడానికి యోగాను సిఫార్సు చేసింది. శక్తిమంతమైన మాత్రతో సమానంగా రోగికి ఉపశమనాన్ని ఇస్తుందని ప్రకటించింది. ఒకటేమిటి, మనసుతో ముడిపడిన ఏ సమస్యకైనా యోగాలో జవాబు ఉంది. 

మధుమేహానికి....

భారతీయులకు జన్యుపరంగానే మధుమేహపు ముప్పు ఉంది. తాతముత్తాతలు బలమైన తిండితో, ఒత్తిడిలేని జీవనశైలితో ఆ సమస్యను అధిగమించేవారు. మన దాకా వచ్చేసరికి... పాశ్చాత్యుల ప్రభావంతో దండగతిండి అలవాటైపోయింది. వ్యసనాలూ చుట్టుముట్టేశాయి. ‘మధుమేహానికి యోగాను మించిన పరిష్కారం లేదు’ అంటారు నాసా మాజీ సైంటిస్టు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ పూర్వ విద్యార్థి డాక్టర్‌ నాగేంద్ర. ఈయన ప్రస్తుతం బెంగళూరులోని వివేకానంద యోగా యూనివర్సిటీకి ఛాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘గాఢమైన రిలాక్సేషన్‌’ అనేది మధుమేహానికి అడ్టుకట్ట వేస్తుంది. ఆస్థాయి రిలాక్సేషన్‌ ఎనిమిది గంటల నిద్రతోనూ సాధ్యం కాదు. అయితే, అరగంట ధ్యానంతో ఆ మహాప్రశాంత స్థితికి చేరుకోవచ్చు. వివేకానంద యోగ విశ్వవిద్యాలయం.. ‘మధుమేహ నియంత్రిత భారత్‌ అభియాన్‌’ పేరుతో ఓ పెద్ద కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అరవై జిల్లాల్లో... రెండున్నర లక్షలమంది మీద అధ్యయనం ప్రారంభించింది. పన్నెండు వందలమంది యోగాచార్యులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముప్పై అయిదుమంది పరిశోధకులు పరిశీలకులుగా వ్యవహరించారు. 
మధుమేహ రోగుల్ని రెండు బృందాలుగా విభజించి... మొదటి బృందంతో యోగా సాధన చేయించారు. రెండో బృందంతో మాత్రం సాధారణ వ్యాయామాలు చేయించారు. నిర్ణీతకాలం తర్వాత యోగసాధకుల బృందంలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. చాలామందిలో, మధుమేహ తీవ్రత వందశాతం నుంచి పదిహేను శాతానికి పడిపోయింది. ఏ క్షణంలో అయినా తీపి రాకాసి బారినపడే ప్రమాదం ఉన్న ‘ప్రీ డయాబెటిక్స్‌’ విషయంలో అయితే... ఆ ఆనవాళ్లే కనిపించకుండా పోయాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామంతో పాటు... ఫైబర్‌ ఎక్కువ, కార్బొహైడ్రేట్లు తక్కువ, కొవ్వు దాదాపుగా లేని శుద్ధ శాకాహారాన్ని సాధకులకు అందించారు. ఇదే మార్గంలో వెళ్లగలిగితే... దేశం నుంచి మధుమేహాన్ని తరిమేయడం సాధ్యమేనంటారు నాగేంద్ర. 

క్యాన్సర్‌ చికిత్సలో...

రోబోలు సర్జరీలు చేస్తున్నాయి. ఓ చిన్న గాటుతో మహామహా శస్త్రచికిత్సలూ సాఽఽధ్యం అవుతున్నాయి. కానీ, క్యాన్సర్‌ మహమ్మారిని మాత్రం పూర్తిగా నిలువరించలేక పోతున్నాం. ఆ రుగ్మత తాలూకు... ప్రభావాలు రోగిని వణికించేస్తున్నాయి. చికిత్స కంటే చావే నయమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భాలూ ఉన్నాయి. ఆ పరిస్థితిని అధిగమించడంలో ‘యోగా థెరపీ’ సాయపడుతుంది. యోగా అనేది క్యాన్సర్‌ చికిత్సలో నేరుగా సహకరించదు కానీ... ఆ సమయంలో రోగికి అవసరమైన మానసిక బలాన్ని ఇస్తుంది. చికిత్స కారణంగా ఏర్పడే... డీఎన్‌యే నష్టాన్ని నివారించడంలోనూ, కీమో-రేడియో థెరపీల దుష్ప్రభావాల్ని నియంత్రించడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. 
ఛాతీ క్యాన్సర్‌ మహిళల్ని తీవ్ర నిస్పృహకు గురిచేస్తుంది. కుంగుబాటుకు గురైపోయి... ఏ అఘాయిత్యానికో పాల్పడేవారు అనేకం. ఓ క్యాన్సర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్న దాదాపు వందమంది రోగుల మీద ఒక అధ్యయనం జరిగింది. యోగ సాధన తర్వాత చాలామంది రోగం తాలూకు డిప్రెషన్‌ నుంచి బయటపడినట్టు ఫలితాలు చెబుతున్నాయి. నిజానికి, క్యాన్సర్‌ రోగుల్లోని మానసిక సమస్యల్ని వైద్య ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు. మందుల తీవ్ర ప్రభావాలు జీవన నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయి. అలాంటి సందర్భాల్లోనూ.. యోగా, ధ్యానం, ప్రాణాయామం నొప్పిని తట్టుకునే శక్తిని ఇచ్చినట్టు రోగులు అంగీకరించారు. సాత్వికాహారం ద్వారా అన్నమయ కోశంలో, ధ్యానం-ప్రాణాయామం ద్వారా మనోమయ కోశంలో పునరుత్తేజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది యోగ చికిత్స. శస్త్రచికిత్సకు సిద్ధం అవుతున్న రోగుల్లోనూ యోగా భయాన్నీ, నిస్పృహనూ పారదోలినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 

గుండెకు ఆసరా...

ఊబకాయం, ధూమపానం, ఒత్తిడి, మధుమేహం, అధిక రక్తపోటు.. అన్నీ కలసి గుండెను గునపపుపోట్లకు గురి చేస్తున్నాయి. హృద్రోగాన్ని నిలువరించడానికి యోగా అత్యుత్తమ మార్గమని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. గుండెజబ్బులకు ‘యోగా జీవనశైలి’లో పరిష్కారం ఉందని అంగీకరించింది. 
ప్రాణాయామం... ఎక్కువ శ్వాస, తక్కువ ఆయుర్దాయం... తక్కువ శ్వాస, ఎక్కువ ఆయుర్దాయం- మన పెద్దల లెక్క ఇది. నిమిషానికి ముప్పైరెండుసార్లు శ్వాసించే కోతి మహా అయితే పదేళ్లు బతుకుతుంది. అదే, నిమిషానికి నాలుగైదుసార్లు మాత్రమే శ్వాసించే తాబేలు నిక్షేపంగా వెయ్యేళ్లు జీవిస్తుంది. మన ఉద్వేగాల్ని బట్టి శ్వాస మారిపోతూ ఉంటుంది. కోపం, ఆవేశం లాంటి నెగెటివ్‌ ఉద్వేగాలు శ్వాస గతిని పెంచుతాయి. అంటే, చావుకు దగ్గర చేస్తాయి. పూరక-కుంభక-రేచక-శూన్యక స్థితులతో కూడిన ప్రాణాయామంతో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటాం. చిత్రకూట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు దీనిమీద లోతైన అధ్యయనం చేశారు. అనేక శ్వాసకోశ సమస్యల్ని యోగాతో నియంత్రించ వచ్చని గుర్తించారు. నాడీశోధన ప్రాణాయామ ద్వారా.. ఊపిరితిత్తుల సామర్థ్యం గణనీయంగా పెరిగినట్టు హరిద్వార్‌లోని దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. ఇలాంటి ప్రయత్నమే న్యూదిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ కూడా చేసింది. మహిళల్లో మెనోపాజ్‌ ప్రభావాల్ని తగ్గించడంలో యోగా పాత్ర కీలకమేనంటున్నారు పరిశోధకులు. అయితే, యోగ సాధన అన్నది నిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి.
సాధారణ యోగ సాధన వేరు. యోగ చికిత్స వేరు. యోగా థెరపీలో అందరికీ ఒకే చికిత్స ఉండదు. సమస్య తీవ్రతను బట్టి, రోగి మానసిక స్థితిని బట్టి... ఓ ప్రత్యేక విధానాన్ని ఎంచుకుంటారు యోగ వైద్యులు. యోగసాధన.... మాత్ర మింగేయడమో, టానిక్‌ పుచ్చుకోవడమో కాదు. ఒక పూట వ్యవహారమో, ఒక రోజు పనో కానేకాదు. సుదీర్ఘ సాధన అవసరం. యోగా... ఆశావాదుల చికిత్సా విధానం. అలా అని, నిరాశావాదులు చిన్నబుచ్చుకోనక్కర్లేదు. వెంటనే సాధన ప్రారంభిస్తే సరిపోతుంది. యోగాతో ఆశావాదమూ మెరుగు అవుతుంది. 
- పారేపల్లి బలరామ ప్రసాదరావు
యోగా నిపుణులు (9177370169)
 
‘ఆరోగ్య’ ఆసనాలు...

వజ్రాసనం 

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఉదర సంబంధ వ్యాధులను నివారిస్తుంది. తొడభాగాలలో రక్త ప్రసరణను పెంపొందిస్తుంది.

 
శలభాసనం 
తుంటి నొప్పి, సయాటికాల నుంచి ఉపశమనాన్నిస్తుంది. నాడీ వ్యవస్థను చైతన్య పరుస్తుంది. మెడ, నడుము భాగాలకు శక్తినిస్తుంది. ఆకలిని పెంచుతుంది.
 
మత్స్యాసనం 
ఉదర సంబంధ వ్యాధులతోపాటు... పైల్స్‌, ఆస్తమా, బ్రాంకైటిస్‌లను నివారిస్తుంది. రోగనిరోధక శక్తినిస్తుంది. జననేంద్రియాల లోపాలను 
సవరిస్తుంది. 
 

శశాంకాసనం

కోపాన్నీ భావోద్వేగాల్నీ నియంత్రిస్తుంది. 

 

ధనురాసనం

తుంటి నొప్పి, మెడ నొప్పుల నుంచి ఉపశమనాన్ని ప్రసాదిస్తుంది. గుండె, ఊపిరితిత్తులకు శక్తినిస్తుంది. వివిధ గ్రంథులలోని లోపాలను సవరిస్తుంది. మూత్ర పిండాలకు వ్యాయామాన్ని ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

 
గోముఖాసనం 
మధుమేహం, మూత్రపిండ వ్యాధులు, కీళ్ళ వ్యాధుల నుంచి ఉపశమనాన్నిస్తుంది. మెడ, వెన్ను భాగాలకు శక్తినిస్తుంది. ఒత్తిడిని చిత్తు చేస్తుంది.
 
అర్ధమత్స్యేంద్ర ఆసనం 
వెన్నెముక, ఉదరభాగాలకు శక్తినిస్తుంది. విసర్జక క్రియను మెరుగుపరుస్తుంది.
 
సేతుబంధాసనం 
ఆస్తమా,  బ్రాంకైటిస్‌ నుంచి ఉపశమనాన్నిస్తుంది. 
 
మండూకాసనం
క్లోమగ్రంథిని ఉత్తేజపరచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. 
 
ఉష్ర్టాసనం 
ప్రత్యుత్పత్తి, జీర్ణవ్యవస్థల్లోని లోపాలను సవరిస్తుంది. థైరాయిడ్‌ లోపాలను సరిచేస్తుంది. వెన్నెముకకు బలాన్నిస్తుంది. 
 
సుప్తవజ్రాసనం 
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. 
వెన్ను కండరాలను పటిష్టపరుస్తుంది. ఛాతీని విశాలం చేస్తుంది. ఆస్తమాను నివారిస్తుంది.
 

హలాసనం

వెన్ను, మెడలను శక్తిమంతం చేస్తుంది.

 
సింహగర్జన ఆసనం
స్వరాన్ని మెరుగు పరుస్తుంది. నత్తిని తొలగిస్తుంది. చెవి, ముక్కు, గొంతు సమస్యలను నివారిస్తుంది.
 

భుజంగాసనం

కాలేయం, మూత్రపిండాలు, వెన్నెముక తదితరాలను బలోపేతం చేస్తుంది.