నిద్ర కోసం శ్వాస!

ఆంధ్రజ్యోతి, 05/05/2015: మారిన జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిళ్ల వల్ల చాలామంది ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నారు. ఇలాంటివాళ్లందరికీ ఒక శుభవార్త! రోజూ కంటి నిండా నిద్రపోవాలంటే కేవలం అరవై సెకండ్లపాటు శ్వాస సంబంధమైన కొన్ని వ్యాయామాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందిట. కంటినిండా నిద్ర పోగలుగుతారట. యాంగ్జయిటీ సమస్యను సైతం అధిగమించగలరట. వీళ్లు 4-7-8 బ్రీతింగ్‌ విధానాన్ని అనుసరిస్తే మంచి నిద్ర పడుతుందట. టెన్షన్‌, నిద్రలేమి సమస్యలు తగ్గడానికి రోజుకు రెండుసార్లు ‘రిలాక్సింగ్‌ బ్రీత్‌’ చేస్తే మంచిదట. ఈ టెక్నిక్‌ నాడీ వ్యవస్థ మీద నేచురల్‌ ట్రాక్విలైజర్‌లా పనిచేస్తుందిట. అంతేకాదు ఇది యోగ, మెడిటేషన్‌ పద్ధతులను పోలి ఉంటుందిట. శరీరానికి కావాల్సినంత రిలాక్సేషన్‌ ఇస్తుందిట. 4-7-8 బ్రీతింగ్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ చేయడం ఏ మాత్రం కష్టం కాదు. ఈ వ్యాయామానికి పట్టే సమయం కూడా చాలా తక్కువ. అంతేకాదు ఈ శ్వాస వ్యాయామాలు చేయడానికి ఎలాంటి పరికరాలూ అవసరం లేదు. ఎక్కడైనా, ఎప్పుడైనా అనుకున్నదే తడవుగా చేయొచ్చు. ఈ వ్యాయామాలను రోజుకు రెండుసార్లు చొప్పున ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వీటిని చేయడం వల్ల నిద్రపట్టడమే కాదు ఈ టెక్నిక్‌పై మంచి పట్టును సాధించగలరు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్వాస సంబందమైన ఈ వ్యాయామాలను నిటారుగా కూర్చుని చేయాలి.

ఆ వ్యాయామాలు... 
  • నోటి ద్వారా గాలిని బయటకు గట్టిగా వదలాలి. 
  • నోటి ని మూసివుంచి ముక్కు ద్వారా గాలిని లోపలికి పీల్చుకుంటూ నాలుగంకెలు లెక్కపెట్టాలి. 
  • ఏడంకెలు లెక్కపెట్టేవరకూ ఊపిరిని బిగబెట్టి ఉంచాలి. 
  • ఎనిమిదంకెలు లెక్కపెట్టడం పూర్తయ్యే దాకా నోటి ద్వారా గాలిని బయటకు వదులుతుండాలి. 
  • ఇవన్నీ కలిపి ఒక బ్రీత్‌ కింద లెక్క. ఇలా పైన చెప్పిన నాలుగు శ్వాస సంబంధమైన వ్యాయామాలను మూడుసార్లు చేయాలి.
ఇవి చేసేటప్పుడు ముక్కు ద్వారా గాలిని పీల్చేటప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి. అలాగే నోటి నుంచి గాలిని బయటకు శబ్దం వచ్చేలా వదలాలి. ఒకొక్క వ్యాయామాన్ని ఎంతసేపు చేశామన్నది ఇందులో ముఖ్యం కాదు. 4:7:8 నిష్పత్తి ప్రకారం చేశామా లేదా అన్నదే ముఖ్యం. అంతేకాదు ఈ మొత్తం ప్రక్రియలో ఊపిరిని ఎనిమిది సెకన్లు బిగపట్టి ఉంచడం ప్రధానమైంది. గాలిని లోపలికి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి ప్రాణవాయువు వెడుతుంది. అది శరీరం మొత్తానికి అందుతుంది. అదనపు ఆక్సిజన్‌ రిలాక్సింగ్‌ ఎఫెక్టును ఇస్తుంది. ఎలా ఊపిరి తీస్తున్నాము, ఎలా ఊపిరిని వదులుతున్నాము అన్న అంశాలపై దృష్టిపెట్టడం వల్ల ఎలాంటి మానసిక ఒత్తిడికీ గురికారు. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేసే పని మీద ఏకాగ్రత పెట్టగలుగుతారు. యోగ, మైండ్‌ఫుల్‌నెస్‌ విధానాల్లో కూడా మైండ్‌ మీద ఫోకస్‌ చేయడం కోసం శ్వాస సంబంధమైన వ్యాయామాలను చేస్తారు. అలాగే ప్రశాంతమైన నిద్రకు పైన చెప్పిన శ్వాస సంబంధమైన వ్యాయామాలు ఇచ్చే సౌఖ్యం ఎంతో.