స్వీట్‌ యోగ

ఆంధ్రజ్యోతి, 12/08/2014: మన దేశంలో డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య గడియారపు ముల్లు కంటే వేగంగా పరుగులు తీస్తోంది. దానివల్లే డయాబెటిక్‌ పరంగా ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నాం మనం. డయాబెటిక్‌ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనేది ఎక్కువమందికి తెలిసిన విషయమే. అయినప్పటికీ మందులు వేసుకుంటున్నాం కదా పర్వాలేదులే అనుకుంటారు కొందరు. ఈ ఆలోచన మీలో కూడా ఉంటే మీ ఆరోగ్యాన్ని చేతులారా మీరే పాడుచేసుకుంటున్నట్టు. అలా కాకుండా ఉండాలంటే మందులు వేసుకోవడంతో పాటు, ఆహారపు అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక వ్యాయామం దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. డయాబెటిక్‌తో బాధపడుతున్న వాళ్లకోసం ప్రత్యేకంగా కొన్ని యోగాసనాలు ఉన్నాయి. అవి... 

పశ్చిమోత్తాసనం: నేలపై కూర్చొని వీపు భాగం నిటారుగా ఉంచి, కాళ్లు ముందుకు చాపాలి. నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి ఎత్తాలి. తరువాత శ్వాస బయటికి వదులుతూ మోకాళ్లమీద తల ఆన్చాలి. చేతులతో అరి పాదాలను పట్టుకోవాలి. 30 సెకన్లు ఈ ఆసనంలో ఉన్న తరువాత నెమ్మదిగా శ్వాస పీలుస్తూ పైకి లేచి శ్వాస బయటకు వదలాలి.
 
కొత్తగా ఈ ఆసనం చేసే వాళ్లు మోకాళ్ల మీదకు తల ఆన్చలేకపోయినా పర్వాలేదు. తల ఎంతవరకు ఆనితే అంతవరకే చేయండి. చేస్తుంటే అదే వస్తుతంది.
 
హలాసనం: నేల మీద వెల్లకిలా పడుకుని కాళ్లు రెండూ పైకి 90 డిగ్రీల కోణంలో ఎత్తాలి. రెండు అరచేతుల్ని నేలకి ఆన్చి లేపి ఉంచిన కాళ్లను నెమ్మదిగా తల వెనకకు తేవాలి. అలా 30 సెకన్లు ఉండాలి.
 
ఈ రెండు ఆసనాలను ఉదయాన్నే ఏమీ తినకముందు చేయాలి. 
చక్రాసనం(ఎ): శవాసనంలో పడుకోవాలి. ఆ తరువాత రెండు కాళ్లను ముడవాలి. నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకుంటూ ఫోటోలో చూపించిన విధంగా పైకి లేవాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు తల రెండు చేతుల మధ్యన ఉండేలా చూసుకోవాలి. ఇలా 30 సెకన్లు ఉన్నాక నెమ్మదిగా శవాసనంలోకి రావాలి. 
చక్రాసనం (బి): ఈ ఆసనం కూడా పైన చెప్పిన విధంగానే చేయాలి. ముందు శవాసనంలో పడుకుని తరువాత శ్వాసను లోపలికి తీసుకుంటూ పైకి లేవాలి. అలా లేచాక నెమ్మదిగా ఒక కాలుని పైకి లేపాలి. ఇలా రెండు కాళ్లతో చేయాలి. ఈ ఆసనంలో కూడా 30 సెకన్లు ఉండాలి. ఆసనం పూర్తయ్యాక శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. 
మెడ, వెన్ను, తలనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలేవైనా ఉన్న వాళ్లు వైద్యుల్ని సంప్రదించి, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఆసనాలు వేయాలి.
 
తీసుకోవాల్సిన ఆహారం... 
  • ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న పదార్థాల్ని చేర్చాలి.
  • సోయా, చికెన్‌ బ్రెస్ట్‌ పీస్‌, ఆకుకూరలు, టొమాటో, పచ్చి కారెట్లు తినాలి. వీటితో పాటు రాత్రిళ్లు ఉడికించిన బ్రకోలి తినాలి.
  • తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు ఆహారంలో చేర్చాలి. అలాగని స్కిమ్‌ మిల్క్‌ కాదు. తక్కువ కొవ్వు ఉన్నవే వాడాలి.
  • డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులు రక్త పీడనం హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకని ఉదయం లేవగానే సగం అరటిపండు లేదా ఒక యాపిల్‌ తినాలి. ఒక రోజు అరటిపండు, ఒకరోజు యాపిల్‌ తింటే మంచి ఫలితం ఉంటుంది.
 
మాన్సి గులాటి
అంతర్జాతీయ యోగ నిపుణురాలు 
హైదరాబాద్‌