బరువుతో జ్ఞాపకశక్తి

ఆంధ్రజ్యోతి, 05/10/2014: బరువులు ఎత్తే వ్యాయామాలు చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట. ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్న సత్యమిది. రోజూ జిమ్‌కి వెళ్లండి...వెయిట్‌ లిఫ్టింగ్‌ చేయండి అని కూడా కొంతమంది శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. రోజూ 20 నిమిషాలపాటు తీవ్రంగా వెయిట్‌లిఫ్టింగ్‌ వ్యాయామాలు చేయడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని చె బుతున్నారు. జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అధ్యయనకారులు కొంతమంది మీద ఈ స్టడీని చేశారు. బరువులు ఎత్తడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంద న్నారు శాస్త్రవేత్తలు. కొంతమంది చేత వెయిట్‌ లిఫ్టింగ్‌ వ్యాయామాలు చేయించారు. రెండురోజుల తర్వాత వారికి జ్ఞాపకశక్తి పరీక్షను పెట్టారు. ఈ వ్యాయామాలు చేయడానికి ముందు 90 వరకూ ఫోటోలను కంప్యూటర్‌ స్ర్కీన్‌ మీద వారికి చూపించారు. రెండు రోజుల తర్వాత వీరి చేత ఆ ఫోటోలను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. 90 పాత ఫోటోలకు మరో 90 కొత్త ఫోటోలను కలిపి ఫోటోలను గుర్తించమన్నారు. వీటిలో 60 శాతం ఫోటోలను వ్యాయామం చేసిన వారు గుర్తిస్తే, వ్యాయామం చేయనివారు 50 శాతం మేర మాత్రమే ఫోటోలను గుర్తించారు.