దూకుడుకు ధ్యానం కరెక్ట్‌

మీ పిల్లలకు దూకుడెక్కువా? తోటి విద్యార్థులను లెక్క చేయరా? క్లాస్‌ సరిగ్గా వినరని రోజూ టీచర్‌ కంప్లయింట్‌ చేస్తోందా? అయితే మీ పిల్లలకు మెడిటేషన్‌ నేర్పించండి. మార్పు మీరే చూస్తారు.
 
చిన్న పిల్లలను కుదురుగా కూర్చోబెట్టి క్లాస్‌ చెప్పడం టీచర్లకు రోజూ సవాలే! భయపెట్టి, బతిమాలి క్లాస్‌ చెప్పాల్సి వస్తుంది. అలాకాకుండా పిల్లలు బుద్దిమంతుల్లా కూర్చుని క్లాస్‌ వినడం, తోటి విద్యార్థులతో ప్రేమగా మసలుకోవడం చేస్తే ఎలా ఉంటుంది. అంతకన్నా సంతోషం ఏముంటుందంటారా? అయితే మీ స్కూల్లో మెడిటేషన్‌ పాఠాలు చెప్పండి. పిల్లలు మెడిటేషన్‌ చేయడం వల్ల చురుకుగా మారడం, సైలెన్స్‌గా క్లాస్‌ వినడం చేస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఇతర విద్యార్థులతో పోల్చితే మెడిటేషన్‌ ప్రొగ్రామ్స్‌లో పాల్గొన్న విద్యార్థులు 15 శాతం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నట్లు కూడా నిర్ధారణ అయింది.
 
మరింత ప్రేమ, దయ 
నాలుగు, ఐదు తరగతులు చదువుతున్న పిల్లలను ఏకాగ్రత పెంచే, మనోల్లాసాన్ని అందించే ప్రొగ్రామ్స్‌లో పాల్గొనేలా చేయడం ద్వారా వారిలో తోటివారి కంటే మెరుగైన సామాజిక ప్రవర్తన కలిగి ఉండేలా తయారవుతారు. దూకుడు తగ్గుతుంది.
 
మంచి మార్కులు 
రోజూ ధ్యానం చేసే పిల్లలు తోటి వారి కంటే 15 శాతం ఎక్కువ మార్కులు సాధించగలుగుతారని అధ్యయనంలో తేలింది. 
ఏడీహెచ్‌డీ లక్షణాలు తగ్గుతాయి 
యోగా, ఏకాగ్రత పెంచే కార్యక్రమాల్లో పిల్లలు 8 వారాలు పాల్గొన్నప్పుడు వారిలో ఏడీహెచ్‌డీ లక్షణాలు బాగా తగ్గుతాయి. హైపర్‌యాక్టివిటీ కూడా తగ్గుతుందని నిరూపణ అయింది.
 
స్వీయ నియంత్రణ 
మూడేళ్లపాటు మెడిటేషన్‌ ప్రొగ్రామ్‌లు నిర్వహించిన పాఠశాలలో పిల్లల సస్పెన్షన్‌ రేటు 28 నుంచి 4 శాతానికి పడిపోయింది.
 
డిప్రెషన్‌ 
తొమ్మిది మెడిటేషన్‌ క్లాసులు విన్న 12 నుంచి 16 ఏళ్ల పిల్లలు తొమ్మిది డిప్రెషన్‌ క్లాసులు అటెండ్‌ కావడంతోనే వారిలో డిప్రెషన్‌ బాగా తగ్గిపోయింది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభించింది. మెడిటేషన్‌ ప్రొగ్రామ్స్‌లో పాల్గొనని పిల్లలతో పోల్చితే వీరు మంచి సౌష్ఠవాన్ని పొందారు.
 
 
ఫోకస్‌ పెరిగింది 
ఎలిమెంటరీ స్థాయిలో మెడిటేషన్‌ క్లాసులు నిర్వహించడం ద్వారా పిల్లల్లో బెటర్‌ ఫోకస్‌, సెల్ఫ్‌ కంట్రోల్‌, క్లాస్‌ పార్టిసిపేషన్‌, తోటి విద్యార్థులను గౌరవించడం వంటివి పెరిగాయని టీచర్లు దృవీకరించారు. కాబట్టి మీ పిల్లలకు తీరిక చేసుకుని తప్పనిసరిగా ధ్యానం అలవాటు చేయండి. వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారు అవుతారు.