యోగాతో నిగనిగలాడే జుట్టు

ఆంధ్రజ్యోతి, 19/06/2014: శిరోజాల ఆరోగ్యం మీ శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని ఆయుర్వేద వైద్యులు నిర్ధారిస్తుంటారు. ఒకవేళ జుట్టు రాలుతున్నట్లయితే శరీరంలో ఏదో అనారోగ్యం ఉన్నట్లుగా భావించాలి. సాధారణంగా జుట్టు రాలడానికి ఒత్తిడి, హార్మోనల్‌ డిజార్డర్స్‌, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, మందులు, జుట్టుకు వేసుకునే రంగులు, జన్యుపరమైన వ్యాధులు, స్మోకింగ్‌ వంటివి కారణమవుతాయి. అయితే రోజూ యోగా చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యమైన జుట్టును సొంతం చేసుకోవడమే కాకుండా మొత్తం శరీర వ్యవస్థకు శారీరకంగా, మానసికంగా లాభం చేకూరుతుంది. యోగా వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది. జుట్టు రాలే సమస్య ఉన్నట్లయితే కింది ఆసనాలు వేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. 


అధోముఖ శవాసన 
ఈ ఆసనం వేయడం వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో జుత్తుకు బలం లభిస్తుంది. సైనస్‌, జలుబు వంటి సమస్యలున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది. మానసిక అలసట దూరమవుతుంది. డిప్రెషన్‌, ఇన్సోమ్నియా వంటి స్లీపింగ్‌ డిజార్డర్స్‌ దూరమవుతాయి. 

ఉత్తానాసన 
నీరసాన్ని దూరం చేయడంలో ఈ ఆసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మెనోపాజ్‌ లక్షణాల నుంచి ఉపశమనాన్ని అందించడంలోనూ ఈ ఆసనం బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. 

వజ్రాసన 
మిగతా ఆసనాలన్నింటికన్నా భిన్నంగా ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే యోగా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఒక్క ఆసనాన్ని మాత్రం భోజనం చేసిన వెంటనే వేయాలి. ఈ ఆసనం జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా మూత్రాశయ సంబంధ వ్యాధులను, పొట్టలో గ్యాస్‌ను, అధిక బరువును తగ్గిస్తుంది. 

ఆపానాసన 
శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. జీర్ణాశయ వ్యవస్థకు తగిన శక్తిని అందిస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. 

పవనముక్తాసన 
గ్యాస్‌ను దూరం చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ ఆసనం వేయడం ద్వారా వీపు భాగంలోని కండరాలు బలోపేతం అవుతాయి. పొట్ట, పిరుదుల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. 

సర్వాంగాసన 

ఈ ఆసనం థైరాయిడ్‌ గ్రంధి పనితీరును పెంచుతుంది. శ్వాసకోశవ్యవస్థ, నరాల వ్యవస్థ పనితీరును ప్రేరేపిస్తుంది. 

కపాలభాతి ప్రాణాయామం 
మెదడులోని కణాలకు ఎక్కువ ఆక్సిజన్‌ అందేలా చేస్తుంది. శరీరంలోని టాక్సిన్స్‌ బయటకు పంపించడంలోనూ ఉపకరిస్తుంది. డయాబెటిస్‌ను, అధికబరువును తగ్గిస్తుంది. 

భస్ర్తిక ప్రాణాయామం 
పొట్టలోని అదనపు గ్యాస్‌ని బయటకు పంపిస్తుంది. నరాల వ్యవస్థను ప్యూరిఫై చేస్తుంది. అన్ని రకాల జబ్బులను నిరోధిస్తుంది. 

నాడీ శోధన ప్రాణాయామం 
గుండె జబ్బులు, ఆస్తమా, ఆర్థరైటిస్‌, డిప్రెషన్‌, మైగ్రేన్‌, సె్ట్రస్‌, కంటి, చెవి సమస్యలను దూరం చేయడానికి ఈ ఆసనం ఉపకరిస్తుంది. 

గుర్తుంచుకోవాల్సిన అంశాలు... 
యోగాసనాలు చేయడంతో పాటు ఆహార నియమాలు పాటించడం అవసరం. తాజా పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. జుట్టుకు నిమ్మ రసం పెట్టుకుని స్నానం చేయడం, కొబ్బరినూనెతో మసాజ్‌ చేయడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు. అదే సమయంలో అలంకరణ కోసం కెమికల్స్‌ ఉండే ఉత్పత్తులను జుట్టుకు పట్టించడం చేయడం మంచిది కాదు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు.